Begin typing your search above and press return to search.

‘ఆయ్’ మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   15 Aug 2024 11:07 PM GMT
‘ఆయ్’ మూవీ రివ్యూ
X

‘ఆయ్’ మూవీ రివ్యూ


నటీనటులు: నార్నె నితిన్-నయన్ సారిక-రాజ్ కుమార్ కసిరెడ్డి-అంకిత్ కోయ-మైమ్ గోపి-వినోద్ కుమార్ తదితరులు

సంగీతం: రామ్ మిరియాల-అజయ్ అరసాల

నేపథ్య సంగీతం: అజయ్ అరసాల

ఛాయాగ్రహణం: సమీర్ కళ్యాణి

నిర్మాతలు: బన్నీ వాసు-విద్య కొప్పినీడి

దర్శకత్వం: అంజి కె.మణిపుత్ర


‘మ్యాడ్’ మూవీతో సైలెంటుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్. అందులో ముగ్గురు హీరోల్లో ఒకడిగా కనిపించిన నితిన్.. ఇప్పుడు సోలో హీరోగా ‘ఆయ్’ మూవీ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్-2 ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం విశేషం. కొత్త దర్శకుడు అంజి.కె.మణిపుత్ర రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

కార్తీక్ (నార్నె నితిన్) అమలాపురం కుర్రాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే అతను.. కరోనా సమయంలో ఇంటి నుంచే పని చేయడం కోసం తన ఊరికి వచ్చేస్తాడు. అక్కడ ఓవైపు పని చేసుకుంటూనే.. తన చిన్న నాటి స్నేహితులైన సుబ్బు (రాజ్ కుమార్ కసిరెడ్డి).. హరి (అంకిత్ కోయ)లతో కలిసి సరదాగా గడిపేస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత కాలేజీ స్టూడెంట్ అయిన పల్లవి (నయన్ సారిక)తో అతను ప్రేమలో పడతాడు. తర్వత పల్లవి కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఇక పెళ్లే తరువాయి అనుకున్న సమయంలో పల్లవికి వేరే అబ్బాయితో పెళ్లిచూపులు అవుతాయి. ఆ పెళ్లికి పల్లవి కూడా ఓకే చెప్పేయడంతో కార్తీక్ షాకవుతాడు. ఇంతకీ పల్లవి మనసు మారిపోవడానికి కారణమేంటి.. ఆమెను దక్కించుకోవడానికి కార్తీక్ ఏం చేశాడు.. చివరికి వీళ్లిద్దరూ కలిశారా లేదా అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

తెలుగు సినిమాల్లో బహుశా ప్రపంచంలో మరే భాషలోనూ కామెడీ వర్ధిల్లి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఒకే సినిమాలో పది మందికి పైగా కమెడియన్లను పెట్టి నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసిన దర్శకులు చాలామందే ఉన్నారు మన తెలుగు సినిమాలో. జంధ్యాల.. ఈవీవీ సత్యనారాయణ.. రేలంగి నరసింహారాావు లాంటి ముందు తరం దిగ్గజాల వారసత్వాన్ని తర్వాతి దర్శకులు కూడా చాలా ఏళ్ల పాటు బాగానే కొనసాగించారు. కానీ గత దశాబ్ద కాలంలో మాత్రం తెలుగు కామెడీ ప్రమాణాలు పడిపోతూ వస్తున్నాయి. ఓవైపు కామెడీ డైరెక్టర్లు-రైటర్లు ప్రభావం కోల్పోతూ వస్తే.. మరోవైపు జబర్దస్త్ పుణ్యమా అని సినిమా కామెడీ చెల్లని కాసుగా మారిపోయింది. దీంతో కామెడీ స్టైల్ మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ‘డంబ్’.. ‘కేర్ ఫ్రీ’ క్యారెక్టర్లను పెట్టి ‘జాలీ’గా అనిపించే కామెడీ చేయడం ఇప్పుడు ట్రెండుగా మారుతోంది. ‘జాతిరత్నాలు’.. ‘మ్యాడ్’ లాంటి సినిమాలు ఈ కోవకే చెందుతాయి. వాటిలో పాత్రలు చాలా వరకు ఎర్రిమాలోకాల్లా అనిపిస్తాయి. అంతే కాక ప్రపంచం ఏమైపోయినా తమ దారి తమదే అన్నట్లుగా కేర్ ఫ్రీ యాటిట్యూడ్ తో నడిచిపోతుంటాయి. ఓవర్ ఎమోషన్లు.. డ్రామా ఏమీ లేకుండా ఫన్నీ యాటిట్యూడ్ తో నవ్వులు పండిస్తుంటాయి ఈ చిత్రాల్లోని పాత్రలు. ‘ఆయ్’ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. కాకపోతే పైన చెప్పుకున్న చిత్రాలకు భిన్నంగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో.. ఒక పల్లెటూరిలో నడిచే కథ ఇది. రెండు గంటల 20 నిమిషాల నిడివిలో అసలు బోర్ అన్నదే లేకుండా 95 శాతం సినిమాలో నవ్వులు పండిస్తూ.. చివర్లో చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చి మంచి ఫీల్ తో థియేటర్ల నుంచి ప్రేక్షకులను బయటికి పంపిస్తుంది.

‘జాతిరత్నాలు’.. ‘మ్యాడ్’ సినిమాల్లో మాదిరే ముగ్గురు స్నేహితులు కలిసి చేసే అల్లరే ‘ఆయ్’కు ప్రాణం. కాకపోతే ఆ రెండు చిత్రాలతో పోలిస్తే దీన్ని భిన్నంగా నిలిపేది గోదావరి నేపథ్యం. అక్కడి భాష.. యాస.. మనుషుల తీరు మీద దర్శకుడికి మంచి అవగాహనే ఉన్నట్లుంది. అందుకే పాత్రలు చాలా సహజంగా.. వారి మధ్య సంభాషణలు భలే చమత్కారంగా అనిపిస్తాయి. ముగ్గురు కుర్రాళ్ల అల్లరి.. మధ్యలో ఓ అమ్మాయితో హీరో ప్రేమాయణం.. ఈ ప్రేమలో ఓ సమస్య.. దానికి పరిష్కారం.. ఇలా చాలా సింపుల్ లైన్లో నడిచిపోయే సినిమా ఇది. మామూలుగా ప్రేమకు ప్రధానంగా అడ్డొచ్చేది కులం. ఈ సినిమాలోనూ అంతే. అలా అని ఆ టాపిక్ ను దర్శకుడు యమ సీరియస్ గా డీల్ చేసి.. కులం అడ్డుగోడల గురించి క్లాసులేమీ పీకేయలేదు. స్నేహానికి కులం అడ్డు కాదు.. కానీ ప్రేమకు-పెళ్లికి మాత్రం అది అడ్డు కానంతగా సమాజం మారలేదు.. ఎప్పటికీ మారదు కూడా అంటూ కథానాయికతో చాలా వాస్తవికమైన డైలాగ్ చెప్పించాడు దర్శకుడు. అంతే కాక హీరోను తన కులం అనుకుని ప్రేమించి.. అతను వేరే కులం అని తెలుసుకుని.. తనంటే ఇష్టం ఉన్నా సరే తండ్రి ఒప్పుకునే అవకాశం లేదు కాబట్టి.. తేడా వస్తే అతణ్ని చంపించేస్తాడని తెలిసి ఆమె తన ప్రేమను చంపేసుకోవడం కూడా చాలా రియలిస్టిగ్గా కొత్తగా అనిపిస్తుంది. కథల్లో కులం టాపిక్ రాగానే పాత్రలతో ఎక్కడలేని ఆదర్శాలు మాట్లాడించేసి నాటకీయత పెంచేస్తుంటారు దర్శకులు. కానీ ఈ సినిమాలో దర్శకుడు ఆ టాపిక్ ను డీల్ చేసిన విధానం మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అదేంటన్నది తెర మీదే చూడాలి.

ఇక ‘ఆయ్’ మూవీకి మేజర్ హైలైట్ అయిన ముగ్గురు ప్రధాన పాత్రధారుల అల్లరి గురించి మాట్లాడాలి. సినిమాకు హీరో నార్నె నితినే కానీ.. కామెడీలో మాత్రం లీడ్ రోల్ రాజ్ కుమార్ కసిరెడ్డినే. ఇప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో తన ప్రత్యేకతను చాటుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. ‘ఆయ్’లో చెలరేగిపోయాడు. ఐదేళ్ల పాటు ఓ అమ్మాయిని ప్రేమించి.. కొన్ని రోజుల ముందు అదే అమ్మాయికి లైనేయడం మొదలుపెట్టిన తన ఫ్రెండుకి తన లవర్ని త్యాగం చేసే పాత్రలో అతను చేసిన కామెడీ చాన్నాళ్లు గుర్తుండిపోతుంది. కేవలం ఈ ప్రేమ-త్యాగం అనే కాన్సెప్ట్ చుట్టూనే దాదాపు గంట కామెడీ నడుస్తుంది సినిమాలో. కానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టించకుండా ఆ కామెడీని పండించడంలో దర్శకుడి రైటింగ్-టేకింగ్.. గోదావరి స్టైల్లో సాగిన రాజ్ కుమార్ పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్.. మిగతా ఇద్దరు నటుల సహకారం కీలక పాత్ర పోషించాయి. పంచుల మీద పంచులు వేస్తూ.. ఒక జోక్ ను ఎంజాయ్ చేసేలోపే ఇంకోటి వదులుతూ ముగ్గురు మిత్రుల బృందం ప్రేక్షకులను నాన్ స్టాప్ నవ్వుల్లో ముంచెత్తుతుంది. అలా అని సిచువేషన్లు.. సన్నివేశాలు ఏమంత ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఎప్పుడూ చూసే సీన్లే అయినా.. కామెడీ మంచి టైమింగ్ లో సాగిపోవడంతో నవ్వులకు ఢోకా ఉండదు. రొమాంటిక్ ట్రాక్ సైతం సరదాగా.. హాయిగా సాగిపోతుంది. మధ్య మధ్యలో మంచి పాటలు వచ్చిపోతుంటాయి. హీరో లవ్ ఫెయిలయ్యాక కూడా కథను సీరియస్ టోన్లోకి తీసుకెళ్లకుండా లైటర్ వీన్లోనే నడిపించడం ‘ఆయ్’ ప్రత్యేకత. అందుకే ఎక్కడా కామెడీ టెంపో తగ్గలేదు. చివరి 20 నిమిషాల్లో మాత్రమే వ్యవహారం సీరియస్ అవుతుంది. ఆ కొంత టైంలో దర్శకుడు సింపుల్ సీన్లతోనే ఎమోషన్లను కూడా బాగానే పండించాడు. హీరోకూ ఎందుకూ పనికి రాని వాడిలా కనిపించే అతడి తండ్రి.. తన ప్రేమ సమస్యను ఎలా పరిష్కరించాడన్నది చాలా గమ్మత్తుగా అనిపించే విషయం. ఆ గమ్మత్తేంటో తెర మీదే చూడాలి. ఒక్క సన్నివేశంతో హీరో తండ్రి పాత్ర క్లైమాక్సులో హీరోలా రూపాంతరం చెందింది. అల్లరి చిల్లరిగా కనిపించే హీరోయిన్ పాత్రలోని గాఢతను కూడా ఒక్క సన్నివేశంతో భలేగా చూపించాడు దర్శకుడు. మొత్తంగా చాలా వరకు కామెడీగా కథను నడిపించి.. చివర్లో చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చి ‘ఆయ్’ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మలిచాడు దర్శకుడు. ఇదేమీ కొత్త కథ కాదు. గొప్ప కథా కాదు. కానీ ఈ వీకెండ్ సరదాగా నవ్వుకుని కాలక్షేపం చేయడానికి ఏమాత్రం ఢోకా లేని చిత్రం.. ఆయ్.


నటీనటులు:

తన తొలి చిత్రం ‘మ్యాడ్’లో నార్నె నితిన్ చాలా సాధారణంగా.. మూడీగా కనిపించాడు. కానీ ‘ఆయ్’లో మాత్రం హుషారుగా నటించాడు. తన పాత్ర యూత్ కు బాగా రిలేటయ్యేలా డిజైన్ చేయగా.. నితిన్ అందుకు తగ్గట్లుగా నటించాడు. అతను కామెడీని బాగానే పండించగలిగాడు. లుక్స్.. నటనలో ఈజ్ పరంగా నితిన్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది కానీ.. తొలి చిత్రంతో పోలిస్తే మాత్రం చాలా బెటర్ అయ్యాడు. హీరోయిన్ నయన్ సారిక కుర్రాళ్లను కట్టి పడేస్తుంది. ‘గం గం గణేశ’లో చాలా మామూలుగా కనిపించిన ఈ అమ్మాయి.. ‘ఆయ్’లో మాత్రం అదరగొట్టేసింది. ఎక్స్‌ప్రెసివ్ కళ్లు తన ప్రధాన ఆకర్షణ. సారికకు మేకప్ బాగా కుదిరింది. తన చలాకీ నటన.. మేనరిజమ్స్ ఆకట్టుకుంటాయి. ఇప్పటికే కమెడియన్ గా రాజ్ కుమార్ కసిరెడ్డికి మంచి పేరున్నప్పటికీ ఈ సినిమా తన కెరీర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు. అతను ప్రతి సన్నివేశంలోనూ నవ్వుల్లో ముంచెత్తేశాడు. మరో ముఖ్య పాత్రలో నటించిన అంకిత్ కోయ సైతం బాగా చేశాడు.. నవ్వించాడు. హీరోతో కలిసి ఈ ఇద్దరూ చేసిన అల్లరి సినిమాకు మేజర్ హైలైట్. వినోద్ కుమార్.. మైమ్ గోపిల పాత్రల స్క్రీన్ టైం తక్కువే కానీ.. వాటి ఇంపాక్ట్ మాత్రం ఎక్కువే. ముఖ్యంగా వినోద్ కుమార్ క్లైమాక్సులో బాగా హైలైట్ అయ్యాడు. చాన్నాళ్ల తర్వాత ఆయనకు గుర్తుండిపోయే పాత్ర దక్కింది. మిగతా నటీనటులంతా ఓకే.


సాంకేతిక వర్గం:

‘ఆయ్’ సినిమాలో నాలుగు పాటలుంటే రామ్ మిరియాల.. అజయ్ అరసాల సగం సగం పాటల్ని పంచుకున్నారు. ఇద్దరూ హుషారైన పాటలే అందించారు. అజయ్ నేపథ్య సంగీతం కూడా మంచి ఫ్లోలో సాగింది. సినిమా నడతకు తగ్గట్లే బ్యాగ్రౌండ్ స్కోర్లోనూ ఒక చమత్కారం ఉండేలా చూసుకున్నాడు అజయ్. సమీర్ కళ్యాణి ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. గోదావరి పల్లెటూరి ఫ్లేవర్ విజువల్స్ లో కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. కథగా వింటే ఏమంత గొప్పగా అనిపించకపోయినా.. కొత్త దర్శకుడి నరేషన్ మీద నమ్మకం పెట్టి ఇలాంటి సినిమా తీయడంలో నిర్మాతల అభిరుచిని మెచ్చుకోవాలి. ఇక దర్శకుడు అంజి.కె.మణిపుత్రది ప్రామిసింగ్ డెబ్యూ. కామెడీ పండించడం కత్తి మీద సాములా మారిన ఈ రోజుల్లో అతను ఆ పనిని అలవోకగా చేసేశాడు. కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ రానివ్వకుండా క్లారిటీతో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. మూవీలో ఎక్కడా కృత్రిమంగా అనిపించకుండా సహజంగా జోకులు పేలడం.. నవ్వులు పండడం విశేషం. సినిమా మొత్తంలో ఓ పావు గంట మినహా ఫన్నే ఉంటుంది. దాన్ని ఎంత బాగా డీల్ చేశాడో.. ఆ పావు గంట ఎమోషన్లను కూడా అంతే బాగా వర్కవుట్ చేశాడు అంజి.


చివరగా: ఆయ్.. మంచి ఎంటర్టైనరండీ

రేటింగ్ - 3/5