స్టార్ హీరోపై లెజెండరీ నటి ఫ్యాన్స్ నిప్పులు!
ఇంకా చెప్పాలంటే కళ్లతోనే కోటిభావాలు పలికించే అరుదైన లక్షణం ఏ కొద్ది మంది నటీమణులకో ఉంటుంది.
By: Tupaki Desk | 6 Jan 2025 7:30 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. అభినయనేత్రి శ్రీదేవి నటనాభినయం, ఆహార్యం, నడక నడత, ఫ్యాషన్ సెన్స్ ఇలా ఏ కోణంలో చూసినా తనతో సరిపోలేవారు లేరని అభిమానులు నమ్ముతారు. ఇంకా చెప్పాలంటే కళ్లతోనే కోటిభావాలు పలికించే అరుదైన లక్షణం ఏ కొద్ది మంది నటీమణులకో ఉంటుంది. అలాంటి అరుదైన క్వాలిటీ శ్రీదేవిలో మాత్రమే చూడగలం. క్లాసిక్ మూవీ 'క్షణక్షణం'లో ఆర్జీవీ ఈ లక్షణాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకున్నాడో గుర్తు చేసుకుంటారు అభిమానులు.
అయితే అంత గొప్ప నటితో ఇంకొకరిని పోల్చడం అంటే సాహసం చేసినట్టే. అలాంటి సాహసం చేసి బుక్కయ్యాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. అతడు తన కుమారుడు జునైద్ - శ్రీదేవి కుమార్తె ఖుషీకపూర్ నటించిన లవేయప్ప సినిమాని ప్రమోట్ చేస్తూ చేసిన ఓ వ్యాఖ్య నెటిజనుల్లో హాట్ టాపిగ్గా మారింది. అమీర్ అంత పెద్ద తప్పేం చేసాడు? అంటే.... ఖుషీపూర్ ని లెజెండరీ నటి శ్రీదేవితో పోల్చడమే అతడు చేసిన తప్పు.
'లవేయప్ప' సినిమాలో ఖుషీని చూసినంతసేపు తన తల్లి గారైన శ్రీదేవి గుర్తుకు వచ్చిందని అమీర్ ఖాన్ అన్నాడు. అతడు ఒకవేళ లవేయప్ప సినిమాని పొగిడేసి వదిలేస్తే సరిపోయేది. అనవసరంగా ఖుషీని శ్రీదేవితో పోల్చాడు! అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. శ్రీదేవి అందం, అభినయంతో ఇతరులను పోల్చడం నిజంగానే సాహసం. దానిని అంగీకరించేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్ధంగా ఉండరు. శ్రీదేవి సొంత కూతురే అయినా ఖుషీ కపూర్ ని కూడా అంగీకరించలేని పరిస్థితి. ఖుషీ కపూర్ నటించిన ది ఆర్చీస్ వెబ్ సిరీస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో అంతగా హావభావాలు లేని నటనతో ఖుషీ షాకిచ్చిందని విమర్శించారు. మరోవైపు జునైద్ ఖాన్- ఖుషీ కపూర్ నటించిన 'లవేయప్పా' నుంచి మొదటి సింగిల్ విడుదల కాగా, ఇది తీవ్రమైన విమర్శలను మూటగట్టుకుంది. ఇందులో జునైద్, ఖుషీ ఎక్స్ ప్రెషన్స్ ఎవరికీ నచ్చలేదు. సరికదా.. దగ్గరగా ఆ ఇద్దరినీ చూడటం ఇబ్బందికరం అన్న కామెంట్లు వినిపించాయి. 'లవేయప్పా' చిత్రం తెలుగులో వచ్చిన 'లవ్ టుడే' చిత్రానికి రీమేక్.