అంబానీ పెళ్లిపై స్టార్ డైరెక్టర్ కూతురు సంచలన వ్యాఖ్య
అపర కుభేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఆషామాషీనా? నెలల తరబడి ఆ ఇంట పెళ్లి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 11 July 2024 4:24 AM GMTఅపర కుభేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఆషామాషీనా? నెలల తరబడి ఆ ఇంట పెళ్లి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ జంట వివాహం ఇప్పటివరకూ ఏ ఇతర ధనికుడూ చేయలేని శైలిలో అత్యంత విలాసవంతంగా సాగుతోంది. ఇప్పటికి రెండు సార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఇప్పుడు అసలైన పెళ్లి ముంబైలో జరుగుతోంది. ఒకసారి అంబానీల స్వస్థలం జామ్ నగర్- గుజరాత్ లో సొంత వారి కోసం ఏర్పాటు చేసిన విందు.. మరోసారి ప్రపంచ కుభేరులందరినీ ఓ చోటికి చేర్చేందుకు సాగించిన క్రూయిజ్ విందు.. ఇప్పుడు ముంబై లో అసలు సిసలు పెళ్లి విందుకు సమయమాసన్నమైంది. మూడుసార్లు పెళ్లిళ్ల కోసం అంబానీ కుటుంబం 1500 కోట్లు మించి ఖర్చు చేసిందని కథనాలొస్తున్నాయి.
ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ పెళ్లి తంతు ఆషామాషీగా లేదు. ప్రతిసారీ ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్ స్టార్లు సహా అన్ని సినీపరిశ్రమల నుంచి ప్రముఖులను ముఖేష్ అంబానీ కుటుంబం ఆహ్వానిస్తోంది. ఇతర రంగాలకు సంబంధించిన జాబితా పెద్దదే ఉంది. రిపీటెడ్ గా గెస్టులను ఆహ్వానించడం ఇక్కడ కొసమెరుపు. అందరికీ సంబంధిత పీఆర్వోలు ఆహ్వానాలు పంపుతూనే ఉన్నారు. అయితే తనకు ఎన్నిసార్లు ఆహ్వానం అందినా తిరస్కరించిన ఒక ప్రముఖ డైరెక్టర్ కుమార్తె గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. చాలా మంది బాలీవుడ్ స్టార్లు అంబానీల వేడుకలలో కెమెరాల ముందు హొయలు పోయేందుకు తహతహలాడుతుండగా, ఒక అమ్మాయి ఈవెంట్ నుండి దూరంగా ఉండాలని భావించింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ అంబానీల ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ పెళ్లికి తాను హాజరు కాకూడదని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఆత్మగౌరవం కోసం తాను ఇలా చేసినట్టు బహిరంగంగా వెల్లడించింది.
నిజానికి అనంత్ అంబానీ పెళ్లి పెళ్లి కాదు..ఒక `సర్కస్`లాగా మారిందని ఆలియా కామెంట్ చేసారు. ఆలియా తన ఇన్‌స్టాలో వరుస వ్యాఖ్యల్లో ఇలా రాసింది. ``నన్ను కొన్ని ఈవెంట్‌లకు ఆహ్వానించారు. ఎందుకంటే వారు PR చేస్తున్నారు (???? ఎందుకు నన్ను అడగవద్దు) కానీ నేను వద్దు అని చెప్పాను. ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ ఆత్మగౌరవం ఉందని నేను నమ్ముతున్నాను. ఒకరి పెళ్లికి నన్ను అమ్ముకోవడం కంటే గౌరవం ముఖ్యం`` అని నేను నమ్ముతున్నాను అని రాసింది. ప్రస్తుతం ఆలియా వ్యాఖ్యలపై అంతర్జాలంలో బిగ్ డిబేట్ కొనసాగుతోంది. నిజానికి అంబానీల పెళ్లిలో సందడి చేయాలని కలలు కనని స్టార్లు లేరు. ఖాన్ ల త్రయం సహా ఇండస్ట్రీ దిగ్గజాలంతా ఈ పెళ్లిలో ప్రదర్శనలు ఇస్తూ సందడి చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఫాలోయింగ్ ఉన్న పాప్ స్టార్లు ఈ పెళ్లి వేడుకలో ప్రదర్శన కోసం తహతహలాడారు. కోట్లాది రూపాయల ప్యాకేజీలు అందుకున్నారు.