75 కోట్లతో దేశంలోనే ఖరీదైన వాణిజ్య ప్రకటన
ఇటీవల కొన్నేళ్లుగా బాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను విప్లవాత్మకంగా మార్చిన ఫిలింమేకర్ రోహిత్ శెట్టి వీటికి దర్శకత్వం వహించారు.
By: Tupaki Desk | 2 Oct 2023 4:59 PM GMTభారతదేశంలో ఇప్పటివరకూ అత్యంత ఖరీదైన వాణిజ్య ప్రకటన తెరకెక్కించిన దర్శకుడు ఎవరు? ఈ ప్రకటన కోసం ఎంత ఖర్చు చేశారు? అంటే నిజానికి కళ్లు భైర్లు కమ్మే నిజాలు ఇక్కడ ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌కు సరిపోయే బడ్జెట్‌లో ఈ ప్రకటనను తెరకెక్కించడం ఇప్పుడు తాజా సంచలనం. ఇది ఖరీదైన కారు, ఆభరణాలు, ప్రీమియం దుస్తులు లేదా రియల్ ఎస్టేట్ వంటి లగ్జరీ ఉత్పత్తి కోసం చేసిన ప్రకటన కాదు. నెస్లే మ్యాగీ వంటి వాటి ఆధిపత్యం ఉన్న మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న FMCG బ్రాండ్ కోసం టీవీ వాణిజ్య ప్రకటన. యాక్షన్ సినిమా రేంజులో ఒక టీవీ ప్రకటన కోసం ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసారు.
దీనికి దర్శకత్వం వహించింది మరెవరో కాదు. ఇటీవల కొన్నేళ్లుగా బాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను విప్లవాత్మకంగా మార్చిన ఫిలింమేకర్ రోహిత్ శెట్టి వీటికి దర్శకత్వం వహించారు. యాడ్‌కు భారతదేశంలోని అత్యంత ధనిక ఫిల్మ్ స్టూడియో యష్ రాజ్ ఫిల్మ్స్ మద్దతునిచ్చింది. అత్యాధునిక VFX.. దానిలో నటించిన స్టార్ యాక్టర్ కారణంగా బడ్జెట్ రూ. 75 కోట్లకు చేరుకుంది.
ఇంతకీ ఇది ఏ ప్రకటన? అంటే....ఈ ప్రకటన చింగ్స్ నూడుల్స్ బ్రాండ్‌కు సంబంధించినది. అందులో కనిపించి, అత్యంత ఖరీదైన టీవీ యాడ్‌లో నటించిన బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్. దానికి 'రణ్‌వీర్ చింగ్ రిటర్న్స్' అనే టైటిల్ సరిగ్గానే పెట్టారు.
ఇది 'మై నేమ్ ఈజ్ రణ్‌వీర్ చింగ్' యాడ్‌గా పాపులరైంది. 5 నిమిషాల 30 సెకన్ల ప్రకటన టెలివిజన్‌లో 28 ఆగస్టు 2016న ప్రదర్శితమైంది. ఆన్‌లైన్‌లో ఇది కేవలం 2 రోజుల్లోనే యూట్యూబ్ లో 20 లక్షల వీక్షణలను పొందింది. రణ్‌వీర్ సింగ్ తన ప్రజాదరణతో ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే కాంట్రాక్ట్ ను దక్కించుకున్నాడు. ఈ ప్రకటనతో సదరు నూడిల్ కంపెనీ అమ్మకాలు 150 శాతం పెరిగాయి.
ఇంతలో 2022లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించిన తర్వాత రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం భారతదేశం అత్యంత విలువైన సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. కార్పొరేట్ పరిశోధన - రిస్క్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ ప్రకటించిన ఫలితాల ప్రకారం. రణ్ వీర్ 5 సంవత్సరాల తర్వాత కోహ్లీ రికార్డును బ్రేక్ చేసాడు. కోహ్లీ బ్రాండ్ విలువ 176.9 మిలియన్ డాలర్లకు చేరగా, రణవీర్ బ్రాండ్ వ్యాల్యూ 181.7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2022: బియాండ్ ది మెయిన్ స్ట్రీమ్ ఈ సంగతులను వెల్లడించింది.