దేశంలో 3.28 లక్షల బీటెక్ సీట్లు మనవే.. టాప్ స్టేట్స్ లిస్ట్ ఇదే!
మౌలిక వసతులు, అధ్యాపకులను చూపించిన పక్షంలో అపరిమితంగా సీట్లు ఇస్తామని ప్రకటించింది.
By: Tupaki Desk | 13 Nov 2024 9:38 AM GMTగత అకడమిక్ ఇయర్ (2023-24) నుంచే సీట్ల సంఖ్యపై పరిమితిని ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ (ఏఐసీటీఈ) ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ప్రస్తుతం విద్యాసంవత్సరంలో కొత్త కోర్సులకు, సీట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మౌలిక వసతులు, అధ్యాపకులను చూపించిన పక్షంలో అపరిమితంగా సీట్లు ఇస్తామని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సీట్లు పెంచుకునేందుకు కాలేజీలు దరఖాస్తులు చేశాయి. ఫలితంగా.. ఈసారి దేశవ్యాప్తంగా మొత్తం 1.40 లక్షల సీట్లు పెరిగాయని అంటున్నారు. అందులో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లోనే సుమారు 76,587 సీట్లు పెరగగా.. టాప్ లిస్ట్ లో మూడు ఈ రాష్ట్రాలే ఉండటం గమనార్హం.
అవును... ఇంజినీరింగ్ విద్యలో కేరళ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు మొదటినుంచీ ముందంజలో ఉన్నాయి. ఇక గత ఏడాదితో పోలిస్తే.. దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య గణనీయంగా పెరగగా.. వాటిలో తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో పెరుగుదల అత్యధికంగా ఉన్నట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దీంతో... బీటెక్ సీట్ల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా... దేశవ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లు ఉండగా... తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 6,37,775 (సుమారు 42.80) శాతం సీట్లు ఉన్నాయి. వాస్తవానికి మొదటి నూంచీ ఇంజినీరింగ్ విద్యలో దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ వెనుకబడే ఉందని అంటున్నారు!
తాజాగా లెక్కల ప్రకారం... బీటెక్ సీట్ల విషయంలో తమిళనాడు రాష్ట్రం 3.08 లక్షల సీట్లతో మొదటి స్థానంలో ఉండగా.. 1.83 లక్షల సీట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఇక మరో దక్షిణాది రాష్ట్రం తెలంగాణ 1.45 సీట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 1.64 లక్షల సీట్లతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది.
అయితే.. సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చినా.. మళ్లీ ఆయా వర్శిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో కోత పెడతాయని అంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల నుంచి అనుమతులు రావని చెబుతున్నారు. ఉదాహరణకు... తెలంగాణలో మూడు కాలేజీల ఆఫ్ క్యాంపస్ లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా.. అడ్మిషన్స్ చెపట్టేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు!