గాయకుడిని బెదిరించిన గ్యాంగ్‌స్టర్ అబూసలేం
పరిశ్రమలో ప్రముఖ గాయనీగాయకులతో స్టార్ల సంబంధాలు ఎంతో గొప్పవి. అలాంటి గొప్ప సత్సంబంధాలను కలిగి ఉన్నాడు పాపులర్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య.
By: Tupaki Desk | 23 Dec 2024 2:45 AM GMTపరిశ్రమలో ప్రముఖ గాయనీగాయకులతో స్టార్ల సంబంధాలు ఎంతో గొప్పవి. అలాంటి గొప్ప సత్సంబంధాలను కలిగి ఉన్నాడు పాపులర్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి ప్రముఖులకు అతడు అత్యంత సన్నిహితుడు. కానీ వారితో అతడికి వివాదాలున్నాయి. సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వంపై అతడు చాలా సార్లు తూట్లు పొడిచేలా మాట్లాడాడు. ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే షారూఖ్ ఖాన్ తో దాదాపు 17 ఏళ్లుగా మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్. కింగ్ ఖాన్ కోసం ఎన్నో చార్ట్ బస్టర్ పాటలు పాడిన అభిజీత్ ఇన్నేళ్ల పాటు అతడికి దూరంగా ఉండిపోవడానికి కారణం తమను ఎవరూ కలపలేదని, మిస్ కమ్యూనికేషన్ కారణమని తాజా పాడ్ కాస్ట్ లో వెల్లడించాడు.
అంతేకాదు ఇదే పాడ్ కాస్ట్ లో తనను గ్యాంగ్ స్టర్ అబూసలేం ఆ రోజుల్లో బెదిరించారని, 60 లక్షల డబ్బు డిమాండ్ చేసాడని కూడా అభిజీత్ గుర్తు చేసుకున్నాడు. నాటి బెదిరింపులకు తాను చాలా భయపడ్డానని, అంతకుముందే అబూసలేం గ్యాంగ్ ఇద్దరు వ్యక్తులను చంపేయడంతో తనకు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందానని తెలిపాడు. అంతేకాదు.. గ్యాంగ్ స్టర్ అనుచరుడు తనకు కాల్ చేసి ఒక ఈవెంట్ కోసం పాట పాడాలని అడిగాడని కూడా తెలిపాడు. తాను బాత్రూమ్ కి వెళ్లి పాడానని, కానీ తన భార్యకు అది నచ్చలేదని కూడా వెల్లడించాడు.
గ్యాంగ్ స్టర్ అబూసలేం కుమార్ సాను వంటి ఇతర ప్రముఖ గాయకుల ఫోన్ నంబర్‌లను కూడా అడిగారని .. తనను తాను ఠాకూర్ అని పేర్కొన్నాడని కూడా గుర్తు చేసుకున్నారు. షారూఖ్ తో 17ఏళ్ల గ్యాప్ గురించి ప్రస్థావిస్తూ.. ఖాన్ సమకాలికుల్లో కొందరు తనను వెనక నుంచి అవమానించారని తెలిపాడు. వారంతా తనతో రాజీకి వచ్చినా కానీ ఖాన్ తనను పూర్తిగా విస్మరించాడని తెలిపాడు. అయితే ఖాన్ పిలిస్తే తాను పాడేవాడిని అని కూడా అన్నాడు. తమను ఎవరూ కలిపేందుకు ప్రయత్నించలేదని వ్యాఖ్యానించాడు. తమ మధ్య క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, తమ వృత్తిపరమైన సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి షారూఖ్ తనను సంప్రదించి ఉండవచ్చని ఆయన అన్నారు. ``మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్.. మా గొంతులు భార్యాభర్తల లాంటివి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినట్లే ఎవరైనా సరిపెట్టుకోవాలి``అని SRKతో తిరిగి పని చేయాలనే తన కోరికను వ్యక్తపరిచాడు. ఖాన్ వెనక ఉండే వ్యక్తులు కొందరు తనను `హక్లా` అని కామెంట్ చేసినట్టు వెల్లడించాడు.
పాడ్ కాస్ట్ లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాపిక్ రాగానే అభిజీత్ తన కాలర్‌ని సర్దుకుంటూ చిరునవ్వుతో మాట్లాడాడు. సల్మాన్ తో తనకు శత్రుత్వం ఉన్నందున అతడు అలా కాలర్ ఎగురవేసాడు. అభిజీత్ ఇద్దరు ఖాన్‌లను బహిరంగంగా పోల్చాడు. పోలికల్లో సల్మాన్ ను తక్కువ చేసి మాట్లాడాడు. సల్మాన్ భారతీయ ప్రతిభను పెంచడం కంటే శత్రు దేశాల కళాకారులకు మద్దతు ఇస్తున్నాడని గత ఇంటర్వ్యూలలో అభిజీత్ ఆరోపించారు. పరిశ్రమలో సల్మాన్ చర్యలపై అభిజీత్ తరచుగా తన అసహ్యం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు.