సడెన్ గా మాయమైన హీరో.. కట్ చేస్తే విదేశాల్లో కార్ మెకానిక్!
ప్రేమదేశం- చెలి లాంటి చిత్రాల్లో అబ్బాస్ నటన ఈజ్ గురించి ఇప్పటికీ అభిమానులు చర్చిస్తారు.
By: Tupaki Desk | 18 July 2023 5:45 PM GMTప్రేమదేశం- చెలి లాంటి చిత్రాల్లో అబ్బాస్ నటన ఈజ్ గురించి ఇప్పటికీ అభిమానులు చర్చిస్తారు. లవర్ బోయ్ గా ఇప్పటికీ అతడిని అభిమానించే వారున్నారు. తమిళ పరిశ్రమలో హీరోగా కెరీర్ ప్రారంభించి అటుపై టాలీవుడ్ లోను పాపులరైన అబ్బాస్ దశాబ్ధం క్రితం సినీరంగం విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయారు. అతడు నటనకు పూర్తిగా స్వస్తి పలికారు. ఇంతకీ అతడు నటరంగాన్ని వదిలేసి ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్లిపోయాడు? అంటే.. అబ్బాస్ స్వయంగా దానికి జవావిచ్చారు.
అబ్బాస్ పదేళ్ల క్రితమే తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ కి వెళ్లి సెటిలయ్యారు. అక్కడ అతడు ట్యాక్సీ మెకానిక్ గా డ్రైవర్ గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు. అయితే ఉన్నట్టుండి అబ్బాస్ అంత పెద్ద హీరో ఇలా ట్యాక్సీ డ్రైవర్ గా మారాడా? అంటూ అభిమానులంతా సందిగ్ధంలో పడ్బారు. ఒకానొక సమయంలో తనకు సిగరెట్లు కొనుక్కునేందుకు ఇంటి అద్దె చెల్లించేందుకు కూడా డబ్బులు లేని తీవ్రమైన క్రైసిస్ లో పడిపోయానని అందుకే విదేశాలకు వెళ్లి ట్యాక్సీ డ్రైవర్ గా మారానని కూడా అబ్బాస్ నిర్మొహమాటంగా ఓపెనయ్యాడు.
చాలా గ్యాప్ తర్వాత అతడు తిరిగి ఇండియాకి వచ్చాడు. వచ్చీ రాగానే తనపై సోషల్ మీడియాల్లో సాగుతున్న తప్పుడు ప్రచారం గురించి ప్రస్థావించాడు. తాను దివాళా తీసానని.. మెంటల్ ఆస్పత్రిలో చేరానని.. చనిపోయానని కూడా ప్రచారం చేస్తున్నారని అబ్బాస్ ఆవేదన చెందాడు. దీనికి క్లారిటీ ఇచ్చేందుకు ఇప్పుడు భారతదేశానికి వచ్చానని కూడా అబ్బాస్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇదే ఇంటర్వ్యూలో అబ్బాస్ యుక్తవయసులో ఆత్మహత్య ఆలోచనలతో పోరాటం గురించి ప్రస్థావించాడు. ఒకసారి ఒక వాహనానికి ఎదురుగా వెళ్లేందుకు ప్రయత్నించానని అదే సమయంలో ఒక వాహనదారుడు తన ఎదుటి నుంచి ఎటువంటి చింతా లేకుండా వెళుతుంటే అది చూసి తనలో పరివర్తన వచ్చిందని తెలిపాడు. అందుకే ఆత్మహత్య ఆలోచన ఉన్నవారిని కౌన్సిలింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని అబ్బాస్ తెలిపాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం పదో తరగతి ఫెయిలవ్వడమేనని కానీ ఆ వయసులో అలా ఆలోచించానని వెల్లడించాడు. కెరీర్ ప్రారంభంలో విజయాలు సాధించినా కాల క్రమంలో ఫ్లాపులు ఎదురవ్వడంతో కెరీర్ పరంగా రేసులో వెనకబడిపోయానని చివరికి నటనపై విసుగు చెంది విదేశాలకు వెళ్లిపోయానని అబ్బాస్ వెల్లడించాడు. కుటుంబాన్ని పోషించడానికి బైక్ మెకానిక్ గా పని చేసానని న్యూజిలాండ్‌లో టాక్సీలు నడిపానని కూడా తెలిపాడు. అలాగే తాను నటుడవ్వాలనుకోలేదని ప్రేమదేశం తర్వాత ప్రజల అభిమానం చూసి నటనలో కొనసాగానని కూడా వెల్లడించాడు. అబ్బాస్ వాలకం చూస్తుంటే తిరిగి అతడు నటనా రంగంలోకి రావాలనుకుంటున్నాడని కూడా అర్థమవుతోంది.