శంకరాభరణంకు 45 ఏళ్లు..
తెలుగు సినమా కీర్తిని దేశం మొత్తానికి తెలియచేసిన మొదటి సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి2 అంటే రేపటికి ఈ సినిమా రిలీజై 45 ఏళ్లు పూర్తవుతాయి.
By: Tupaki Desk | 1 Feb 2025 9:21 AM GMTకళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా సాధించని రికార్డు లేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినమా కీర్తిని దేశం మొత్తానికి తెలియచేసిన మొదటి సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి2 అంటే రేపటికి ఈ సినిమా రిలీజై 45 ఏళ్లు పూర్తవుతాయి.
జె.వి సోమయాజులు, మంజు భార్గవి, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించిన శంకరాభరణం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు కూడా బ్లాక్ బస్టర్ అయి, అప్పట్లోనే పాన్ ఇండియన్ లెవెల్ లో ఆకట్టుకుంది. అమెరికాలో రెగ్యులర్ థియేటర్లలో రిలీజైన మొదటి తెలుగు సినిమా కూడా శంకరభరణంనే.
అమెరికాలోనే కాదు, ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో శంకరాభరణం రిలీజై తెలుగు సినిమా సత్తాను ఆ రోజుల్లోనే ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంకా చెప్పాలంటే శంకరాభరణం రిలీజయ్యాక చాలా మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. అవార్డుల పరంగా కూడా శంకరాభరణంకు చాలానే అవార్డులొచ్చాయి. తెలుగులో స్వర్ణకమలం అవార్డు అందుకున్న మొదటి సినిమా ఇదే.
ఈ సినిమాలో పాడినందుకు గానూ ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటిసారిగా జాతీయ అవార్డు అందుకోగా ఉత్తమ గాయకురాలిగా వాణి జయరాం, ఉత్తమ సంగీత దర్శకుడిగా కె.వి మహదేవన్ జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ సినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 నంది అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది.
అంతేకాదు శంకరాభరణం సినిమాపై చాగంటి కోటేశ్వరరావు మూడు రోజుల పాటూ ప్రవచనాల కార్యక్రమం చేశారంటే ఈ సినిమా గొప్పదనాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సినిమా రిలీజై 45 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలకు స్పెషల్ క్రేజ్ ఉంది.