1972 ఆండీస్ విమాన ప్రమాద బాధితుల భయానక కథ
నెట్ ఫ్లిక్స్ సరికొత్త సర్వైవల్ డ్రామా 'సొసైటీ ఆఫ్ ది స్నో' 1972లో ఆండీస్ పర్వతాలలో జరిగిన విమాన ప్రమాదం తాలూకా భయంకరమైన నిజమైన కథను తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు J.A. బయోనా
By: Tupaki Desk | 7 Jan 2024 9:03 AM GMTయథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న థ్రిల్లర్లకు ఓటీటీల్లో గొప్ప ఆదరణ దక్కుతోంది. నిజాలను యథాతథంగా తెరపైకి తీసుకొచ్చేందుకు మన దర్శకనిర్మాతలు చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనది. ఉద్వేగాన్ని రగిలించడంలో ప్రతిభావంతులైన దర్శకులు సఫలమవుతున్నారు. ఇది ఓటీటీ కంటెంట్ విలువను మరింత పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రయోగాత్మక కంటెంట్ తో ఆదరణ పొందుతున్న ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు భయానక విమాన ప్రమాదంపై సినిమా తీసి తమ వీక్షకులకు అందించింది. ఇది స్పానిష్ చిత్రం.. 'సొసైటీ ఆఫ్ ది స్నో' అదే పేరుతో పాబ్లో వీర్సీ పుస్తకం ఆధారంగా రూపొందించిన సిరీస్. ఇది విమాన ప్రమాదం నుండి బయటపడిన మొత్తం 16 మంది అనుభవాల సమాహారంగా రూపొందిన డాక్యు సిరీస్ కావడంతో ఎంతో ఉద్విగ్నితను కలిగిస్తోంది.
'సొసైటీ ఆఫ్ ది స్నో' ఒక పెను ప్రమాదానికి సంబంధించిన కథ. ఎన్నో భావోద్వేగాలు, హృదయ విదారక సంఘటన తాలూకా జ్ఞాపకాల్లోకి తీసుకెళుతుంది. జీవిత మనుగడ కోసం ఆశ పడే నిజ పాత్రలను పరిచయం చేస్తుంది. ఇది సినిమాటిక్ అనుభూతిని కలిగించే విజువల్ ఫీస్ట్. ప్రీమియర్ అనంతరం ఈ నిజ కథ చాలా అద్భుతం అన్న ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా భావోద్వేగాలను కలిగించి హృదయాల్ని తాకే కంటెంట్ తో రూపొందింది. నిజంగా ఆ ప్రమాదంలో మనం ఉంటే ఎలా ఫేస్ చేసేవాళ్లం? అనే ప్రశ్న అందరి మదిలో మెదిలేలా చేస్తుంది. ఒక అద్భుతమైన నిజకథను తెరపై బయోనా అద్భుతంగా ఆవిష్కరించారు.
చిత్రీకరణకు 10ఏళ్లు పట్టింది:
నెట్ ఫ్లిక్స్ సరికొత్త సర్వైవల్ డ్రామా 'సొసైటీ ఆఫ్ ది స్నో' 1972లో ఆండీస్ పర్వతాలలో జరిగిన విమాన ప్రమాదం తాలూకా భయంకరమైన నిజమైన కథను తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు J.A. బయోనా చాలా సాహసవంతమైన ప్రయత్నం చేసారు. దీనికోసం ఏకంగా 10 సంవత్సరాలు పట్టింది. ది హాలీవుడ్ రిపోర్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోనా భారీ బడ్జెట్ స్పానిష్ భాషా చిత్రం 'సొసైటీ ఆఫ్ ది స్నో' రూపొందించడంలో సవాళ్ల గురించి ఓపెనయ్యారు.
ది ఇంపాజిబుల్ -జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్ వంటి అద్భుతమైన కథలను చెప్పి విజయాన్ని సాధించిన ప్రముఖ ఫిలింమేకర్ జె.ఎ. బయోనా. అంతగా బయటి ప్రపంచానికి తెలియని అంతర్జాతీయ కథలను వెలుగులోకి తేవాలనే తన కోరికను అతడు వ్యక్తం చేశాడు. బయోనా మాట్లాడుతూ ఇంగ్లీష్‌లో లేని పెద్ద ప్రొడక్షన్‌లను హాలీవుడ్ పరిశ్రమ గ్రహించడం లేదు అని కూడా విమర్శించారు.'అలైవ్: ది స్టోరీ ఆఫ్ ది ఆండీస్ సర్వైవర్స్' పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందించానని బయోనా తెలిపారు.
పీడకలను చూపించాలని:
భయానక ఘటనలో పరీక్షను సాధ్యమైనంత వాస్తవికంగా తెరపై చూపించాలనే ప్రయత్నం వల్లనే చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమైందని బయోనా తెలిపారు. అతను IndieWireతో మాట్లాడుతూ.. పర్వతశ్రేణి అండీస్‌లోని రిమోట్ (ఎవరూ చేరుకోలేని) ప్రదేశంలో డాక్యుమెంటరీగా చిత్రీకరించాను అని తెలిపారు. దీనికోసం తీవ్రమైన పరిశోధన చేసానని, ప్రాణాలతో బయటపడిన వారితో సంప్రదింపులు చేయడం ద్వారా.. విమాన శిధిలాల నుండి గాయపడిన వారి నుంచి సమాచారం రాబట్టడం వరకు ప్రతిదానిలో ప్రామాణికత కోసం ప్రయత్నించానని తెలిపారు. ప్రేక్షకులకు ఆ భయానక పీడకల చూపించడమే నా ధ్యేయం అని తెలిపాడు.
'సొసైటీ ఆఫ్ ది స్నో' మానవులందరికీ స్ఫూర్తి. 1972 ఆండీస్ విమాన ప్రమాదం నుంచి బాధితులను కాపాడేందుకు చాలా శ్రమించారు. J. A. బయోనా గొప్ప దర్శకత్వ ప్రతిభకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. తారాగణం అత్యుత్తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ముగింపు ఎంతో ఎమోషన్ ని కలిగిస్తుంది.. అని సమీక్షకులు విశ్లేషించారు.