ఎన్టీఆర్ బామ్మర్ది.. 'ఆయ్' అండి!
ఇప్పటికే అతను సీతార ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చిన మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు.
By: Tupaki Desk | 4 March 2024 8:12 AM GMTఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ కెరీర్ మొదట్లోనే కొన్ని డిఫరెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొదట్లో అతను స్టార్ట్ చేసిన ఒక రెండు మూడు సినిమాలు చర్చల దశలోనే వాయిదా పడ్డప్పటికీ ఇప్పుడు సెట్ చేస్తున్న సినిమాలు మాత్రం వెంటవెంటనే విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అతను సీతార ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చిన మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు.
ఇక అతడి నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాను గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ టైటిల్ ను చాలా ఫన్నీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఫన్నీ మీమ్స్ ను కూడా టైటిల్ తో పాటు హైలెట్ చేయడం విశేషం.
అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్రమోషన్ వీడియోలో నిర్మాత బన్నీ వాసు టైటిల్ గురించి దర్శకుడిని అడుగగా 'ఆయ్' అంటూ సరదాగా సమాధానం ఇస్తాడు. దీంతో టైటిల్ చెప్పకుండా ఆయ్ అంటారేంటి అని నిర్మాత మళ్లీ హీరో హీరోయిన్ కి కూడా ఫోన్ కనెక్ట్ చేయగా అప్పుడు దర్శకుడు అదే తరహా సమాధానం ఇస్తాడు. ఇక అందరూ కన్ఫ్యూజ్ అవ్వగా హీరోయిన్ క్యూట్ గా అడగడంతో ఆయ్ అనేదే అసలు టైటిల్ అని దర్శకుడు చెబుతాడు.
గోదావరి లో బాగా పాపులర్ అయిన లోకల్ వర్డ్ ఆయ్ గురించి తెలుగు వారికి ఇప్పటికే చాలా సినిమాలలో రుచి చూపించారు. ఎంతో సరదాగా ఉండే ఈ పదాన్ని టైటిల్ గా ఎంచుకోవడం నిర్మాత మెచ్చుకోవడం వంటి అంశాలు ఈ ప్రమోషన్ వీడియోలో హైలెట్ గా నిలిచాయి. నితిన్ కు జోడిగా సారిక నయన్ నటిస్తోంది.
ఇక GA2 పిక్చర్స్ లో రూపొందుతున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకులు కాగా బన్నీ వాసు, విద్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చేశారు. ఇక సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేయగా రామ్ మిరియాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా నార్నే నితిన్ కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.