గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ రాహుల్ గాంధీ?
సరిగ్గా ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ లారెన్స్ బిస్నోయ్ గ్యాంగ్‌కు తదుపరి లక్ష్యంగా ఉండవచ్చని ఒడియా నటుడు, నాయకుడు అయిన బుద్ధాదిత్య మొహంతి సోషల్ మీడియాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 20 Oct 2024 5:51 AM GMTదావూద్ ఇబ్రహీం కంటే ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్‌ని ఇప్పుడు ముంబై ఎదుర్కొంటోంది. మహానగరంలో సెలబ్రిటీలు అతడి పేరు వింటేనే ఒణికిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. పోలీసులు అతడిని ఆపేందుకు చేయని ప్రయత్నం లేదు. అధికారులు అనుక్షణం టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. సల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన ఆ గ్యాంగ్ స్టర్ ఇటీవలే సల్మాన్ స్నేహితుడైన ఎన్సీపీ నాయకుడు సిద్ధిఖ్‌ని హతమార్చడంతో అది ముంబైని ఒణికించింది. ముంబై మీడియాతో పాటు, ఇటీవల భారతదేశంలోని అన్ని పత్రికలు మీడియాలు పదే పదే స్మరిస్తున్న ఏకైక పేరు 'గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్'.
అయితే ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖ్ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అంటూ ముంబై పోలీసులు కంటిమీద కునుకు లేకుండా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ లారెన్స్ బిస్నోయ్ గ్యాంగ్‌కు తదుపరి లక్ష్యంగా ఉండవచ్చని ఒడియా నటుడు, నాయకుడు అయిన బుద్ధాదిత్య మొహంతి సోషల్ మీడియాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే ప్రతిపక్ష నేతపై ఉద్వేగభరితమైన ప్రకటన ఇది అంటూ బుద్ధాదిత్య మొహంతిపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. NSUI ఒడిశా యూనిట్ ప్రెసిడెంట్ ఉదిత్ ప్రధాన్ భువనేశ్వర్‌లోని క్యాపిటల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బుద్దాదిత్య మొహంతి ఆ పోస్ట్‌ను తొలగించి క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు.
NSUI వెల్లడించిన వివరాల ప్రకారం... ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిక్‌ను చంపిన తర్వాత, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తదుపరి లక్ష్యం కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ అని మొహంతి అన్నారు. ఈ ప్రకటన చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. NSUI దీనిని ఖండిస్తూ ఈ పోస్ట్‌ను సహించరానిది అని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారని కూడా ఎన్.ఎస్.యు.ఐ ఆధారాలు చూపించింది. అయితే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న తర్వాత మొహంతి వివాదాస్పద పోస్ట్‌ను తొలగించి తాను చేసిన పనికి విచారం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని అవమానించడానికి లేదా హాని చేయడానికి ఉద్దేశించి తాను ఈ పోస్ట్ చేయలేదని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను అయినా గాయపరిచినట్లయితే క్షమాపణలు కోరుతున్నానని మొహంతీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడిని ఏ విధంగానూ లక్ష్యంగా చేసుకునేందుకు ఈ పని చేయలేదని మొహంతి పేర్కొన్నారు.