విశాఖలో ఘోరం.. ఇంటికి వెళ్లి తహసీల్దార్ ను చంపేశారు
ఉక్కునగరంగా.. ప్రశాంతమైన జీవనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విశాఖపట్నం ఈ ఉదయం (శనివారం) ఒక్కసారిగా ఉలిక్కిపడింది
By: Tupaki Desk | 3 Feb 2024 5:36 AM GMTఉక్కునగరంగా.. ప్రశాంతమైన జీవనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విశాఖపట్నం ఈ ఉదయం (శనివారం) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విశాఖ నగరానికి నడిబొడ్డు లాంటి మధురవాడలోని ఒక అపార్టుమెంట్ కు వెళ్లి.. ఒక తహసీల్దార్ ను మర్డర్ చేయటం షాకింగ్ గా మారింది. శుక్రవారం రాత్రి వేళ జరిగిన ఈ హత్యోదంతం ఇప్పుడు సంచలనమైంది. ఆయన హత్య వెనుకున్న అసలు కారణం మాత్రం బయటకు రాలేదు.
మధురవాడలోని కొమ్మాదిలో ఒక అపార్టుమెంట్ లో ఐదో అంతస్థులో విశాఖ రూరల్ తహసీల్దార్ గా వ్యవహరిస్తున్నారు రమణయ్య. మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను విశాఖరూరల్ నుంచి విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి ట్రాన్సఫర్ చేశారు. శుక్రవారమే విజయనగరం వెళ్లి బాధ్యతలు స్వీకరించి విశాఖపట్నం వచ్చిన ఆయన్ను రాత్రి వేళ పది గంటల సమయంలో ఎవరో కలవటానికి వచ్చారు.
దీంతో.. తన ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి.. లిఫ్టులో కిందకు దిగారు. అపార్టుమెంట్ గేట్ వద్ద ఒకరిని కలిసినట్లుగా సీసీ కెమేరాల ఫుటేజ్ లో బయటపడింది. అయితే.. కాసేపటికి వారిద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సదరు గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కోపంలో ఉన్న అతడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో తహసీల్దార్ ను బలంగా కొట్టారు. దీంతో ఆయన కుప్పకూలిపోయారు. ఇదంతా గమనించిన అపార్టు మెంట్ వాచ్ మెన్ కుటుంబ సభ్యులు ఆయన్నుఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు పోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఇంతకూ తలమీద రాడ్ కొట్టిన వ్యక్తి ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.