'2026 మార్చి 31'... తాజా ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు!
ఛత్తీస్ గఢ్ దండకారణ్యం మరోసారి తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లింది. తాజాగా బీజాపుర్, కాంకేర్ జిల్లాల్లో ఒకేరోజు వేర్వేరు ఎన్ కౌంటర్లు జరిగాయి.
By: Tupaki Desk | 21 March 2025 2:00 AM ISTఛత్తీస్ గఢ్ దండకారణ్యం మరోసారి తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లింది. తాజాగా బీజాపుర్, కాంకేర్ జిల్లాల్లో ఒకేరోజు వేర్వేరు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో బీజాపుర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కూడా అమరుడైనట్లు వారు వెల్లడించారు.
అవును... ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో.. బీజాపూర్ లో 26 మంది, కాంకేర్ లో నలుగురు కలిపి మొత్తం 30 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా 2026 మార్చి 31 మరోసారి గుర్తుచేశారు.
వాస్తవానికి.. గురువారం ఉదయం నుంచి జరిపిన కూంబింగ్ ఆపరేషన్ లో తొలుత 22 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం... మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమయంలో మృతుల సంఖ్య 30కి పెరిగిందని తెలుస్తోంది. అయితే.. తొలుత 22 మంది మావోయిస్టులు మృతిచెందారు అనే ప్రకటన రాగానే షా స్పందించారు.
ఇందులో భాగంగా... ఎన్ని రకాలుగానూ సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కొంతమంది నక్సలైట్లు లొంగిపోవడం లేదని.. అలాంటి వారిపట్ల మోడీ సర్కార్ కఠిన వైఖరి అవలంబిస్తోందని.. నేడు మన సైనికులు "నక్సల్ ముక్త్ భారత్ అభియాన్" దిశగా మరో భారీ విజయాన్ని నమోదు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇదే సమయంలో... ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్, కాంకెర్ లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్స్ లో 22 మంది నక్సలైట్లు హతమయ్యారని వెల్లడించారు. ఈ సందర్భంగా... 31 మార్చి 2026 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని అమిత్ షా పునరుద్ఘాటించారు.
కాగా... ఈ ఏడాది ఇప్పటికే రెండు వరుస భారీ ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జనవరి 20న ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లోని నౌపాడ, గరియాబంద్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లో 20 మంది మావోలు చనిపోగా.. ఫిబ్రవరి 9న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది నక్సలైట్లు మృతి చెందారు.