Begin typing your search above and press return to search.

మణిపూర్ లో మరో ఘోరం... "నీ కూతురు ప్రాణాలతో కావాలా వద్దా"?

మణిపూర్‌ లో జరిగిన ఘాతుకాలు అంతులేని కథలా వెలుగులోకి

By:  Tupaki Desk   |   24 July 2023 5:20 AM GMT
మణిపూర్ లో మరో ఘోరం... నీ కూతురు ప్రాణాలతో కావాలా వద్దా?
X

మణిపూర్‌ లో జరిగిన ఘాతుకాలు అంతులేని కథలా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి..! మహిళలను నగ్నంగా ఊరేగించి ఓచోట.. కార్ల సర్వీస్‌ షోరూంలోకి దూసుకెళ్లి మరోచోట సామూహిక అత్యాచారాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ కార్ల సర్వీస్ షోరూంలో బలైన ఒక అమ్మాయి తల్లికి జరిగిన అనుభవం ఇప్పుడు చాలా మందితో కంటతడి పెట్టిస్తోంది.

అవును... మణిపూర్‌ లోని ఓ గిరిజన మహిళకు తన కూతురి ఆచూకీ కోసం వచ్చిన ఫోన్‌ కాల్ వెన్నులో వణుకుపుట్టించిందంట. మణిపూర్ లో జరిగిన అల్లర్లకు భయపడిన ఒక తల్లి... అక్కడ ఉన్న తన కూతురికి ఫోన్ చేసిందంట. ఈ సమయంలో ఆ ఫోన్ ను మరో వ్యక్తి రిసీవ్ చేసుకున్నారంట. ఆమె కూడా ఒక మహిళేనట.

అయితే ఫోన్ రిసీవ్ చేసుకున్న ఆ మహిళ మాట్లాడిన మాటలు, అడిగిన ప్రశ్న.. ఈ తల్లి గుండెల్లో వణుకుపుట్టించిందని తెలుస్తుంది. ఫోన్ రిసీవ్ చేసుకున్న మహిళ ఈ తల్లితో... "నీ కూతురు ప్రాణాలు లేకుండా కావాలా? ప్రాణాలతో కావాలా? అని అడిగిందట. తర్వాత కాసేపటికే "నీ కూతురు చనిపోయింది" అని చెప్పారట.

ఈ మేరకు ఇంఫాల్‌ లోని ఒక భవనం గోడలపై ఆమె రక్తం, జుట్టు ప్లాస్టర్ చేయబడి కనిపించిందని తెలుస్తుంది. మృతదేహాన్ని కుటుంబీకులు ఇంకా స్వీకరించలేదు. అయితే ఈ విషయాలపై స్పందించిన ఆ తల్లి... "నేను ఇప్పటికీ వాస్తవాన్ని అంగీకరించలేను. నా స్వంత కళ్లతో నేను ఆమెను చూడలేదు కాబట్టి నా కుమార్తె తిరిగి వస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను" అని చెబుతున్నారు.

కాగా... మణిపూర్‌ లో జాతి హింస చెలరేగిన రెండు రోజుల తర్వాత, మే 5 సాయంత్రం కార్ వాష్‌ లో సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఇద్దరు యువతుల్లో ఆమె కుమార్తె ఒకరని తెలుస్తుంది. ఈ హృదయ విధారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వారిని ఏడుగురు వ్యక్తులు గగ్గోలు పెట్టి గదిలో బంధించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయిలు ఎంతగా అరిచినా.. మరెంతగా వేడుకున్నా.. వారిపై దాడి చేసినవారు పశ్చాత్తాపపడలేదు. మృతదేహాలను ఇంఫాల్‌ లోని జవహర్‌ లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచినట్లు కథనాలొస్తున్నాయి!

కాగా, మణిపూర్‌ లో తమను కూడా ఎస్టీల్లో కలపాలన్న ప్రతిపాదనతో మెయితీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా కుకీలు మే 3వ తేదీన భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసన ర్యాలీపైకి మెయితీ వర్గానికి చెందిన కొంతమంది అల్లరి మూక రాళ్ల దాడులు చేయడంతో మణిపూర్‌ లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి.

అప్పటి నుంచి మణిపూర్ మొత్తం అట్టుడికిపోతోంది. మణిపూర్ లో చెలరేగిన ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు సుమారు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వేలాది ఇళ్లు ధ్వంసం కావడంతో ఎంతోమంది నిరాశ్రయులై ప్రభుత్వ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.