దేశంలో బెస్ట్ కాలేజీలు, యూనివర్సిటీలు ఇవే!
కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) – మద్రాస్ దుమ్ములేపేసింది
By: Tupaki Desk | 12 Aug 2024 7:30 PM GMTకేంద్ర విద్యా శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) – మద్రాస్ దుమ్ములేపేసింది. ఇంజనీరింగ్ విభాగంలో దేశంలోనే నంబర్ వన్ విద్యా సంస్థగా నిలిచింది. ఈ ఘనతను వరుసగా తొమ్మిదోసారి దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్ ఎనిమిదో ర్యాంకును దక్కించుకుంది.
వైద్య విద్య విభాగంలో ఢిల్లీలోని అఖిల భారత విద్యా సంస్థ (ఎయిమ్స్) మొదటి ర్యాంకు దక్కించుకుంది. చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్), వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ) రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
దంత విద్య విభాగంలో చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ కు మొదటి ర్యాంకు లభించింది. మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కు రెండో ర్యాంకు, ఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కు మూడో ర్యాంకు దక్కాయి.
ఇక మేనేజ్మెంట్ విభాగంలో దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) – అహ్మదాబాద్ నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్ రెండు, మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి.
ఉత్తమ యూనివర్సిటీల విభాగంలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) – బెంగళూరు నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రెండో స్థానంలో, జామియా మిల్లియా యూనివర్సిటీ మూడో స్థానంలో నిలిచాయి.
ఫార్మసీ విభాగంలో.. జామియా హమదర్ద్ (ఢిల్లీ) మొదటి ర్యాంకు లభించింది. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)కు రెండో స్థానం దక్కింది. బిట్స్ పిలానీ మూడో ర్యాంకుతో సత్తా చాటింది.
ఉత్తమ కళాశాలల విభాగంలో.. ఢిల్లీలోని హిందూ కాలేజీ, మిరాండా కాలేజీ, సెయింట్ స్టీఫెన్ కాలేజీ వరుసగా టాప్ 3లో నిలిచాయి.
పరిశోధనకు సంబంధించి ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ వరుసగా తొలి మూడు ర్యాంకులతో సత్తా చాటాయి.
వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో.. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఢిల్లీ)కి మొదటి ర్యాంకు దక్కింది. హరియాణాలోని కర్నాల్ లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), లూధియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఆవిష్కరణల విభాగంలో.. ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ తొలి మూడు ర్యాంకులతో ధమాకా మోగించాయి.
రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సంబంధించి
చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి మొదటి ర్యాంక్ లభించింది. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆరు, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి ఏడో ర్యాంకు లభించాయి.
న్యాయ విద్య కోర్సులకు సంబంధించి బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ, ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మొదటి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి.
ఆర్టిటెక్చర్ అండ్ ప్లానింగ్ లో.. ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఖరగపూర్ కు మొదటి రెండు ర్యాంకులు లభించాయి.
విభాగాలవారీగా కాకుండా ఓవరాల్ గా దేశంలో టాప్ టెన్ విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్, ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే టాప్ 3లో ఉన్నాయి. మొత్తం మీద టాప్ 10లో ఎనిమిది ఐఐటీలకు చోటు దక్కింది.
ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) రూపొందించిన జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ విడుదల చేశారు. మొత్తం 13 విభాగాల్లో ఉత్తమ విద్యా సంస్థల జాబితాను ప్రకటించారు.