Begin typing your search above and press return to search.

లెక్కల మాస్టారు సినీ ప్రయాణానికి 20 ఏళ్ళు!

ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్దమవుతున్న జీనియస్ ఫిల్మ్ మేకర్.. నేటితో 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం.

By:  Tupaki Desk   |   6 May 2024 10:30 PM GMT
లెక్కల మాస్టారు సినీ ప్రయాణానికి 20 ఏళ్ళు!
X

జీనియస్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొడుతూ, టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు సరిచేసిన లెక్క‌ల మాస్ట‌ర్ ఆయన. ఎస్ఎస్ రాజమౌళి లాంటి దర్శక ధీరుడే తనకు కాంపిటేటర్ గా చెప్పుకున్నాడంటే సుక్కూ ఎలాంటి దర్శకుడో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ ప్రారంభం నుంచీ సరికొత్త స్టోరీలను, వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో తెర మీద ఆవిష్కరిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్దమవుతున్న జీనియస్ ఫిల్మ్ మేకర్.. నేటితో 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, అనురాధ మెహతా హీరో హీరోయిన్లుగా నటించిన 'ఆర్య' సినిమాతో బండ్రెడ్డి సుకుమార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమమైన సంగతి అందరికీ తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ 2004 మే 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అంటే ఈ సినిమా వచ్చి ఈరోజుకి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తయింది. వ‌న్ సైడ్ ల‌వ్ థియ‌రీ అనే పాయింట్ తో తీసిన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇది బన్నీని స్టార్ గా నిలబెట్టింది. ఫీల్ మై లవ్ అంటూ డెబ్యూతోనే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయారు సుక్కూ.

'ఆర్య' సినిమాకు గాను సుకుమార్ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డ్ సాధించారు. అలానే బెస్ట్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డుతో పాటుగా మరికొన్ని పురష్కారాలు గెలుచుకున్నారు. ఇక ఈ సినిమా అదే పేరుతో మలయాళంలోకి డబ్బింగ్ చేయబడి కేరళలోనూ మంచి హిట్టు కొట్టింది. ఆ తర్వాత హిందీలోకి డబ్ చేయబడి, 'కుట్టి' పేరుతో తమిళ్ లోకి రీమేక్ చేయబడింది.

సుకుమార్ రెండో సినిమా 'జగడం' (2007) మర్షియల్ సక్సెస్ అందుకోకపోయినా, ఆయన కెరీర్ లోని ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అరుదైన సెన్సిబిలిటీస్ ఉన్న యాక్షన్ కథతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని మాస్ హీరోగా ప్రెజెంట్ చేయడంలో విజయం సాధించాడు సుక్కూ. టేకింగ్ పరంగా వైవిధ్యం చూపించి, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన 'ఆర్య 2' చిత్రం ఆశించిన విజయాన్ని రాబట్టలేదు. అయినప్పటికీ క్యారెక్టరైజేషన్ ఆధారంగా ఎమోషన్ పండించే దర్శకుడిగా సుకుమార్ కు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ మూవీ బన్నీని స్టైల్‌కు పర్యాయపదంగా మార్చేసిందని చెప్పాలి.

2011లో యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా '100% లవ్'. ఇందులో బాలు - మహాలక్ష్మి పాత్రల ద్వారా ప్రేమ, ఇగోలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. చైతూని సరికొత్తగా చూపించారు. యూత్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, రెండు నంది పురష్కారాలను సాధించింది. బెస్ట్ డైరెక్టర్ గా సుక్కూకి ఫిలిం ఫేర్, సైమా అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నిన్న మే 6వ తేదీ నాటికి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా '1 నేనొక్కడినే'. 2014లో వచ్చిన ఈ యునిక్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్.. మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితేనేం సుక్కూ టేకింగ్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మహేశ్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ చేయకుండా, ఇలాంటి ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తీసినందుకు అందరూ దర్శకుడిని మెచ్చుకున్నారు. ఇదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమా మంచి విజయం సాధించింది. సుక్కూ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది. ఇందులో తారక్ తన కెరీర్ లోనే ఎన్నడూ లేనటువంటి లుక్ లో కనిపించారు.

ఇక గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమా టాలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ లో ఒకటిగా పరిగణించబడుతుంది. 80స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ పీరియడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా చెర్రీని చూపించి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించింది. ఇక మూడేళ్ళ తర్వాత సుక్కూ నుంచి వచ్చిన 'పుష్ప' సినిమా ఆయన్ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా 'పుష్ప: ది రైజ్'. 2021లో రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆయన క్రియేట్ చేసిన పుష్పరాజ్ పాత్ర, తగ్గేదే లే మేనరిజమ్ హిందీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే నార్త్ మార్కెట్ లో ఇది 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో సుక్కూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. బన్నీ ఉత్తమ నటుడిగా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15న విడుదల కాబోతున్న 'పుష్ప: ది రూల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది పక్కా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు. సుక్కూ తన ఇంటెలెక్చ్యువల్ రైటింగ్ తో మరిన్ని విజయాలు అందుకోవాలని, ఇండస్ట్రీలో మరికొన్ని దశాబ్దాల సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించాలని కోరుకుందాం.