పైరసీ కారణంగానే చైనాలో స్టార్!
అయితే ఇలాంటి పైరసీ కారణంగా ఓ నటుడు ఏకంగా చైనా లో సూపర్ స్టార్ అయ్యాడు? అంటే నమ్ముతారా? అవును ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
By: Tupaki Desk | 24 Feb 2025 6:44 AM GMTథియేటర్లో సినిమా రిలీజ్ కి ముందో...రిలీజ్ అయిన తొలి షో అనంతరమో పైరసీ జరిగిందంటే హీరోలు లబోదిబో మంటారు. కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు గగ్గోలు పెడతారు. పైరసీని అరికట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ సినిమాకి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే ఇలాంటి పైరసీ కారణంగా ఓ నటుడు ఏకంగా చైనా లో సూపర్ స్టార్ అయ్యాడు? అంటే నమ్ముతారా? అవును ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
ఆయన ఎవరో కాదు. బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్. ఆయన హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తమిళ్ లో ఈ చిత్రాన్ని శంకర్ రీమేక్ కూడా చేసారు. అక్కడా మంచి విజయం సాధించింది. హిందీలో ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సాధారణంగా అమీర్ ఖాన్ సినిమాలు చైనాలో తప్పకరిలీజ్ అవుతుంటాయి.
అక్కడ అమీర్ ఖాన్ కు మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతీ సినిమా రిలీజ్ చేస్తుంటారు. అయితే '3 ఇడియట్స్' మాత్రం రిలీజ్ కాలేదు. ఇది కాలేజీ స్టోరీ కావడంతో అక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమని రిలీజ్ చేయలేదు. అయితే ఈ సినిమా హిందీ నుంచి చైనాలో పైరసీ అయింది. అక్కడ జనాలు ఈ సినిమాని విపరీతంగా ఆదరించినట్లు అమీర్ ఖాన్ తెలిపారు.
ఈ సినిమా తర్వాత తన స్టార్ డమ్ అక్కడ మరింత పెరిగిందన్నారు. పైరసీ కారణంగా చైనాలో తానో పెద్ద స్టార్ గా అవతరించానన్నారు. దీంతో ఇది విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలా పైరసీ కారణంగా కూడా హీరో అవ్వొచ్చని నిరూపించిన మొట్ట మొదటి వ్యక్తి మీరే సార్ అంటూ దండాలు పెట్టేస్తున్నారు. ఆ తర్వాత అమీర్ నటించిన 'దంగల్' చైనాలోనే 1500 కోట్ల వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.