శరద్ పవార్ కుమరో షాక్... పిక్చర్ క్లియర్?
ఎన్సీపీలో ఏదో జరుగుతుంది
By: Tupaki Desk | 21 July 2023 3:58 AM GMTఎన్సీపీలో ఏదో జరుగుతుంది. ఎమ్మెల్యేలంతా చీలిపోతున్నారు. శరద్ పవార్ ను కాదని అజిత్ పవార్ వైపు వెళ్లిపోతున్నారు. అయితే ఇది బీజేపీ అనుసరిస్తున్న విభజించు పాలించు పద్దతి అని కొంతమంది ఆరోపిస్తున్నారంట. మరోవైపు శరద్ పవార్ కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారు.
అవును... మహారాష్ట్ర ఎన్సీపీలో ఇప్పటికే చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా నాగాలాండ్ ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే పనికి పూనుకున్నారు.
మహారాష్ట్ర ఎన్సీపీ నేతలు కొంతమంది శరద్ కు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని కథనాలొస్తున్న వేళ... తాజాగా నాగాలండ్ ఎమ్మెల్యే లు షాక్ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ నుంచి ఎన్సీపీ తరఫున గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ పూర్తి మద్దతును అజిత్ పవార్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
దీంతో మరోసారి ఎన్సీపీ లోని అంతర్గత వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇది పూర్తిగా అజిత్ పవార్ శక్తి సామర్ధ్యాల ఫలితమా.. లేక, తెరవెనుక బీజేపీ అనుసరిస్తున్న వైఖరి ఫలితమా అనేది తెలియాల్సి ఉంది!
కాగా... ఈ నెల ప్రారంభంలో శరద్ పవార్ సోదరుడి కుమారుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ పార్టీని నిలువునా చీల్చిన సంగతి తెలిసిందే. ఆయన 8మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి శిందే నేతృత్వంలోని శివసేన- బీజేపీ కూటమిలో చేరిపోయారు.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తో కలిసి వచ్చిన వచ్చిన 8 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రభుత్వం మంత్రి పదవులు ఇవ్వగా.. అజిత్ పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నాగాలాండ్ ఎమ్మెల్యేలు కూడా అజిత్ కే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
అయితే తిరుగుబాటు అనంతరం కూడా అజిత్.. శరద్ పవార్ తో రెండుసార్లు భేటీ కావడం విశేషం. తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. దీంతో మళ్లీ వీరిద్దరూ కలుస్తారన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఈ విషయంపైనా.. అజిత్ వర్గ ఎమ్మెల్యేల విజ్ఞప్తిపైనా రెండు రోజులపాటు మౌనం వహించారు శరద్ పవార్. అనంతరం ఇటీవల బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షతన నిర్వహించిన విపక్షాల సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆ రెండు వర్గాలు మళ్లీ కలిసే పరిస్థితి లేకపోవచ్చని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.