Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: భ‌న్సాలీ నాయిక‌ల క‌ళాత్మ‌క పాత్ర‌లు

అగ్ర బాలీవుడ్ నటీమణులు సంజయ్ లీలా భ‌న్సాలీ చిత్రాలలో పాపుల‌ర్ పాత్రలు పోషించి త‌మ స్థాయిని పెంచుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 6:00 AM GMT
టాప్ స్టోరి: భ‌న్సాలీ నాయిక‌ల క‌ళాత్మ‌క పాత్ర‌లు
X

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భన్సాలీ వ‌రుస ప్ర‌యోగాలు నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌చ్చేవే. భారీత‌నం నిండిన సెట్లు, ఎంపిక చేసుకున్న నేప‌థ్యం, సంగీతం, క‌ళ ఇలా అన్ని విభాగాల్లో అత‌డి ముద్ర ఎంతో ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా అత‌డు త‌న క‌థానాయిక‌ల‌ను ఎలివేట్ చేసే విధానం అసాధార‌ణంగా ఉంటుంది. కాశీబాయి నుండి గంగూభాయి వరకు సంజయ్ లీలా భన్సాలీ అద్భుతమైన పాత్రలను సృజించారు. అగ్ర బాలీవుడ్ నటీమణులు సంజయ్ లీలా భ‌న్సాలీ చిత్రాలలో పాపుల‌ర్ పాత్రలు పోషించి త‌మ స్థాయిని పెంచుకున్నారు.

ఇటీవ‌ల వేశ్య‌ల క‌థ‌ల‌తో 'హీరామాండి' అనే భారీ వెబ్ సిరీస్ ని తెర‌కెక్కిస్తున్న సంజయ్ లీలా భన్సాలీ మళ్లీ చర్చనీయాంశంగా మారారు. ఈ ప్రాజెక్ట్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల కానుంది. అద్భుతమైన తారాగణంతో ఈ సినిమాని భ‌న్సాలీ ఎంతో క‌ళాత్మ‌కంగా తీర్చిదిద్దుతున్నారు. భ‌న్సాలీ చిత్రాల్లో న‌టీమ‌ణుల గొప్ప పాత్ర‌ల‌ను ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌రం.

ఐశ్వర్యరాయ్ బచ్చన్

ప్ర‌పంచ సుంద‌రి 1994 ఐశ్వర్య రాయ్ బచ్చన్ భన్సాలీ తెర‌కెక్కించిన 'హమ్ దిల్ దే చుకే సనమ్' (1999) - 'దేవదాస్' (2002) చిత్రాలలో అద్భుతమైన ప్రదర్శనతో మెప్పించారు. ఐష్ ఈ రెండు సినిమాలలో ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. భారతీయ ప్రేక్షకులలో మరింత ప్రజాదరణ పొందింది. నందిని .. పారో పాత్రలతో ఇప్పటికీ ప్రత్యేక అభిమానుల సంఘాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన ఐశ్వ‌ర్యారాయ్ కి భ‌న్సాలీ సినిమాల్లో పాత్ర‌లు ఎంతో గొప్ప ఖ్యాతిని తెచ్చాయి.

ప్రియాంక చోప్రా

'బాజీరావ్ మస్తానీ'లో ప్రియాంక చోప్రా పోషించిన మరపురాని పాత్ర కాశీబాయి. హిందూస్తాన్ టైమ్స్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రియాంక ఈ పాత్ర గురించి ఇలా అన్నారు. ''కాశీభాయి నేను న‌టించిన‌ కష్టతరమైన భాగాలలో ఒకటి!'' మరొక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ క్యాప్షన్‌లో పీసీ వ్యాఖ్యానిస్తూ..బోల్డ్, లాయల్ & ఫియర్స్... నేను పోషించిన అత్యంత ఆకర్షణీయమైన పాత్రలలో కాశీబాయి ఒకటి అని తెలిపింది. ఈ చిత్రంలో న‌ట‌న‌కుగాను, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

అలియా భట్

భన్సాలీ తెర‌కెక్కించిన ఇటీవ‌లి సినిమా గంగూబాయి కతియావాడిలో అలియా భట్ అద్భుతమైన న‌ట‌ప్రదర్శనతో హృద‌యాల‌ను దోచుకుంది. భ‌న్సాలీతో ఆలియాకు ఇది మొదటి చిత్రం. గంగూభాయి.. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో వేశ్య పాత్రను ఆలియా పోషించింది. అనేక వివాదాల మధ్య ఈ చిత్రం విడుద‌లై రూ.100 కోట్ల మార్కును అధిగ‌మించింది. ఉమెన్-సెంట్రిక్ ఫిల్మ్ గంగూభాయి క‌తియావాడీ కి ఐఎమ్‌డిబిలో 10కి 7 రేటింగ్ ద‌క్కింది.

ఆ పాత్ర తనని ఎలా ప్రభావితం చేసిందనే దాని గురించి మాట్లాడుతూ అలియా భట్ ఔట్‌లుక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలిపారు. ''ఇది నన్ను ప్రభావితం చేసింది కానీ డార్క్ థీమ్ లేదు. గంగూభాయి పాత్ర కఠినమైనది. విషయం ఏమిటంటే ఆమె (గంగూబాయి) ఒక చెడ్డ ప్రపంచంలో సూర్యరశ్మి. చీకటి పని(వ్య‌భిచారం)లో ఉండ‌డం అంటే.. ఒక అమ్మాయి పాత్ర‌ చీకటిగా ఉన్నట్లు కాదు. ఇది తీవ్రమైన వ్య‌వ‌హారికం ఉన్న పాత్ర‌.. కాబట్టి నేను ఆ పాత్ర‌లో విపరీతంగా జీవించాను.. అని తెలిపింది.

రాణి ముఖర్జీ

'బ్లాక్' సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ సహ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. హిందీ వెర్ష‌న్ ఉత్తమ చలనచిత్రం అవార్డు గెలుచుకుంది. రాణి ముఖర్జీ పుట్టుకతోనే గుడ్డి - చెవిటి మహిళ పాత్రను పోషించింది. తన అద్భుత‌ నటనకు ప్రశంసలు అందుకుంది. చెవిటి గుడ్డి అమ్మాయిగా స‌వాల్ అనిపించే పాత్ర‌లో చేసింది రాణీ. శారీరక వైకల్యాలు ఉన్న అనేక మంది పిల్లలను కలవడం ద్వారా ఆ పాత్ర కోసం రాణీ ప్రిపేరైంది. వారి ప్ర‌వ‌ర్త‌న‌ను న‌టిగా తాను వోన్ చేసుకున్న తీరుకు ప్ర‌శంస‌లు కురిసాయి.

మాధురీ దీక్షిత్ నీనే

దేవదాస్ (2002)లో చంద్రముఖిగా మాధురీ దీక్షిత్ పాత్ర మ‌ర‌పురానిది. కాహే ఛేద్ - మార్ దాలాలో మాధురి లుక్ ఆ రూపం కిల్ చేసాయి. ధక్-ధక్ గాళ్ ఉత్తమ సహాయ నటిగా అవార్డులెన్నో గెలుచుకుంది. ఈ చిత్రం 11 ఫిల్మ్‌ఫేర్, ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. భారతదేశం స‌హా ఓవర్సీస్‌ కలిపి సినిమా మొత్తం వసూళ్లు 13 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా ద‌క్కాయి.

దీపికా పదుకొనే

దీపికా పదుకొణె సంజయ్ లీలా భ‌న్సాలీతో చాలా సినిమాలకు పనిచేసింది. బాజీరావ్ మస్తానీలోని మస్తానీ గా.. పద్మావత్‌లో రాణి పద్మావతి గా న‌టించింది. పీసీ కెరీర్ లో అత్యంత పాపుల‌రైన పాత్ర‌లుగా నిలిచాయి. బాజీరావ్ మస్తానీకి గానూ ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది - పద్మావత్‌లో ఉత్తమ నటిగా జీ సినీ అవార్డులు గెలుచుకుంది. ఆమె రెండు చిత్రాలకు కూడా అనేక అవార్డులకు నామినేట్ అయింది. ప‌ద్మావ‌త్ రిలీజ్ స‌మ‌యంలో హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక‌ ఇలా అన్నారు. ''పద్మావత్ మహిళల శక్తి, బలం, ధైర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన పాత్ర‌. ఒక వ్యక్తిగా, కళాకారిణిగా, నేను గొప్ప‌ అనుభూతిని పొందాను. గర్వం, ఆనందం ఉన్నాయి'' అని తెలిపారు.

హిరామండీతో సంచ‌ల‌నాలు ఖాయం:

భ‌న్సాలీ తెర‌కెక్కించిన గంగూభాయి క‌థియావాడీ (2022) గ‌త ఏడాది విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ విజ‌యం సాధించిన‌ త‌ర్వాత ఆయ‌న హీరామండీ అనే ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. హీరామండి భారీ బ‌డ్జెట్ తో కూడుకున్న ఒక వెబ్ సిరీస్. నిజ‌క‌థ‌ల‌తో రూపొందుతోంది. ఈ సిరీస్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఇండ‌స్ట్రీలో అగ్ర క‌థానాయిక‌లంతా ఇందులో భాగం. మనీషా కొయిరాలా- సోనాక్షి సిన్హా- అదితి రావ్ హైదరీ-రిచా చద్దా-షర్మిన్ సెగల్- సంజీదా షేక్ లాంటి అద్భుతమైన ప్రతిభావంతులైన స్టార్స్ పోషించిన కీలక పాత్రలతో ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేయ‌గా గొప్ప క్యూరియాసిటీని పెంచింది.

ఈ వెబ్ సిరీస్ 1940ల నాటి భారత స్వాతంత్య్ర‌ పోరాటంలో గందరగోళాల‌కు భిన్నంగా వేశ్యల జీవ‌నం వారి పోషకుల కథలేమిట‌న్న‌ది తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. అంద‌గ‌త్తెలైన వేశ్య‌ల‌తో మిరుమిట్లుగొలిపే హీరామండి ప్రాంత‌ సాంస్కృతిక వాస్తవికతను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. కోతాస్ (వేశ్యల ఇల్లు)లో ప్రేమ- ద్రోహం-వారసత్వం - రాజకీయాలు వంటి అంశాల‌ను సంజయ్ లీలా భ‌న్సాలీ ఈ సిరీస్ లో చూపించ‌నున్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ క‌థ‌లు.. సంక్లిష్టమైన మనోహరమైన పాత్రలు.. అద్భుత‌ సంఘర్షణలతో నిండిన ప్రపంచాన్ని హీరామండీలో వీక్షించ‌గ‌ల‌ర‌ని భ‌న్సాలీ హామీ ఇచ్చారు. హీరామండి తన ఇత‌ర సినిమాల‌ మాదిరిగానే ప్రేక్షకులకు క‌నెక్ట‌వుతుంది. క‌థ‌తో కలిసిపోయే ప్రత్యేకమైన సంగీతం ఆహ్లాదాన్ని పంచుతుంద‌ని తెలిపారు.