పిల్లల చదువు కోసం తల్లి ఆత్మత్యాగం... షాకింగ్ వీడియో!
ఇలా రెక్కాడితేకాని డొక్కాడని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలనూ ఉన్నత చదువులు చదివిస్తుందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 18 July 2023 8:04 AM GMTఅందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే... అలాంటి తల్లి తన పిల్లల చదువుకోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన ఒక హృదయ విదారక ఘటన తమిళనాడులో చోటు చేసుకుందని తెలుస్తుంది.
అవును... సేలంలోని 2వ అగ్రహారం వీధిలో పాపతి అనే 46 ఏళ్ల మహిళ తన పిల్లల చదువుల ఖర్చుల కోసం.. ఆర్థికంగా నష్టపరిహారం కోసం తన జీవితాన్ని విషాదకరంగా ముగించుకుందని తెలిసింది. తాను చనిపోతే ప్రభుత్వం తన పిల్లలను ఆర్థికంగా ఆదుకుంటుంది కదా అని భావించిందని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... పాపతి అనే మహిళ తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా కలెక్టరేట్ లో కాంట్రాక్ట్ క్లీనర్ గా పనిచేస్తుందట. ఆమె నెలకు రు. 10,000 జీతం పొందుతోందని అంటున్నారు. అయితే 15 ఏళ్ల క్రితం భర్త విడిపోవడంతో పాపతి తన ఇద్దరు పిల్లలను, వృద్ధ తల్లిని పోషిస్తోందని తెలుస్తోంది. ఇలా రెక్కాడితేకాని డొక్కాడని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలనూ ఉన్నత చదువులు చదివిస్తుందని తెలుస్తుంది.
అవును… ఆమెకున్న ఇద్దరు పిల్లల్లో మొదట సంతానం కూతురు... ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతుండగా.. కుమారుడు ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలుస్తుంది. ఈ సమయంలో వారి ట్యూషన్ ఫీజుల భారం ఈమెకు చాలా ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
దీంతో అప్పుకోసం ఆమె ఎక్కని గడప లేదని అంటున్నారు. ఇలా అప్పు కోసం తెలిసిన వ్యక్తులందరినీ సంప్రదించినా రూపాయి కూడా పుట్టలేదని తెలుస్తుంది. వీరిలో కొంతమంది డబ్బులు ఇవ్వలేదు సరికదా... తాను చనిపోతే ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందనే ఉచిత సలహా ఒకటి ఇచ్చారని అంటున్నారు.
దీంతో ఆ ఉచిత చావు సలహాని సీరియస్ తీసుకుందంట ఈ పిచ్చి తల్లి! దీంతో తాను చనిపోతే తన కుటుంబం అయిన బాగుపడుతుందని భావించి బస్సుకు ఎదురెళ్లి అత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఆ సంగతి అలా ఉంటే... ఈ ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయడంతో... తన పిల్లల చదువుకు సహాయపడే నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వస్తుందనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారని అంటున్నారు. దీంతో ఆ తల్లి చేసిన త్యాగం ఫలించ లేదని తెలుస్తుంది. కారణం... ఈ ప్రమాదం కేసు కాస్తా ఆత్మహత్యగా మారడమే!
అవును... ప్రమాద కేసు కాస్తా ఆత్మహత్య కేసుగా మారడంతో ప్రభుత్వం నుండి వచ్చే పరిహారం ఆ ఇద్దరు పిల్లలకూ రాలేదని అంటున్నారు. ప్రమాద బాధితులకు మాత్రమే ప్రభుత్వ పరిహారం అందుతుందని ఈ సందర్భంగా అధికారులు చెబుతున్నారంట. దీంతో... ప్రభుత్వ వైఖరిపై పలువురు మండిపడుతున్నారని అంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వారి హృదయాలు ధ్రవించిపోతున్న వేళ... ప్రభుత్వం మాత్రం బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ఇప్పుడు రూల్స్ పాటించడం అవసరమా.. ఆ తల్లి త్యాగానికి మానవతా దృక్పదంతో స్పందించలేరా అంటూ ఫైరవుతున్నారంట.