సూపర్‌స్టార్ కుమారుడికి SBI నుంచి 18లక్షల జీతం
అతడు ఒక సూపర్‌స్టార్ కుమారుడు. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ నటనా కెరీర్ లో బిజీగా ఉన్నాడు.
By: Tupaki Desk | 27 Jan 2025 11:30 PM GMTఅతడు ఒక సూపర్‌స్టార్ కుమారుడు. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ నటనా కెరీర్ లో బిజీగా ఉన్నాడు. నటుడిగా ఆశించిన స్టార్ డమ్ చిక్కకపోయినా, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పొదుపు, పెట్టుబడి పరిజ్ఞానం ఇప్పుడు అతడి ఆస్తుల విలువను అమాంతం పెంచుతోంది. రియల్ ఎస్టేట్ లో వందల కోట్ల నికర ఆస్తులు ఇప్పుడు అతడికి ఉన్నాయి. తండ్రితో కలిసి భారీగా రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతూ అనూహ్యమైన లాభాలార్జిస్తున్నాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి కాకుండా అతడు ఒక బిజినెస్ మేన్ గా వ్యవహరిస్తూ, సినిమాల్లో నటిస్తూ సంపాదించిన నికర ఆస్తి విలువ సుమారు 280 కోట్లుగా ఉందని నివేదికలు అందాయి. అతడు ఎవరు? అంటే మరెవరో కాదు.. లెజెండరీ అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్.
రియల్ ఎస్టేట్ లో పెట్టినది, అపార్ట్ మెంట్లు, భవంతులపై పెట్టిన పెట్టుబడి ఊరికే వృధా పోదు. బచ్చన్ తెలివైన పెట్టుబడుల కారణంగా.. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నెలకు రూ. 18,00,000 జీతం అందుతోంది. ఇదెలా సాధ్యం? స్టేట్ బ్యాంక్ అతడికి ఉద్యోగం ఏదైనా ఇచ్చిందా? అంటే అలాంటిదేమీ లేదు. అభిషేక్ బచ్చన్ తన విలాసవంతమైన జుహు బంగ్లా, `అమ్ము అండ్ వాట్స్` బంగ్లాలోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ స్థలాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చారు. ఇది బచ్చన్ కుటుంబానికి భారీ అద్దె ఆదాయాన్ని అందిస్తోంది.
జాప్ కీ వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరిందని అప్ డేట్ చేసిన పత్రాలు వెల్లడించాయి. వాటి ప్రకారం.. ప్రస్తుతం బ్యాంకు నుండి నెలవారీ అద్దె రూ. 18.9 లక్షలు అందుకుంటున్నారు. ఏడాదికి 2 కోట్లు పైగా అద్దె రూపంలో అందుతోంది. లీజులో కాలానుగుణ అద్దె పెంపుదలకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. అద్దె ఐదు సంవత్సరాల తర్వాత రూ. 23.6 లక్షలకు పెరుగుతుంది. పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ముంబై సహా నగర ఔటర్ లోను తండ్రి కొడుకులకు పలుచోట్ల అపార్ట్ మెంట్లు ఉన్నాయి. వీటన్నిటికీ వారు అద్దెలు అందుకుంటున్నారు. కొన్నిటిని రీసేల్ చేయడం ద్వారా భారీ లాభాలార్జిస్తున్నారు. ఇటీవలే ఒక డూప్లెక్స్ ను 31 కోట్లకు కొని, కేవలం నాలుగేళ్లలో 83కోట్లకు అమ్మారు అమితాబ్. 50 కోట్ల లాభం కళ్లజూసారు.