Begin typing your search above and press return to search.

2023లో 50 ప్ల‌స్ హీరోలు ద‌బిడ‌దిబిడే

ముఖ్యంగా ర‌జ‌నీకాంత్ (73), షారూఖ్ ఖాన్ (58), స‌న్నీడియోల్(67), బాబి డియోల్ (54) లాంటి హీరోల కెరీర్ కి పున‌రుజ్జీవం లాంటిది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 12:30 AM GMT
2023లో 50 ప్ల‌స్ హీరోలు ద‌బిడ‌దిబిడే
X

2023 సీనియ‌ర్ హీరోల‌కు క‌లిసొచ్చిన సంవ‌త్స‌రం. చాలా మంది అగ్ర హీరోలకు గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన ఏడాది కూడా ఇది. ముఖ్యంగా ర‌జ‌నీకాంత్ (73), షారూఖ్ ఖాన్ (58), స‌న్నీడియోల్(67), బాబి డియోల్ (54) లాంటి హీరోల కెరీర్ కి పున‌రుజ్జీవం లాంటిది. మెగాస్టార్ చిరంజీవి(68)కి 2022 అంతగా క‌లిసి రాక‌పోయినా కానీ, 2023లో వాల్తేరు వీర‌య్య రూపంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా మ‌రోసారి మాస్ లో బాస్ మ‌న‌ చిరంజీవి అని నిరూపించింది. బాబి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విశాఖ‌ప‌ట్నం నేప‌థ్యంలో మ‌త్స్య‌కారుని క‌థ‌తో రూపొందించిన వాల్తేరు వీర‌య్య మాస్ ని ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు ర‌ప్పించింది.

చాలా సంవ‌త్స‌రాలుగా స‌రైన విజయం ద‌క్క‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి జైల‌ర్ రూపంలో మెగా హిట్ ద‌క్కింది. ఈ చిత్రం ర‌జ‌నీ కెరీర్ లో తొలి 500 కోట్ల క్ల‌బ్ ని న‌మోదు చేసింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ర‌జ‌నీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వ‌రుసగా సినిమాలు చేస్తున్నారు. ఇందులో లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రంపై అత్యంత భారీ అంచ‌నాలు ఉన్నాయి.

జీరో చిత్రంతో డిజాస్ట‌ర్ ని ఎదుర్కొన్న త‌ర్వాత నాలుగేళ్ల పాటు షారూఖ్ డైల‌మాలో ఉండిపోయాడు. కానీ 2023 ఆరంభమే ప‌ఠాన్ రూపంలో బంప‌ర్ హిట్ కొట్టాడు. సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కించిన‌ ఈ చిత్రం పాన్ ఇండియాలో రిలీజై భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. షారూఖ్ కెరీర్ కి తొలి 1000 కోట్ల క్ల‌బ్ చిత్ర‌మిది. ప‌ఠాన్ లో ఖాన్ యాక్ష‌న్ స్టార్ గా అద‌ర‌గొట్టాడు. ఆ త‌ర్వాత అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ కూడా బంప‌ర్ హిట్ కొట్టి 1000 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఈ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో బాద్ షా ఈజ్ బ్యాక్ అని నిరూప‌ణ అయింది. ఏడాది ముగింపులో వ‌చ్చిన డంకీ కూడా మ‌రో విజ‌యంగా న‌మోదైంది. ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కూ 250 కోట్లు వ‌సూలు చేసింది. షారూఖ్ ఆశించినట్టే హ్యాట్రిక్ విజ‌యం సాధ్య‌మైంది.

ఆల్మోస్ట్ కెరీర్ ముగిసింది అనుకుంటుండ‌గా, డియోల్ కుటుంబం నుంచి స‌న్నీడియోల్ సింగంలా గర్జించాడు. గ‌ద‌ర్ 2 తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్నాడు. గ‌ద‌ర్ 2 చిత్రం 500 కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. సీనియ‌ర్ హీరో స‌న్నీడియోల్ స‌రైన కంటెంట్ ఉన్న సినిమాల‌తో వ‌స్తే ఆద‌రిస్తార‌ని అర్థ‌మైంది.

డియోల్ ఫ్యామిలీలోనే మ‌రో సీనియ‌ర్ న‌టుడు బాబి డియోల్‌కి యానిమ‌ల్ రూపంలో జాక్ పాట్ త‌గిలింది. సందీప్ రెడ్డి వంగా యానిమ‌ల్ న‌టీన‌టులంద‌రికీ ఇమేజ్ పెంచింది. బాబీకి కూడా మంచి లైఫ్ నిచ్చింది. ముఖ్యంగా ర‌ణ‌బీర్ క‌పూర్ కి కెరీర్ బెస్ట్ హిట్ గా నిల‌వ‌డ‌మే గాక‌... బాబీ సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. బాబీ ఇటీవ‌ల వ‌రుస క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉన్నాడు. గ‌త‌ ఏడాది సీనియర్ హీరోలు స‌త్తా చాటారు. కొత్త సంవ‌త్స‌రంలో ఈ స‌క్సెస్ స్ట్రీక్ ని ఇలానే ముందుకు తీసుకెళ‌తార‌ని ఆకాంక్షిద్దాం.