Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ

ఇంతకూ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలంగాణకు యూపీకి మధ్యనున్న లింకేమిటి? అన్న వివరాల్లోకి వెళితే

By:  Tupaki Desk   |   18 April 2024 5:27 AM GMT
యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ
X

దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పుర ఎంపీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు శ్రీకళారెడ్డి. ఆమెది తెలంగాణ. అయితే.. ఆమె యూపీ ఎన్నికల బరిలో దిగటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ తెలంగాణకు చెందిన ఆమె యూపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలా లభించింది. ఇంతకూ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలంగాణకు యూపీకి మధ్యనున్న లింకేమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

నిప్పో బ్యాటరీ గురించి తెలియని వారుండరు. చెన్నై కేంద్రంగా పని చేసే ఈ బ్యాటరీ కంపెనీ అధినేతల కుటుంబానికి చెందిన వారే శ్రీకళారెడ్డి. ఆమె తండ్రి కె. జితేందర్ రెడ్డి. తల్లి లలితారెడ్డి. వీరిద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్న వారే. తండ్రి నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా.. హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. తల్లి గ్రామసర్పంచ్ గా సేవలు అందించారు. ఇక.. శ్రీకళారెడ్డి విషయానికి వస్తే.. ఆమె బాల్యం మొత్తం చెన్నైలోనే జరిగింది. ఇంటర్ కూడా చెన్నైలోనే. గ్రాడ్యుయేషన్ మాత్రం హైదరాబాద్ లో జరగ్గా.. అనంతరం అమెరికాకు వెళ్లిన ఆమె ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు.

తర్వాతి కాలంలో ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె.. ఫ్యామిలీ బిజినెస్ లను చూసుకునే వారు. కట్ చేస్తే.. ఇప్పుడు శ్రీకళారెడ్డి భర్త గురించి చెప్పాలి. ఒకవేళ ఆయన కానీ లేకుంటే ఆమె ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయి ఉండేవారు కాదు. శ్రీకళారెడ్డి భర్త పేరు ధనుంజయ్ సింగ్. ఇతడి బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే షాక్ తినాల్సిందే. ఎందుకుంటే.. కిడ్నాప్.. అక్రమ వసూళ్ల కేసులో శిక్ష పడిన ఘనత ఈయన సొంతం. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఆయనపై అనర్హత ఉంది.

ఈ నేపథ్యంలో ఆయన తన భార్య శ్రీకళారెడ్డిని ఎన్నికల బరిలో దింపారు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. ధనుంజయ్ సింగ్ కు శ్రీకళారెడ్డి మూడో భార్య. మొదటి భార్య చనిపోవటం.. రెండో భార్యతో విడాకులు తీసుకున్నారు. వీరి పరిచయం ఎక్కడ జరిగింది? పెళ్లి వరకు ఎలా వచ్చిందన్న విషయాన్ని పక్కన పెడితే.. 2017లో శ్రీకళారెడ్డిని ధనుంజయ్ సింగ్ 2017లో పెళ్లాడారు. వారి రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఐదేళ్ల క్రితం జేపీ నడ్డా సమక్షంలో తెలంగాణలో బీజేపీలో చేరిన ఆమె.. 2021లో యూపీలో జరిగిన జిల్లా పంచాయితీ ఎన్నికల్లో గెలిచి జెడ్పీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఆమె బరిలో దిగుతున్న జౌన్ పుర విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం బీఎస్పీకి మంచి పట్టుంది. 2009లో ధనుంజయ్ సింగ్ విజయం సాధిస్తే.. 2019లో శ్యాంసింగ్ యాదవ్ గెలుపొందారు. తాజాగా సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి మరీ శ్రీకళారెడ్డికి బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ ఇవ్వటం విశేషం. 2019 ఎన్నికల్లో ఎస్పీ.. బీఎస్పీ కూటమిగా బరిలోకి దిగితే.. ఈసారి మాత్రం బీఎస్పీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా క్రిపాశంకర్ సింగ్.. ఎస్పీ తరఫున బాబూసింగ్ కుశ్వాహా బరిలో ఉన్నారు. ఆస్తుల విషయంలో శ్రీకళారెడ్డి భారీగా ఉన్నాయి. ఆమె పేరిట రూ.780 కోట్ల స్థిరాస్తులు.. రూ.6.71 కోట్ల చరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ.1.74 కోట్ల ఆభరణాలు ఉన్నట్లుగా వెల్లడించారు. భర్త ధనుంజయ్ సింగ్ వద్ద రూ.5.31 కోట్ల స్థిరాస్తులు.. రూ.3.56కోట్ల చరాస్తులు ఉన్నాయి. మరి.. యూపీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ గెలుపు ఏ మేర అన్నది తేలాలంటే ఫలితాల వెల్లడి వరకు వెయిట్ చేయక తప్పదు.