ఇండస్ట్రీలో 25 ఏళ్లు... బెల్లంకొండ సురేష్ బ్యాక్ టు ఫామ్
అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఏకంగా పాతిక సంవత్సరాల పాటు నిర్మాతగా జర్నీ పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు.
By: Tupaki Desk | 5 Dec 2024 9:34 AM GMTప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో నిర్మాత కొనసాగడం అనేది అత్యంత కష్టమైన విషయం. పెద్ద హీరోల సినిమాలకు విపరీతమైన బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. సినిమా ఫలితం తారుమారు అయితే నిర్మాత ఆచూకి లేకుండా పోతున్నారు. చిన్న హీరో సినిమాలకు ఎంత ఖర్చు పెట్టినా ఫలితం అటు ఇటు అయితే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు చాలా మంది కొన్ని సినిమాలు చేసి అలా వెళ్లి పోతున్నారు. రెండు మూడు సినిమాలు చేసి కనుమరుగు అయిన నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఏకంగా పాతిక సంవత్సరాల పాటు నిర్మాతగా జర్నీ పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. అది కాకుండా స్టార్ ప్రొడ్యూసర్‌గా బెల్లంకొండ సురేష్ టాలీవుడ్‌కి ఎన్నో సూపర్ హిట్‌లను ఇచ్చి తన జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు.
నేడు(డిసెంబర్) ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. గత కొంత కాలంగా సినిమా నిర్మాణంకు దూరంగా ఉంటున్నా, తన కొడుకుల సినిమాలతో జనాల్లో, మీడియాలో ఉంటూనే ఉన్నారు. బెల్లంకొండ సురేష్ తన ఇద్దరు కొడుకులను హీరోలుగా పరిచయం చేశారు. స్టార్ హీరోల వారసులకు సైతం దక్కని భారీ ఎంట్రీ బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కి దక్కింది. మొదటి సినిమాతోనే సాయి శ్రీనివాస్‌కి హీరోగా మంచి గుర్తింపు రావడంలో ఆయన తండ్రి సురేష్ పాత్ర అత్యంత కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు ఉన్న అనుభవంతో సాయి శ్రీనివాస్‌కి మంచి ప్లాట్ ఫామ్‌ను సురేష్ క్రియేట్ చేశారు.
25 ఏళ్ల సినీ జర్నీలో 38 సినిమాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ చివరగా 2015లో గంగ సినిమాను నిర్మించారు. అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల నిర్మాణం కు దూరంగా ఉంటూ వస్తున్న బెల్లంకొండ సురేష్ తిరిగి తన సినీ నిర్మాణంను మొదలు పెట్టబోతున్నట్లు పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా సినిమాలను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ నిర్మాతగా రీ ఎంట్రీ కోసం ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నిర్మాణంలో సురేష్ రీ ఎంట్రీ ఆయన తనయుడు సినిమా తో ఉండబోతుంది. 2025 ఏప్రిల్‌లో కొడుకుతో సినిమాను ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అభిరుచి ఉన్న నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించడంతో పాటు, తన సలహాలు, సూచనలతో ఎన్నో సినిమాలకు తన వంతు సహకారం అందించి భారీ విజయాలను కట్టబెట్టడం జరిగింది. తన 25 ఏళ్ల సినీ జర్నీ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అన్నారు. నిర్మాణంకు ఇన్నాళ్లు గ్యాప్ ఇవ్వడంపై మాట్లాడుతూ.. పిల్లలు బయట సినిమాలు చేస్తున్నారు. అందుకే గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. పెద్ద అబ్బాయి కెరీర్ సెట్ అయ్యింది. చిన్నబ్బాయి సెట్ చేసుకుంటున్నాడు. రెండు మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. వాటితో తను కూడా సెట్ అయిపోతాడు. ఏప్రిల్ లో ఇద్దరి అబ్బాయిల ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి అన్నారు.
తాను 9 ఏళ్లు నిర్మాణంకు దూరంగా ఉన్నా ఇండస్ట్రీకి దూరంగా లేను. చత్రపతి సినిమాని నేనే ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాను. అయితే ప్రొడక్షన్‌లో అప్పటితో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్లుగా సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులకు అందిస్తాను అంటూ సురేష్ పేర్కొన్నారు. నాకు ఎవరూ సపోర్ట్ లేనప్పుడు మోహన్ బాబు గారు నన్ను సినిమాకి మేనేజర్ ని చేశారు. ఆయన నా దేవుడు. పూరి జగన్నాథ్ గారితో సినిమా చేయాలని వుంది. హీరోయిజాన్ని మారుస్తాడు. హీరోని ఎలివేట్ చేస్తాడు. 90 రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ తో పని చేయాలని వుంది అన్నారు.
ఇద్దరు అబ్బాయిలు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది పెద్ద అబ్బాయి సాయి శ్రీనివాస్ వివాహం అనుకుంటున్నాం. ఇప్పటికే పెళ్లి సంబంధం కుదిర్చాం. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం అన్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత బెల్లంకొండ సురేష్ మీడియా ముందుకు రావడంతో ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆయన నుంచి గతంలో మాదిరిగా మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ, వస్తాయని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్ డే బెల్లంకొండ సురేష్ గారు.