అంతా డీకేనే చేస్తున్నారా? కర్ణాటకలో కలకలం వెనుక?
కర్ణాటకలో తెరమీదకు వచ్చిన రాజకీయ కలకలం వెనుక
By: Tupaki Desk | 27 July 2023 2:30 AM GMTకర్ణాటకలో తెరమీదకు వచ్చిన రాజకీయ కలకలం వెనుక .. చాలా వ్యూహం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇంకేముంది.. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ బయట రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తోందని.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విషయం తనకు తెలియదని సీఎం సిద్దరామయ్య అన్నారు.
ఇక, ఈ పరిణామాలను ఒకింత లోతుగా చూస్తే.. అసలు కలకలం బీజేపీ వల్ల కాదని.. కాంగ్రెస్‌తోనేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీఏకంగా 135 స్థానాలు తెచ్చుకుని, బలమైన పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ సర్కారును కూల్చి వేసే ప్రయత్నం బీజేపీ చేసే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా.. మరో 8 మాసాల్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. తిరిగి మూడోసారి కూడా కేంద్రంలో పాగా వేయాలని చూస్తున్న మోడీకి ఈ పరిణామం శరాఘాతం అవుతుంది.
కర్ణాటకలో కనుక బీజేపీ.. దూకుడు పెంచి కాంగ్రెస్ సర్కారును గద్దె దింపితే.. ఏకంగా దేశవ్యాప్తంగా మోడీ ప్రభ మసక బారుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అయితే.. బీజేపీ ఆ పనిచేసే అవకాశం లేదు. ఒక వేళ కర్నాటకలో కాంగ్రెస్‌ను కూల్చేయాలని అనుకున్నా.. ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగే వరకు.. వేచి చూస్తుంది. ఇది రాజకీయ వ్యూహం. ఈ నేపథ్యంలో అసలు విషయం.. అంతా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న డీకేనే ఇలా చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం దక్కించుకోవడం వెనుక.. ఖచ్చితంగా.. డీకే పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కూడా కావాలని అనుకున్నారు. కానీ, అధిష్టానం.. మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఆయనపై కేసులు ఉన్నాయని భావించి తప్పించారు. అయితే.. ఎంతైనా సీఎం సీటుపై ఆశ వదలని డీకేనే ఇలా.. ఏదో తెలియని, లేని కలకలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నది పరిశీలకుల అంచనా. ఏం జరుగుతుందో చూడాలి.