2023లో 225 కోట్ల నష్టం తెచ్చిన సినిమా?
ఇక బ్రహ్మాస్త్ర చిత్రం రూ.400 కోట్లు రాబట్టినా, ప్రొడక్షన్ బడ్జెట్ భారీగా ఉండటంతో చాలా మంది దీనిని హిట్ అని పిలవడానికి ఇష్టపడలేదు.
By: Tupaki Desk | 21 Aug 2023 3:56 PMభారీ బడ్జెట్ సినిమాలు తీయడం ఎంత రిస్క్ అంటే? పెట్టుబడులను తిరిగి రాబట్టడం నేటి పోటీ ప్రపంచంలో సంక్లిష్ఠం. ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఆడాయి అని చెప్పుకున్నవి కూడా పెట్టుబడుల్ని రాబట్టలేక చివరికి పంపిణీదారులకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి వాటిలో రజనీకాంత్ 2.0, రణబీర్- బ్రహ్మాస్త్ర వంటి సినిమాలు ఉన్నాయి. 2.0 చిత్రం 500కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందని ప్రచారమైంది. కానీ ఆ సినిమాకి 650కోట్లు పెట్టుబడి పెట్టారని బడ్జెట్ అదుపుతప్పిందని ట్రేడ్ విశ్లేషించింది.
ఇక బ్రహ్మాస్త్ర చిత్రం రూ.400 కోట్లు రాబట్టినా, ప్రొడక్షన్ బడ్జెట్ భారీగా ఉండటంతో చాలా మంది దీనిని హిట్ అని పిలవడానికి ఇష్టపడలేదు. బడ్జెట్ల కారణంగా ఇప్పటివరకు తీసిన చాలా ఖరీదైన భారతీయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతిమంగా నిరుత్సాహానికి గురిచేశాయి.
భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఫ్లాప్ సినిమా 2023లో తెరకెక్కింది. ఈ సినిమా వల్ల రూ. 225 కోట్ల నష్టం వాటిల్లిందని ట్రేడ్ లో చర్చ సాగుతోంది. బాలీవుడ్ సహా భారతీయ సినిమాలలో అతిపెద్ద ఫ్లాప్ చిత్రం ఏది? అన్నదానిపైనా చర్చ కొనసాగుతోంది.
భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను కోల్పోయిన చిత్రం ఏది? అంటే కొన్ని క్లూస్ మాత్రం ఇవ్వగలం. దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 288 కోట్ల నికర వసూళ్లు రాబట్టగా, ఓవర్సీస్‌లో రూ. 35-38 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.
దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 325 కోట్ల నికర ఆదాయం వచ్చింది. అంటే పెట్టుబడిలో సగానికి మించి తేగలిగినా చివరకు ఈ చిత్రం రూ. 225 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా స్థూల సంపాదన కేవలం రూ. 350 కోట్లు అనుకున్నా.. ఇందులో పన్నులు తొలగిస్తే నష్టం పెద్దగానే కనిపించింది.
అద్భుతమైన ఓపెనింగులతో స్టార్ పవర్ తో ప్రారంభమైన ఈ చిత్రం నెగెటివ్ సమీక్షలతో ఊహించని రీతిలో నాలుగో రోజునుంచే బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. అయినా స్టార్ ఇమేజ్ తో ఈ స్థాయి వసూళ్లను సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ చివరికి ఇది బాలీవుడ్ అతిపెద్ద ఫ్లాప్ లుగా మాట్లాడుకునే షంషేరా, లాల్ సింగ్ చద్దా, జీరో కంటే పెద్ద నష్టాలను మిగిల్చిందని విశ్లేషణ సాగుతోంది.