హైదరాబాద్ లో దారుణం... సొంత అక్కను నరికి చంపిన కులోన్మాదం!
2020 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ నాగమణి, శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
By: Tupaki Desk | 2 Dec 2024 7:11 AM GMTఈ సమాజంలో ఇప్పటికీ చాలా మందిని మత పిచ్చి కబోదులను చేస్తుంటే.. కుల పిచ్చి ఉన్మాదులను చేస్తుందనే చర్చ బలంగా జరుగుతుంది. కులమతాలపై ఉన్న అభిమానం కాస్తా ఉన్మాదానికి, మనిషిలోని రాక్షసత్వాన్ని ప్రేరేపించడానికి సహకరిస్తుంది! ఈ సమయంలో కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో పోలీస్ అక్కను నరికి చంపాడు ఓ తమ్ముడు!
అవును... తెలంగాణ రాష్ట్రలో అత్యంత దారుణం జరిగిపోయింది. కులాంతర ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో లేడీ కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు పరమేష్ దారుణంగా నరికి చంపాడు! రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది!
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి.. నేడు (డిసెంబర్ 2) ఉదయాన్నే స్వగ్రామం రాయపోలు నుంచి హయత్ నగర్ వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె కోసం దారికాచిన తమ్ముడు పరమేష్.. ముందుగా కారుతో ఢీకొట్టి, తర్వాత మెడపై నరికాడని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
తమకు ఇష్టం లేకపోయినా మరో సమాజికవర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో.. నాగమణి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట. అయితే... ఈ ఆగ్రహంలో మానవత్వం, తోబుట్టువు అనే విషయాలను అతనిలో ఉన్న కులోన్మాదం కప్పివేసిందో ఏమో కానీ.. తోడబుట్టిన అక్కను నడిరోడ్డుపై నరికి చంపాడు!
కాగా... 2020 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ నాగమణి, శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు వివాహం తర్వాత హయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో నాగమణి సొంత గ్రామానికి వెళ్లిందట.
ఈ క్రమంలో సోమవారం ఉదయానే స్కూటీపై స్టేషన్ కు తిరిగి వస్తుండగా.. ఆమె తమ్ముడు ఈ దారుణానికి ఒడిగట్టాడు! అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడని తెలుస్తోంది. దీంతో... నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారని సమాచారం!