ఐశ్వర్యారాయ్ - అభిషేక్ విడిపోలేదు.. ప్రూఫ్ ఇదే!
అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ జంట విడిపోతున్నారంటూ ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Oct 2024 8:32 AM GMTఅభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ జంట విడిపోతున్నారంటూ ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లను అభిషేక్ కానీ, ఐశ్వర్యరాయ్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ జంట కలిసే ఉన్నా విడిపోయి విడిగా జీవిస్తున్నారని హిందీ మీడియా ఊహాగానాలను ప్రచారం చేస్తోంది. అయితే ఈ విడాకుల పుకార్ల మధ్య, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ నడుమ అనుబంధంలో ఎలాంటి సమస్యా లేదని నిరూపించేందుకు చాలా ఆధారాలు లభిస్తున్నాయి.
ముఖ్యంగా ఇన్ స్టాలో ఐశ్వర్యారాయ్ ని అనుసరిస్తున్న ఏకైక వ్యక్తి అభిషేక్ బచ్చన్ మాత్రమే. ఐశ్వర్యారాయ్- ఆరాధ్య విషయంలో అతడు ఎప్పుడూ తన ప్రేమాభిమానాలను దాచుకోవడం లేదు. కానీ అందుకు విరుద్ధంగా మీడియాలో ప్రచారం సాగడం దురదృష్టకరంగా ఆ కుటుంబం భావిస్తోంది.
తాజాగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్‌ను ఐశ్వర్యతో 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఈ అందమైన ప్రయాణం ఎలా అనిపించింది? అని ప్రశ్నించారు. దానికి అభిషేక్ స్పందిస్తూ, ``నా భార్య అసాధారణమైనది. ఆమె నాకు గొప్ప భావోద్వేగ మద్దతుదారుగా ఉంది`` అని తెలిపాడు. పరిశ్రమ నుండి భాగస్వామిని కలిగి ఉండటం ఎంత గొప్ప ప్రయోజనమో కూడా అభిషేక్ వివరించాడు. ``ఐశ్వర్య నా కంటే ఎక్కువ కాలం నటనారంగంలో ఉంది కాబట్టి ఆమె ప్రతిదీ అర్థం చేసుకుంది. నేను కష్టతరమైన రోజును ఎదుర్కొని ఇంటికి వచ్చినప్పుడు, నాకు ఎలాంటి మద్దతు కావాలో.. ఎలాంటి స్పేస్ అవసరమో ఆమెకు తెలుసు`` అని భార్యపై ప్రేమను కనబరిచాడు.
ప్రతికూలతను ఎదుర్కోవడంలో ఐశ్వర్య విధానం గురించి మాట్లాడుతూ .. ప్రతికూలతను తనపై ఆధిపత్యం చెలాయించడానికి తన భార్య అనుమతించదని పేర్కొన్నాడు. అతడు తన భార్య నుండి చాలా విలువైన పాఠాలు నేర్చుకున్నానని, ప్రతికూలతను విస్మరించమనే ఆమె సలహా చాలా సహాయకారిగా ఉందని పేర్కొన్నాడు. ప్రతికూల వ్యాఖ్యపై దృష్టి పెట్టవద్దని, వేలాది సానుకూల వ్యాఖ్యలపై దృష్టి పెట్టాలని ఆమె నాకు చెప్పింది. నా దృక్పథానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే భాగస్వామిని కలిగి ఉండటం నా అదృష్టం``అన్నారాయన.
అభిషేక్ తన `దాస్వీ` సహనటి నిమ్రత్ కౌర్‌తో రిలేషన్‌లో ఉన్నారని ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఇది ఐశ్వర్యకు తెలిసిందని కొందరు ప్రచారం చేసారు. కానీ వీటికి ఆధారాలేవీ లేవు. అనంత్ అంబానీ వివాహానికి ఐశ్వర్యారాయ్ విడిగా అటెండవ్వడంతో వారి మధ్య అనుబంధం గురించి రూమర్లు పుట్టుకొచ్చాయి. పెళ్లిలో బచ్చన్ కుటుంబం మొత్తం కలిసి కనిపించినా.. ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్యతో మాత్రమే వేడుక వద్దకు రావడం అనుమానాలకు తావిచ్చింది. కానీ ఆ తర్వాత ఆ కుటుంబం అంతా కలిసి కనిపించారు.