Begin typing your search above and press return to search.

చిల్లరపోగేసి లాటరీ టిక్కెట్ కొన్నారు... రూ. 10కోట్లు కొట్టారు!

కొంతమంది కటిక పేదరికంలో ఉన్న మహిళలకు రాత్రికి రాత్రి కలిసొచ్చింది

By:  Tupaki Desk   |   28 July 2023 7:47 AM GMT
చిల్లరపోగేసి లాటరీ టిక్కెట్ కొన్నారు... రూ. 10కోట్లు కొట్టారు!
X

కాలం గాళం వేస్తే మహా సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే ఫిష్.. కాకా హోటల్ లో డిష్ అవుతుందని అంటుంటారు.. ఇదే సమయంలో కాలం కరుణిస్తే కటిక పేదవాడు కూడా కుబేరుడైపోతాడని అంటుంటారు. మొదటిది రెగ్యులర్ గా జరిగేదే కానీ... చాలా అరుదుగా జరిగే రెండో సంఘటన తాజాగా జరిగింది.

అవును... కొంతమంది కటిక పేదరికంలో ఉన్న మహిళలకు రాత్రికి రాత్రి కలిసొచ్చింది. మామూలుగా కాదు.. వారూ ఊహించనంత, జీవితంలో సంపాదించలేనంత!! లాటరీ టిక్కెట్ కొనడానికి సైతం డబ్బులు లేక, చంద్రాలు వేసుకుని మరీ కొన్న టిక్కెట్ కోట్లు పలికింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు.. అనే మాట చిన్నదైపోతుందనేలా ఉంది పరిస్థితి.

వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని మలప్పురం జిల్లాలో గల పరప్పణగాడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన అనే విభాగం ఉంది. ఈ బృందంలోని సభ్యులు భూమిలో కలిసిపోని వ్యర్థాలను ఇళ్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపిస్తారు. ఈ విభాగంలో పనిచేస్తున్న 11 మంది మహిళలు కొద్ది వారాల క్రితం లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.

అనుకున్నదే తడువుగా లాటరీ టిక్కెట్లు అమ్మేవారి దగ్గరకు వెళ్లారు. కానీ... ఆ లాటరీ టికెట్‌ ధర రూ.250గా ఉండటంతో వెనుదురుదామనుకున్నారు. కారణం... ఆ మహిళల్లో ఎవరిదగ్గరా అంత సొమ్ము లేదు. దీంతో... తమ దగ్గరున్న చిల్లరంతా పోగు చేశారు. ఓ మహిళ అయితే ఆ చిల్లర కూడా లేక తెలిసినవారి నుంచి అప్పుకూడా తీసుకుని ఇచ్చింది. ఏదోలా కిందా మీదా పడి ఆ 11 మంది రూ.250 జమచేసి లాటరీ టికెట్‌ కొన్నారు.

అనంతరం ఆ విషయాన్ని పక్కనపెట్టి వారిపనిలో వారు బిజీ అయిపోయారు. ఈ సమయంలో కేరళ లాటరీ డిపార్ట్‌ మెంట్‌ గత బుధవారం డ్రా తీసింది. ఈ లక్కీ డ్రాలో ఈ మహిళలు కొన్న టికెట్‌ కే జాక్‌పాట్‌ తగిలింది. ఈ లాటరీ ప్రైజ్‌ మనీ రూ.10కోట్లు అని ప్రకటించింది. దీంతో ఆ మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఈ సందర్భంగా మాట్లాడిన మహిళలు... అంతకుముందు కూడా చాలా సార్లు లాటరీ టికెట్ కొన్నామని తెలిపారు. కాకపోతే అప్పుడు విడివిడిగా కొన్నామని.. ఇప్పుడు మాత్రం అంతాకలిసి డబ్బులు జమచేసుకున్న కొన్నామని తెలిపారు. అలా కొన్న టికెట్‌ కు లాటరీ తగిలిందని, తమకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు.

ఇదే సమయంలో హరిత కర్మ సేన విభాగంలో పనిచేసే తామందరికీ చాలా కష్టాలు ఉన్నాయని... ఆడపిల్లల పెళ్లిళ్లు, అప్పులు, వైద్యం ఖర్చులు ఇలా ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నాయని తెలిపారు. ఈ డబ్బుతో సమస్యలు అన్నీ తీరతాయని ఆనందంగా చెబుతున్నారు.