2024 నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఎవరు..?
దీంతో ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 17 Dec 2024 2:01 AM GMT2024 సంవత్సరం చివరికి వచ్చేశాం. గడిచిన ఏడాది కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. సక్సెస్ రేట్ ఎంతనేది పక్కన పెడితే, విజయం సాధించిన సినిమాల వరకూ భారీ వసూళ్లే రాబట్టాయి. ఇక ఈ ఇయర్ లో చాలామంది నటీనటులు తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు. ఒకరికి మించి మరొకరు అనే విధంగా నటించారు. దీంతో ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి.
అల్లు అర్జున్ - 'పుష్ప 2'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ''పుష్ప 2: ది రూల్'' సినిమాతో బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నారు. 11 రోజుల్లోనే 1400 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించి, ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో టాప్-3లో నిలిచింది. ఒక కమర్షియల్ మూవీ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోందంటే, దానికి ప్రధాన కారణం ఈ చిత్రంలో బన్నీ నటన అని చెప్పాలి. పుష్పరాజ్ పాత్రలో అధ్బుతమైన పర్ఫార్మెన్స్ చేసాడు. జాతర ఎపిసోడ్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ తర్వాత వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో యాక్టింగ్ ఇరగదీశాడు. కాబట్టి 'పుష్ప 1'తో జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న అల్లు అర్జున్.. మరోసారి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ సాధిస్తారని సినీ అభిమానులు భావిస్తున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ - ది గోట్ లైఫ్:
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ''ది గోట్ లైఫ్''. సర్వైవల్ డ్రామాని 'ఆడు జీవితం' పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా పూర్తిగా ఎడారి ప్రాంతంలో తీసిన తొలి భారతీయ సినిమా ఇది. 90వ దశకంలో బ్రతుకు తెరువు కోసం అరబ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ మహ్మద్ అనే యువకుడి జీవిత కథతో ఈ మూవీ తీశారు. ఇందులో నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ ఒదిగిపోయారు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన విధానం, క్యారక్టర్ కి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ నటించిన తీరు అద్భుతమనే చెప్పాలి. దీని కోసం ఆయన ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 16 ఏళ్ళ పాటు కష్టపడ్డారు. తన పాత్ర కోసం 30 కేజీల బరువు తగ్గాడు. కొన్ని సీన్స్ లో నగ్నంగా నటించడానికి కూడా ఆయన వెనకాడలేదు. తప్పకుండా పృథ్వకే ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డు వరిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
మమ్ముట్టి - భ్రమయుగం:
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించి వైవిధ్యమైన చిత్రం ''భ్రమయుగం''. కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడిన ఈ పీరియడ్ హారర్ థ్రిల్లర్ కథంతా మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అందులో కొడుమాన్ పొట్టి అనే క్యారక్టర్ లో మమ్ముట్టి మెస్మరైజ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నట విశ్వరూపం చూపించారు. సినిమా మొత్తాన్ని తన యాక్టింగ్ తోనే నడిపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన నటన కట్టిపడేస్తుంది. ఇప్పటికే మూడుసార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న మమ్ముట్టి.. ఈసారి బెస్ట్ యాక్టర్ గా మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంటారని అనుకుంటున్నారు.
విక్రమ్ - తంగలాన్:
వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ''తంగలాన్''. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో 19వ శతాబ్దంలో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విక్రమ్ కథానుగుణంగా ఐదు పాత్రల్లో నటించారు. సినిమాలో ప్రధానంగా తంగలాన్ ముని, కాడైయన్ వంటి రెండు పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తారు. దీని కోసం విక్రమ్ మామూలుగా కష్టపడలేదు. తంగలాన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఒక విధంగా ప్రాణం పెట్టి నటించాడని చెప్పాలి. పూర్తి డీగ్లామర్‌గా, ఒంటిపై కేవలం ఒక గోచీతో అచ్చమైన ఆదివాసిలా తను కనిపించిన తీరు, పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇలాంటి ప్రయోగాత్మక క్యారక్టర్స్ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరేమో అనే విధంగా నటించారు. గతంలో 'శివ పుత్రుడు' సినిమాకి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ అందుకున్న చియాన్.. ఈ ఏడాది మళ్ళీ ఉత్తమ నటుడిగా నిలుస్తారని ఆయన అభిమానులు అంటున్నారు.
విజయ్ సేతుపతి - మహారాజా:
విజయ్ సేతుపతి కెరీర్ లో మైలురాయి 50వ చిత్రం "మహారాజా". ఇందులో ఒక సాధారణ బార్బర్ పాత్రలో సేతుపతి సహజమైన నటనతో ఆద్యంతం కట్టిపడేశాడు. లక్ష్మిని వెతికి పెట్టాలంటూ ఓవైపు అమాయకంగా నటిస్తూనే, మరోవైపు తన కూతురికి అన్యాయం చేసిన వాళ్లను వెంటాడి హతమార్చే తీరు ఆయన పరిపూర్ణమైన నటనా ప్రతిభకు అద్దం పడతాయి. చాలా సన్నివేశాల్లో కళ్లతోనే ఆయన పండించే భావోద్వేగాలు సినిమాలో హైలైట్ అనిపిస్తాయి. 'సూపర్ డీలక్స్' సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న సేతుపతి.. ఈసారి బెస్ట్ యాక్టర్ గా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజ్ కుమార్ రావు - శ్రీకాంత్:
విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు టైటిల్ రోల్ పోషించిన చిత్రం "శ్రీకాంత్". ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వ్యక్తి శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఇది. కళ్ళు లేకపోయినా శ్రీకాంత్ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన స్ఫూర్తిదాయకమైన కథను వివరిస్తుంది. ఇందులో రాజ్‌కుమార్ రావు అధ్బుతమైన నటన కనబరిచారు. బ్లైండ్ స్టూడెంట్ గా, శ్రీకాంత్ పాత్రలో ఒదిగిపోయారు. అందుకే ఆయన నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. ఈ పెర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డు రావడం ఖాయమని అంటున్నారు. రాజ్ కుమార్ ఇంతకముందు 'షాహిద్' సినిమాకి బెస్ట్ యాక్టర్ గా జాతీయ పురస్కారాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా, కేవలం నటనా ప్రతిభ ఆధారంగా 'బెస్ట్ యాక్టర్' ను ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే. మరి 2024 సంవత్సరానికి గాను పైన చెప్పుకున్న నటులకు ఇస్తారా? ఇంకెవరినైనా ఇతర యాక్టర్స్ ను ఎంపిక చేస్తారనేది వేచి చూడాలి.