'ఆదికేశవ' మూవీ రివ్యూ
By: Tupaki Desk | 24 Nov 2023 5:57 AM'ఆదికేశవ' మూవీ రివ్యూ
నటీనటులు: వైష్ణవ్ తేజ్-శ్రీలీల-జోజు జార్జ్-రాధిక శరత్ కుమార్-అపర్ణ దాస్-సుమన్-తనికెళ్ల భరణి-జయప్రకాష్-సుదర్శన్ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: డడ్లీ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ-సాయి సౌజన్య
రచన-దర్శకత్వం: శ్రీకాంత్ రెడ్డి
'ఉప్పెన'తో అరంగేట్రంలో భారీ విజయాన్నందుకున్న మెగా కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత 'కొండపొలం'.. 'రంగ రంగ వైభవంగా' చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇప్పుడతను 'ఆదికేశవ' అనే మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే విడుదలైన 'ఆదికేశవ' మళ్లీ వైష్ణవ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా ఉందేమో చూద్దాం పదండి.
కథ:
బాలు (వైష్ణవ్ తేజ్) ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడు. చదువు పూర్తి చేసుకుని స్నేహితులతో సరదాగా తిరిగేస్తున్న అతను.. తల్లి కోరిక మేరకు ఉద్యోగం చేయడానికి సిద్ధమవుతాడు. ఒక కాస్మొటిక్ కంపెనీ సీఈవో అయిన చిత్ర (శ్రీలీల)ను మెప్పించి చేసి తన కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆమెతో ప్రేమలో పడి.. ఆమె కూడా తన పట్ల ఇంప్రెస్ అయ్యేలా చేస్తాడు బాలు. ఇలా సాఫీగా సాగుతున్న అతడి జీవితం ఉన్నట్లుండి మలుపు తిరుగుతుంది. తనను పెంచుతున్న వాళ్లు అసలు తల్లిదండ్రులు కాదని.. తన అసలు పేరు రుద్రకాళేశ్వర్ రెడ్డి అని తెలుస్తుంది. అప్పుడతను తన సొంత ఊరైన బ్రహ్మసముద్రం వెళ్తాడు. అక్కడ చెంగారెడ్డి (జోజు జార్జ్) అనే గూండాతో రుద్ర తలపడాల్సి వస్తుంది. మరి రుద్ర నేథ్యమేంటి.. చెంగారెడ్డితో తలపడి అతను గెలిచాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
హీరో కుటుంబానిది రాయలసీమ. తండ్రి ఆ ప్రాంతం మొత్తం కొలిచే పెద్ద మనిషి. సీమలో ఫ్యాక్షన్ గొడవలు తగ్గాలని విలన్ కుటుంబానికే హీరో కుటుంబం నుంచి అమ్మాయిని ఇస్తారు. కానీ అక్కడామె హింసకు గురవుతుంటుంది. విలన్ వల్ల హీరో కుటుంబం దెబ్బ తింటుంది. హీరో సీమకు దూరంగా సిటీలో పెరుగుతాడు. తర్వాత తన గతం తెలుసుకుని తన ఊరికి వస్తాడు. విలన్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుంటాడు. 'ఆదికేశవ' సినిమా గురించి చెప్పకుండా 20 ఏళ్లు వెనక్కి వెళ్లి ఆది.. చెన్నకేశవరెడ్డి.. సాంబ లాంటి సినిమాల్లో అంశాలెందుకు గుర్తు చేయడం ఎందుకు అనిపిస్తోందా..? అవును.. టాలీవుడ్ ఎప్పుడో అరగదీసి పక్కన పెట్టేసిన అదే మూస మాస్ టెంప్లేట్ ను కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు బయటికి తీశాడు మరి. కథ పాతది అయినా నరేషన్లో కొత్తదనంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి అవకాశముంది. కానీ శ్రీకాంత్ రెడ్డి ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఎక్కడా రవ్వంత కొత్తదనం కూడా లేకుండా.. మినిమం ఎమోషన్ లేకుండా ఒక మూస ఫ్యాక్షన్ సినిమా తీశాడు.చదువు పూర్తి చేసుకుని జులాయిగా తిరిగే హీరో.. ఇంకెప్పుడు బాగుపడతావ్ అని తిట్టే తండ్రి.. నా కొడుకు బంగారం అని వెనకేసుకొచ్చే తండ్రి.. పెద్ద కంపెనీ సీఈవో అయినా హీరోను చూసి ఇంప్రెస్ అయిపోయే హీరోయిన్.. ఇలాంటి టెంప్లేట్ క్యారెక్టర్లతో మొదలయ్యే 'ఆదికేశవ'.. సగటు మాస్ కమర్షియల్ సినిమాలకు రెడీగా ఉండమని ఆరంభంలోనే సంకేతాలు ఇచ్చేస్తుంది. హీరోయిన్ ఒక కాస్మొటిక్ కంపెనీకి సీఈవో కాగా.. ఆ కంపెనీ తయారు చేసే ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనల్ని హీరో ఇంటర్వ్యూలో తప్పుబట్టడం.. తెల్లగా కాదు అందంగా చేసే క్రీమ్ అని ప్రమోట్ చేద్దాం అని హీరో చెప్పగానే నీ ఐడియాలజీ సూపర్ అని ఆమె పొగడ్డం.. అంత పెద్ద కంపెనీ అధిపతి అయి ఉండి ఒక మామూలు ఉద్యోగి అయిన హీరో చుట్టూ తిరుగుతూ అతను చేసే ప్రతి పనికీ ఇంప్రెస్ అయిపోయి ప్రేమలో పడిపోవడం.. ఈ వరసంతా చూస్తే ఇంకా ఎన్నిసార్లు ఈ టెంప్లేట్లు చూడాలని అనిపిస్తుంది. ఈ రొటీన్ రొమాంటిక్ ట్రాక్.. సిగరెట్ పాటల తర్వాత కూడా 'ఆదికేశవ'లో మెరుపులేమీ కనిపించవు.
సిటీ నుంచి సీమకు మారాక కథ మరింత రొటీన్ రూట్లోకి వెళ్తుంది. మలయాళంలో ఎన్నో విలక్షణ పాత్రలతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న జోజు జార్జ్ ను ఏరి కోరి ఎంచుకున్నారంటే విలన్ పాత్రలో ఎంతో కొంత విశేషం ఉంటుందని అనుకుంటాం. కానీ అది పరమ రొటీన్ ఫ్యాక్షనిస్టు క్యారెక్టర్. విలన్ ఇష్టానుసారం మైనింగ్ చేసి ఊరిని నాశనం చేస్తుంటే.. హీరో వచ్చి తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడంతో పాటు ఊరినీ కాపాడే ట్రాక్ లో ఏ విశేషం లేదు. ఎంత రొటీన్ స్టోరీ అయినప్పటికీ హీరో-విలన్ పాత్రలను సరిగ్గా ఎలివేట్ చేస్తే కొంత మేర మాస్ ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు. కానీ 'ఆదికేశవ' అలా కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది. గుడిలో విలన్ మనిషిని నిలువునా తగలెట్తేస్తాడు హీరో. మామూలుగా అయితే మాస్ ప్రేక్షకులు ఈ సన్నివేశానికి గూస్ బంప్స్ తెచ్చుకోవాలి. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మోత తప్ప రవ్వంత కూడా ఎమోషన్ లేకుండా ఈ ఎపిసోడ్ ను లాగించేశాడు దర్శకుడు. నిర్మాత అన్నట్లు మనుషుల్ని చంపడంలో ఇందులో రకరకాల కొత్త మార్గాలైతే చూపించారు. అలాగే రౌడీని చంపి ఆ మంటల్లోంచి హీరో సిగరెట్ వెలిగించుకునే 'కొత్త' సీన్ కూడా చూస్తాం ఇందులో. అంతకుమించి బూతద్దం వేసి వెతికినా 'ఆదికేశవ'లో కొత్తదనం కనిపించదు.
నటీనటులు:
వైష్ణవ్ తేజ్ చూడ్డానికి బాగున్నాడు. తన పాత్రేమీ రకరకాల ఎమోషన్లు పలికించే స్కోప్ ఉన్నది కాదు. అయినా వైష్ణవ్ పెర్ఫామెన్స్ మామూలుగా అనిపించింది. కెరీర్లో తొలి అడుగులు వేస్తూ ఇంకా మాస్ ఇమేజ్ తెచ్చుకోని అతడికి.. ఇందులో వీర విధ్వంసం సృష్టించే పాత్ర చాలా బరువుగా అనిపించింది. తనకు నప్పని చొక్కాను తొడుక్కున్న ఫీలింగ్ కలిగింది. రుద్ర అని అతడికి పేరైతే పెట్టారు కానీ.. ఆ పాత్రతో వైష్ణవ్ రౌద్ర రసం పలికించలేకపోయాడు. సాధారణ పాత్రలు కూడా హీరో పెర్ఫామెన్స్ తో ఎలివేట్ అవుతుంటాయి. అలా ఇందులో జరగలేదు. శ్రీలీల చేసిన కథానాయిక పాత్ర సగటు కమర్షియల్ స్టయిల్లో సాగి.. మరీ మొనాటనస్ అనిపిస్తుంది. తన నటన.. అప్పీయరెన్స్ కూడా అందుకు తగ్గట్లే సాగింది. జోజు జార్జ్ మలయాళంలో చేసే పాత్రలకు.. ఇక్కడ చేసిన క్యారెక్టర్ కు అసలు పొంతన లేదు. ఆయన ప్రత్యేకతను చాటే చిన్న అవకాశం కూడా చెంగారెడ్డి పాత్ర ఇవ్వలేదు. సుమన్ రాయలసీమ రాజకీయ నేత పాత్రలో ఓకే అనిపించాడు. తనికెళ్ల భరణి.. రాధిక.. జయప్రకాష్.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక వర్గం:
జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడంటే ఎక్కడో ఒక చోట తన ముద్ర కనిపిస్తుంది. కానీ అలాంటి టచ్ ఎంతమాత్రం లేకుండా సాగిపోయింది తన సంగీతం. పిండికొద్దీ రొట్టె అన్నట్లు అతను మొక్కుబడిగా బండి లాగించేశాడు. పాటలేవీ వినసొంపుగా లేవు. హీరో హీరోయిన్లు డ్యాన్సులు చేసుకోవడానికి మాత్రం కొంచెం స్కోప్ ఇచ్చాడు. నేపథ్య సంగీతం రొటీన్ గా సాగిపోయింది. డడ్లీ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువల్లో ఏమీ రాజీ లేదు. సితార స్థాయికి తగ్గట్లే రిచ్ గా తీశారు. శ్రీకాంత్ రెడ్డి రైటింగ్ నుంచి టేకింగ్ వరకు సగటు కమర్షియల్ సినిమాల టెంప్లేట్ ను ఫాలో అయిపోయాడు. ఈ రోజుల్లో ఒక కొత్త దర్శకుడి నుంచి మరీ ఇలాంటి మూస సినిమాను ఊహించలేం. యాక్షన్ ఘట్టాలు బాగా తీశాడు తప్ప దర్శకుడి పనితనం గురించి చెప్పుకోవడానికేమీ లేదు.
చివరగా: ఆదికేశవ.. శివ శివా
రేటింగ్- 2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater