సూపర్ స్టార్ ఏడ్చేస్తాడట!
ఆ సినిమాల్లో అమీర్ ఖాన్ నటన బాగున్నా సినిమా కంటెంట్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది.
By: Tupaki Desk | 24 Feb 2025 6:30 PM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌కి సాలిడ్ సక్సెస్ పడి చాలా కాలం అయింది. భారీ అంచనాలు పెట్టుకుని నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, లాల్ సింగ్ చద్దా సినిమాలు అమీర్ ఖాన్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేక పోయాయి. ఆ సినిమాల్లో అమీర్ ఖాన్ నటన బాగున్నా సినిమా కంటెంట్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దంగల్ సినిమా తర్వాత అమీర్ ఖాన్ నుంచి వచ్చిన సినిమాలు తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. దాంతో ఆచితూచి సినిమాల ఎంపిక చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ తన సినిమాల ఫెయిల్యూర్‌పై స్పందించాడు. తాను చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.
అమీర్ ఖాన్ 60 అండ్ నాట్ డన్ - ది స్కీన్ అండ్ స్పాట్‌లైట్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ... నేను చేసిన సినిమాలు ఫెయిల్ అయితే ఎక్కువగా ఫీల్ అవుతాను. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన తెలుసుకుంటాను. నెగటివ్ టాక్ వస్తే రెండు మూడు వారాల పాటు డిప్రెషన్‌కి గురి అవుతాను. సినిమాల ఫలితాన్ని బట్టి కొన్ని సార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కష్టపడి చేసిన సినిమాలు ఫెయిల్ అయితే కచ్చితంగా ఏడుపు వస్తుంది. ఆ సమయంలో నేను కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. సినిమాల ఫలితాలు నటీ నటుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆయన అన్నారు.
సినిమా ఫెయిల్ అయితే రెండు వారాల పాటు డిప్రెషన్‌కి గురి అవుతాను. ఆ తర్వాత తేరుకుని సినిమా కోసం వర్క్ చేసిన వారితో మాట్లాడుతాను. ఎక్కడ తప్పు జరిగింది, ప్రేక్షకులు ఏం కోరుకుంటే ఏం వెళ్లింది. అసలు మన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలను గుర్తించి తదుపరి సినిమా కోసం వర్కౌట్ మొదలు పెడతాను. ఎప్పుడైతే ప్రేక్షకుల మనకు చెప్పేది అర్థం చేసుకుంటామో, సినిమా ఫలితాన్ని బట్టి తదుపరి సినిమా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని తన అనుభవాలను అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.
లాల్ సింగ్ చద్దా వచ్చి చాలా కాలం అయినా ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నుంచి తదుపరి సినిమా రాలేదు. ఆయన కొత్త సినిమా ఏంటి అనేది ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. అభిమానులు ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రెండో భార్యకు విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ వ్యక్తిగతంగా కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. కనుక ఈ ఏడాదిలో ఆయన కొత్త సినిమా ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తుంది. కానీ కచ్చితంగా అమీర్ ఖాన్ పుంజుకుంటారు, ఆయన నుంచి రాబోయే రోజుల్లో 3 ఇడియట్స్, దంగల్ వంటి సినిమాలు వస్తాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.