ఖాన్‌ల త్రయం భారీ ప్రయోగం
ఖాన్‌లతో గొప్ప సత్సంబంధాలను కొనసాగిస్తున్న టాలీవుడ్ హీరోలు వాళ్లను మించి పాన్ ఇండియాలో హవా సాగిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 8 Dec 2024 7:05 AM GMTఖాన్‌ల త్రయం హవా తగ్గుతోందని కథనాలొస్తున్నాయి. పాన్ ఇండియాలో ఖాన్ లను మించి సౌత్ హీరోలు అదరగొడుతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు బాలీవుడ్‌లోను హవా సాగించడం చర్చనీయాంశంగా మారింది. ఖాన్‌లతో గొప్ప సత్సంబంధాలను కొనసాగిస్తున్న టాలీవుడ్ హీరోలు వాళ్లను మించి పాన్ ఇండియాలో హవా సాగిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అదే సమయంలో ఖాన్‌లు పాన్ ఇండియాపై పట్టు బిగించేందుకు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ముగ్గురు ఖాన్ లలో అమీర్ ఖాన్ కి ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ లో గొప్ప పట్టుంది. భారతదేశం వెలుపలా చైనా, జపాన్ సహా పలు దేశాల్లో అమీర్ కి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ సైతం పాన్ వరల్డ్ లో రాణించేందుకు, సౌత్ మార్కెట్లను కొల్లగొట్టేందుకు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇలాంటి సమయంలో అమీర్ ఖాన్ చేసిన ఓ ప్రకటన ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను సత్కరించారు. అదే సమయంలో మీడియా నుంచి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తెరపై షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్ కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి అమీర్ స్పందిస్తూ.. ముగ్గురు ఖాన్‌లు కలిసి నటించాలనే ఆలోచన గురించి SRK , సల్మాన్‌తో తాను చర్చించినట్లు అమీర్ ధృవీకరించారు. తాము సరైన స్క్రిప్ట్‌ను పొందుతామని ఆశిస్తున్నామని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇది అని అమీర్ వెల్లడించారు. ఆరు నెలల క్రితం షారూక్, సల్మాన్ లతో నేను దీనిపై చర్చించానని కూడా అమీర్ ఖాన్ అన్నారు.
షారూఖ్, సల్మాన్‌లతో కలిసి పనిచేయడం గురించి అమీర్ ఖాన్ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోను ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలోను దీని గురించి మాట్లాడాడు. గతంలో షారూఖ్, సల్మాన్ ని కలిసి మాట్లాడానని అమీర్ అన్నారు. ''ఇన్ని సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నాం. మనం కలిసి పని చేయకపోతే ప్రేక్షకులకు అన్యాయం జరుగుతుంది. కనీసం ఒక్క సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలి'' అని తాము భావించామని తెలిపారు. సరైన స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నామని అన్నారు.
అమీర్ ఖాన్ నటించిన 'అందాజ్ అప్నా అప్నా'లో సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేశారు. షారూఖ్- సల్మాన్ కుచ్ కుచ్ హోతా హై, హమ్ తుమ్హారే హై సనమ్, ట్యూబ్‌లైట్, జీరో, పఠాన్ చిత్రాలలో కలిసి నటించారు. టైగర్ 3లోను కలిసి నటించనున్నారు. టైగర్ Vs పఠాన్‌లోను సల్మాన్ - షారూఖ్ కలిసి కనిపించనున్నారు. తదుపరి అమీర్ ఖాన్- సల్మాన్ ఖాన్- షారూఖ్ ఖాన్ కలిసి నటించే సినిమాకి స్క్రిప్టు అందించేది ఎవరో.. దర్శకత్వం వహించే అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.