పాతికేళ్లు ప్రతి నెలా ప్రైజ్ మనీ.. లాటరీలో విజేత యూపీ వాసి
సుడికి సైతం అసూయ పుట్టేలా ఉండాలన్నట్లుగా ఉంది తాజా ఉదంతం
By: Tupaki Desk | 29 July 2023 4:42 AM GMTసుడి అంటే అలాంటి ఇలాంటి అన్నట్లుగా ఉండకూడదు. సుడికి సైతం అసూయ పుట్టేలా ఉండాలన్నట్లుగా ఉంది తాజా ఉదంతం. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక దిగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తికి తగిలిన లాటరీ అతన్ని మహా సుడిగాడిగా మార్చేసింది. మిగిలిన లాటరీ టికెట్ల మాదిరి కాకుండా.. ఇప్పటివరకు వినని కాన్సెప్టుతో తీసుకొచ్చిన లాటరీలో విజేతగా నిలవటం ఆసక్తికరంగా మారింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఫాస్ట్ 5 పేరుతో నిర్వహించి లాటరీలో మొదటి విజేతగా నిలిచారు యూపీకి చెందిన ఆదిల్ ఖాన్. దుబాయ్ లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న వ్యక్తి.. ఫాస్ట్ 5 లాటరీ కొనటం.. అది కాస్తా ఆయన్ను వరించటాన్ని ఆయన నమ్మలేకపోతున్నారు. ఈ లాటరీ ప్రత్యేకత ఏమంటే.. సొంతం చేసుకున్న ప్రైజ్ మనీని ఒకేసారి కాకుండా.. ప్రతి నెలా వాయిదాల పద్దతిలో చెల్లిస్తారు.
లాటరీలోని కండీషన్ ప్రకారం రానున్న పాతికేళ్ల పాటు ప్రతి నెల ఒక మొత్తాన్ని చెల్లిస్తుంటారు. 25వేల దిర్హమ్ ప్రతి నెలా చెల్లిస్తారు. మన రూపాయిల్లో చెప్పుకోవాలంటే రూ.5,59,822గా చెబుతున్నారు. తానిప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నానని.. సరిగ్గా ఇదే సమయంలో తనకు లాటరీ తగలటాన్ని తాను నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. తనకు లాటరీ వచ్చిందని చెబితే.. తన ఇంట్లోని వారు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొమ్మని చెప్పిన విషయాన్ని వెల్లడించారు.
విజేతగా నిలిచినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్న ఆదిల్.. తానిప్పుడు కష్టపరిస్థితుల్లో ఉన్నానని.. ఇలాంటి వేళలో తనకు లాటరీ తగలటాన్ని నమ్మలేకపోతున్నాడు. తన కుటుంబానికి తానొక్కడే జీవనాధారమని.. కొవిడ్ టైంలో తన సోదరుడు మరణించాడని.. పెద్ద వయస్కులైన తల్లిదండ్రులతో పాటు ఐదేళ్ల పాప కూడా ఉన్నట్లు చెప్పారు. ఇన్నేసి బాధ్యతలు ఉన్న ఆదిల్ కు పాతికేళ్ల పాటు ప్రతి నెలా భారీ మొత్తం లాటరీ ప్రైజ్ మనీ రూపంలో రావటం ఆసక్తికరంగా మారింది. అతగాడి సుడి మామూలుగా లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.