సూపర్‌స్టార్లు కాలగర్భంలో కలిసిపోతారు: అగ్ర హీరో
స్టార్ డమ్‌లో మేటి అనిపించుకున్న ఖాన్‌ల త్రయం చిట్టచివరి హీరోలు అనుకోవచ్చా? అన్న ప్రశ్నకు.. అతడు ఆ ఆలోచనను తప్పు పట్టారు.
By: Tupaki Desk | 24 March 2025 9:32 AM ISTఈ రంగుల ప్రపంచంలో స్టార్లు, సూపర్ స్టార్లు ఎందరో ఉన్నారు. వారి వారసులు సినీపరిశ్రమల్ని ఏల్తున్నారు. అయితే వీరంతా శాశ్వతమా? అంటే... అందుకు అవకాశమే లేదని నిజాయితీగా అంగీకరించారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. స్టార్ డమ్‌లో మేటి అనిపించుకున్న ఖాన్‌ల త్రయం చిట్టచివరి హీరోలు అనుకోవచ్చా? అన్న ప్రశ్నకు.. అతడు ఆ ఆలోచనను తప్పు పట్టారు.
హిందీ చిత్రసీమలో షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ -అమీర్ ఖాన్‌లను `చివరి స్టార్స్` అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి తరంలో వారికి నచ్చే స్టార్లు ఉంటారని, చివరికి వారిని కూడా కాలక్రమేణా మరచిపోతారని అమీర్ ఖాన్ అన్నారు. నేటితరం నటీనటులు 90ల తరం స్టార్‌డమ్‌తో సరిపోలలేరనే భావనను అమీర్ ఖాన్ తోసిపుచ్చారు. ప్రతి తరం అనుభవంతో పరిణామం చెందుతుందని, ఎదుగుతుందని, భవిష్యత్తులో సమానంగా పెద్ద స్టార్‌లు పుట్టుకొస్తారని అన్నారు. స్టార్‌డమ్ వారసత్వం తన యుగానికి మించి కొనసాగుతుందని అమీర్ ఖాన్ బలంగా చెప్పారు. కాలం ముందుకు సాగుతుందని, చివరికి ప్రజలు అందరినీ మరచిపోతారని అమీర్ ఖాన్ లోతుగా విశ్లేషించారు.
ఇది ఒక సృష్టి చక్రం...అని చెబుతూనే విధ్వంసంతో పోల్చారు. కొత్త స్టార్‌లు వచ్చినప్పుడు ప్రతి యుగం మసకబారుతుందని కూడా అమీర్ చెబుతున్నారు. మార్పు అనివార్యం.. ఎవరూ ఎప్పటికీ వెలుగులో ఉండరు.. అని అన్నారు. ఇటీవల తన పుట్టినరోజున ఖాన్ ల త్రయం ఒక సినిమాలో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుకున్నామని .. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ చిత్రం అసాధారణమైనది కాకపోయినా ప్రేక్షకులు ముగ్గురు ఖాన్‌లను కలిసి తెరపై చూడటాన్ని ఇష్టపడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఖాన్ ల త్రయం ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.