Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో : 20 ఏళ్ల తర్వాత సేమ్‌ సీన్ రీ క్రియేట్‌

అలాంటి సినిమాలోని సన్నివేశాలను ఎన్నో స్టేజ్‌లపై రీ క్రియేట్‌ చేశారు, ఎన్నో సినిమాల్లోనూ వాడిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   12 March 2025 2:16 PM IST
వైరల్ వీడియో : 20 ఏళ్ల తర్వాత సేమ్‌ సీన్ రీ క్రియేట్‌
X

రెండు దశాబ్దాల క్రితం వచ్చిన '7/జీ బృందావన్ కాలనీ' సినిమా ఒరిజినల్ వర్షన్ తమిళ్‌లో ఎంత విజయాన్ని సొంతం చేసుకుందో కానీ తెలుగులో మాత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇరవై ఏళ్లు అవుతున్నా సినిమా ఇప్పటికి టీవీలో వస్తుంటే జనాలు తెగ చూస్తూ ఉంటారు. అప్పటి యువతరం మాత్రమే కాకుండా ఇప్పుడు యూత్‌ కూడా సినిమాను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల సినిమాను రీ రిలీజ్ చేస్తే స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు దక్కించుకుంది. ఒక డబ్బింగ్‌ సినిమాకు ఇంత క్రేజ్ దక్కడం మరెప్పుడూ చూసి ఉండరు. తెలుగులో ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో సందేహం లేదు.

సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో రూపొంది 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన '7/జీ బృందావన్ కాలనీ' సినిమాలో హీరోగా రవి కృష్ణ నటించగా, హీరోయిన్‌గా సోనియా అగర్వాల్‌ నటించారు. వారిద్దరి నటన, ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక హీరో రవి కృష్ణ తండ్రి పాత్రతో పాటు సుమన్ శెట్టి ఇలా ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులను అలరించింది. సుమన్‌ శెట్టి పాత్ర నవ్విస్తే కొన్ని పాత్రలు ఏడిపించాయి. మొత్తంగా ఆ సినిమా ఒక అద్భుతమైన దృశ్య కావ్యం అని అప్పట్లో సినిమాను చూసిన వారు ఇప్పటికీ అంటూ ఉంటారు. అలాంటి సినిమాలోని సన్నివేశాలను ఎన్నో స్టేజ్‌లపై రీ క్రియేట్‌ చేశారు, ఎన్నో సినిమాల్లోనూ వాడిన విషయం తెల్సిందే.

ఇప్పటి వరకు రీ క్రియేట్‌ చేసిన వీడియోలను చూశాం. కానీ మొదటి సారి ఆ సినిమాలో హీరో హీరోయిన్‌గా నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ కలిసి బస్‌స్టాండ్‌ సీన్‌ను రీ క్రియేట్‌ చేసి సర్‌ప్రైజ్ చేశారు. జీ తెలుగులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరు అప్పటి సన్నివేశాన్ని స్టేజ్‌పై రీ క్రియేట్‌ చేసి అక్కడున్న వారు అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. రవికృష్ణ గుర్తు పట్టనంత మారాడు, కానీ సోనియా అగర్వాల్‌ మాత్రం అస్సలు మారలేదు. ఆమె లుక్‌ అలాగే ఉంది. అంతే కాకుండా ఎక్స్‌ ప్రెషన్స్ ఇద్దరివీ ఏమాత్రం తప్పలేదు. సినిమాలో ఎలా అయితే కనిపించారో అలాగే ఇద్దరూ కనిపించి మెప్పించారు. అందుకే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

7/జీ బృందావన్‌ కాలనీ విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెల్సిందే. దర్శకుడు సెల్వ రాఘవన్‌ సినిమా సీక్వెల్‌ను ప్రకటించి ఇప్పటికే షూటింగ్‌ మొదలు పెట్టాడు. మొదటి పార్ట్‌లో సోనియా పాత్ర చనిపోయినట్లు చూపించారు. కనుక సీక్వెల్‌లో ఆమె కనిపించదు. రవికృష్ణ, అనశ్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతే కాకుండా యంగ్‌ జంట సైతం ఈ సినిమాలో కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది. తెలుగులోనూ భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయాలని అంతా కోరుకుంటున్నారు.