మణిపూర్ వీడియో ఘటన... అమిత్ షా కీలక వ్యాఖ్యలు!
మణిపూర్ లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 28 July 2023 8:19 AM GMTమణిపూర్ లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు ఈ విషయంపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో... పార్లమెంటుకు మోడీ గైర్హాజరయ్యారు. ఈ సమయంలో అమిత్ షా కీలక వాఖ్యలు చేశారు.
అవిశ్వాస తీర్మానం పెట్టి అయినా మణిపూర్ విషయంపై మోడీతో మాట్లాడించాలని ప్రయత్నించాయి విపక్షాలు. ఈ విషయంలో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి పక్కపెడితే... మోడీ స్పందించలేదు! కానీ... సీబీఐ ఎంక్వైరీ వేశారు. ఫలితంగా ఇంక ఎవరు ఏ ప్రశ్న అడిగినా... ఈ ఒక్క మాట కాగితం పై రాసుకుని చూపిస్తే సరిపోతుందని అంటున్నారు!
దీంతో మణిపూర్ ఘటన అనంతరం, పార్లమెంట్ సమావేశాల్లో గైర్హాజరు అనంతరం మోడీ స్థాయి ఆల్ మోస్ట్ పడిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పందించారు. ఇందులో భాగంగా... ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక కుట్ర దాగి ఉందనేది తేల్చాల్సి ఉందని తెలిపారు.
అవును... మణిపూర్ పరిణామాలు.. మహిళల నగ్న ఊరేగింపు ఘటన కేసుపై సుప్రీం కోర్టుకు హోం శాఖ నివేదించిన అంశాలను అమిత్ షా మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంలో గతంలో జరిగిన విషయాలు వెల్లడించారు. మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఆ వీడియోను వైరల్ చేసి ఉంటారని అంటున్నారు.
దీంతో... ఆ ఘటన జరిగినదానికంటే ఎక్కువగా.. ఆ వీడియో వైరల్ అయ్యి బీజేపీ పరువు పోయినందుకే అమిత్ షా అధికంగా బాదపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఆ సంగతి అలా ఉంటే... 1990 నుంచి మణిపూర్ లో జాతుల నడుమ ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
కేంద్రంలో, మణిపూర్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. 1993లో నాగా-కుకీ, 1993 మే నెలలో మెయితీ-పంగల్, 1995లో కుకీ-తమిళులు, 1997-98 నడుమ కుకీ-పైతే ఘర్షణలు జరిగాయని చెప్పారు అమిత్ షా. ఇదే క్రమంలో... తాజా కుకీ-మెయితీ ఘర్షణల్లో భాగంగా మే 4వ తేదీన మహిళలపై జరిగిన దారుణంపైనా స్పందించారు.
అనంతరం... ఈ ఘటనలో వీడియో తీసిన వ్యక్తి ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు.. అతని నుంచి వీడియో తీసిన మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పిన అమిత్ షా... పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు వీడియోను వైరల్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కుట్రను తేల్చేందుకే దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.
ఇదే సమయంలో ఒకపక్క తమపై దాడి జరిగడానికి ముందు పోలీసులను అడ్డుకునే దుండగులు తమను తీసుకెళ్లారని బాదిత మహిళలు ఆరోపిస్తున్నట్లు కథనాలొచ్చిన నేపథ్యంలో... మణిపూర్ మహిళల ఊరేగింపు సమయంలో.. అక్కడ పోలీసులుగానీ, ఆర్మీగానీ లేదని తేలిందని చెప్పారు కేంద్ర హోం మంత్రి.
ఏదిఏమైనా... నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని మాత్రం అమిత్ షా స్పష్టం చేశారు. మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా 6,065 ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు అయ్యాయని తెలిపారు. కేంద్రం జోక్యం తర్వాత మణిపూర్ పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చిందని.. జులై 18 నుంచి మణిపూర్ లో మరో మరణం సంభవించకుండా చూశాం అని అమిత్ షా వివరించారు.
కాగా, మణిపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ మోడీ, అమిత్ షా లు రాజినామా చేయాలంటూ విపక్షాలు దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలూ చేస్తోన్న సంగతి తెలిసిందే!