మూవీ రిలీజై 10 ఏళ్లు.. ఇంకా ట్రెండింగ్ లోనే రౌడీ ఫెలో!
'ఈ క్షణం.. స్వయంవరం.. ఇవ్వాలా సంబరం.. ఈ క్షణం..' అంటూ సాగుతున్న సాంగ్ కు ఇన్ స్టాగ్రామ్ లో బోలెడన్ని రీల్స్ ను మనం చూసే ఉంటాం.
By: Tupaki Desk | 4 April 2025 11:30 AM'ఈ క్షణం.. స్వయంవరం.. ఇవ్వాలా సంబరం.. ఈ క్షణం..' అంటూ సాగుతున్న సాంగ్ కు ఇన్ స్టాగ్రామ్ లో బోలెడన్ని రీల్స్ ను మనం చూసే ఉంటాం. కొన్ని నెలలుగా ఆ పాట ఓ రేంజ్ లో వైరల్ అవుతూనే ఉంది. చాలా మంది కపుల్స్ ఆ సాంగ్ కు కచ్చితంగా రీల్ చేయాలని ఫిక్స్ అయ్యి మరీ చేస్తుండడం విశేషం!
ఇంకొందరు తమ పిక్స్ ను వీడియోగా మార్చి.. బ్యాక్ గ్రౌండ్ లో ఆ సాంగ్ నే పెట్టుకుంటున్నారు. అయితే ఆ పాట ఏ మూవీలోనిదో మీకు గుర్తుందా? ఫుల్ ట్రెండింగ్ లో సాంగ్ ఉంది కనుక.. రీసెంట్ పాట అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే మీరు పప్పులే కాలేసినట్లే. ఆ పాట.. పదకొండేళ్ల క్రితం రిలీజ్ అయిన మూవీలోనిది.
అవును మీరు చదివింది నిజమే! యంగ్ హీరో నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో మూవీలోనిది ఆ సాంగ్. పాటల రచయితగా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ చైతన్య ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రంతోనే డైరెక్టర్ గా ఆయన మారారు. దర్శకుడిగా డెబ్యూతో మంచి హిట్ అందుకున్నారు కృష్ణ చైతన్య.
2014 నవంబర్ లో రిలీజ్ అయిన రౌడీ ఫెలో మూవీ క్లాసికల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కృష్ణ చైతన్య విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాలోని పాట.. ఆ సీతాదేవి నవ్వులా.. ఉన్నావే ఏంటి మాటలా.. ఇన్ స్టాగ్రామ్ లోని మెలోడియస్ క్యాటగిరీలో ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. గ్లోబల్ గా 91వ ప్లేస్ లో ఉండడం గమనార్హం.
ఆ సాంగ్ లోని 'ఈ క్షణం స్వయంవరం.. ఇవ్వాలా సంబరం.. ఈ క్షణం..' అంటూ సాగే బిట్ మరింత ట్రెండ్ అవుతోంది. అయితే ఆ పాటకు.. సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్యనే లిరిక్స్ అందించడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎం.ఆర్ కంపోజ్ చేసిన ఆ పాటకు సింగర్ అర్జీత్ సింగ్ తన గాత్రంతో ప్రాణం పోశారు.
సినిమా విడుదలై 11 ఏళ్లు అవుతున్నా.. ఇంకా అందులోని పాట ట్రెండింగ్ లో ఉండడమంటే గ్రేటే. అంతలా కృష్ణ చైతన్య ఇచ్చిన లిరిక్స్.. సన్నీ అందించిన మ్యూజిక్.. అర్జీత్ గాత్రం ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఇన్ స్టాలో రౌడీ ఫెలో మూవీ సాంగ్ టాప్ ట్రెండింగ్ లో ఉన్న విషయం.. ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వైరల్ అయింది.
దీంతో అంతా ఆ మూవీ కోసం మాట్లాడుకుంటున్నారు. రోహిత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అంతా చెబుతున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందించిన ఆ సినిమా చాలా బాగుంటుందని కొనియాడుతున్నారు. ముఖ్యంగా సాంగ్స్ అన్నీ కూడా అందరినీ మెప్పించాయని అంటున్నారు.
ఇక మూవీ విషయానికొస్తే.. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. మూవీ మిల్స్ & సినిమా 5 బ్యానర్ పై ప్రకాష్ రెడ్డి నిర్మించారు. నారా రోహిత్ తోపాటు విశాఖ సింగ్, రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అందుబాటులో ఉంది. ఏదేమైనా సాంగ్ మాత్రం ఫుల్ ట్రెండింగే ట్రెండింగ్.