Begin typing your search above and press return to search.

ఇక అమెరికా భారత విద్యార్థులకు పీడకలేనా?

అయితే ఇప్పుడు ఈ డ్రీమ్స్‌ చెదిరిపోతున్నాయి. ఆ దేశంలో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణం

By:  Tupaki Desk   |   11 Feb 2024 6:23 AM GMT
ఇక అమెరికా భారత విద్యార్థులకు పీడకలేనా?
X

అమెరికాలో చదువుకోవాలని దాదాపు ప్రతి భారతీయ విద్యార్థి కల కంటాడు. చదువు పూర్తికాగానే అమెరికాలోనే ఉద్యోగం సాధించి తమ డాలర్‌ డ్రీమ్స్‌ ను నెరవేర్చుకోవాలనుకుంటారు. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం కూడా పొందితే ప్రపంచాన్ని జయించినంత సంబరపడతారు.

అయితే ఇప్పుడు ఈ డ్రీమ్స్‌ చెదిరిపోతున్నాయి. ఆ దేశంలో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణం. కోవిడ్‌ తదనంతర దుష్పరిణామాలు, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌–హమాస్‌ పోరు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు, సరకు రవాణాకు ఇబ్బందులు తలెత్తడం, మానవ వనరుల స్థానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రవేశం వంటి పరిణామాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. పెద్ద ఎత్తున ఎదురయ్యే పోటీని తట్టుకునేవారు, అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అమెరికాలో మనగలుగుతున్నారు.

విద్యార్థి వీసా పొందడం ద్వారా అమెరికా కలలు నెరవేరే రోజులు పోయాయి. ఇప్పుడు, తాజా సర్వేలు, విద్యార్థుల ఆందోళనలు, సోషల్‌ మీడియా పోస్ట్‌లు, నిపుణుల అభిప్రాయాలు షాకింగ్‌ విషయాలను వెల్లడిస్తున్నాయి. చదువు పూర్తి అయినా ఉద్యోగం దొరకడం లేదు. హెచ్‌1బీ వీసా పొందడం, ఆ తర్వాత గ్రీన్‌ కార్డు సొంతం చేసుకోవడం దుర్లభంగా మారాయి.

అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న విదేశీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాల్సి వస్తోంది. గతంలో చదువు పూర్తి చేసుకున్నాక ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించేవారు. లేదా చదువు పూర్తయ్యాక ఉద్యోగాన్ని వెతుక్కునే సమయం ఉండేది. ఇప్పుడు పరిస్థితులు అలా లేవని అంటున్నారు.

‘నా విద్యాభ్యాసం త్వరలో పూర్తవుతుంది. ఇంకా నాకు ఉద్యోగం దొరకలేదు, ఉద్యోగం పొందే అవకాశాలు కూడా కనిపించడం లేదు. నేను చేయాల్సిందల్లా భారతదేశానికి తిరిగి వెళ్లడమే. అయితే చదువు కోసం తీసుకున్న నా విద్యా రుణం నన్ను భయపెడుతోంది. డబ్బున్నవారే ఈ దుర్భర పరిస్థితులను తట్టుకోగలరు’ అని ఒక విద్యార్థి సోషల్‌ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

‘అమెరికన్‌ కలల స్వర్ణయుగం ముగిసింది. మీరు మీ డిగ్రీ తర్వాత తిరిగి రావాలని అనుకుంటే తప్ప ఉన్నత చదువుల కోసం అమెరికాకు రావడం వల్ల డబ్బు, శక్తి రెండూ వృథా అవుతాయి. అధిక ఫీజులు, తక్కువ వేతనం, హెచ్‌1బీ వీసా పొందే అవకాశాలు తక్కువగా ఉండటం, గ్రీన్‌ కార్డు పొందే అవకాశం అసలు లేకపోవడమే ఇందుకు కారణం’ అని మరో భారతీయ విద్యార్థి ఆవేదనను వ్యక్తం చేశాడు.

‘‘ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఆర్థికంగా స్థితిమంతులయితేనే అమెరికా రండి.. మాస్టర్స్‌ డిగ్రీ చేసినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని అనుకోకండి. కానీ ఉన్న డబ్బునంతా అమెరికాకు పెట్టి మాత్రం రాకండి’ అని ఇంకో విద్యార్థి అమెరికాకు రావాలనుకుంటున్నవారికి హెచ్చరిక జారీ చేశాడు.

‘అమెరికాలో జీవితం కలలు కన్నంత సులువుగా అయితే ఏమీ లేదు. ఇక్కడ నివసించడానికి చాలా ఖర్చు అవుతోంది. ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది. మెక్సికో, వెనిజులా, ఇతర పొరుగు దేశాల నుండి వస్తున్న అక్రమ వలసదారులు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఉద్యోగాలను తన్నుకుపోతున్నారు. తక్కువ సంపాదనకే వారు సర్దుకుపోతున్నారు. మనం అంత తక్కువకు సర్దుకుపోలేం.. వారు డేరాల్లో గుంపులు గుంపులుగా నిద్రిస్తారు. అలా మనం చేయలేం’’ అని ఒక విద్యార్థి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

తెలుగు సంఘాలకు చెందిన ఒక సీనియర్‌ మాట్లాడుతూ.. ‘అత్యంత నైపుణ్యం, అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులకు మాత్రమే అమెరికాలో అవకాశాలున్నాయి. ప్రతి పది మందిలో ఒకరికే అవకాశం దక్కుతోంది. మీకు ఆర్థిక స్తోమత ఉండి, అంతర్జాతీయ స్థాయికి చేరి ఇక్కడ చదువుకుని తిరిగి రావాలనుకుంటే ఫర్వాలేదు.. లేకుంటే పరిస్థితి దారుణంగా మారుతుంది. చదువు పూర్తయ్యాక భారతదేశానికి వెళ్లిపోయి అక్కడ ఉద్యోగం చేయండి.. ఆ తర్వాత అమెరికా రావడానికి ప్రయత్నించండి’ అని ఆయన తెలిపారు.

ఇలా సోషల్‌ మీడియాలో అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల గురించి చాలా పోస్టులు దర్శనమిస్తున్నాయి. అంతా చెబుతున్నది ఒకటే.. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితుల ఆశాజనకంగా లేవని.. ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందేనని.