Begin typing your search above and press return to search.

సూర్య తో డిఫ‌రెన్సెస్...కానీ స్నేహం మాత్రం అలాగే!

అయితే కోలీవుడ్ స్టార్ సూర్య అలాంటి విజ‌యాలు ఇచ్చిన ఓ ముగ్గురు ద‌ర్శ‌కుల్ని మాత్రం రిపీట్ చేయ‌లేదు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 5:53 AM GMT
సూర్య తో డిఫ‌రెన్సెస్...కానీ స్నేహం మాత్రం అలాగే!
X

ఏ సినిమా ఇండ‌స్ట్రీలోనైనా హిట్ కాంబినేష‌న్స్ రిపీట్ అవ్వ‌డం అన్న‌ది స‌హ‌జం. ద‌ర్శ‌క‌-హీరోలు దాన్నో సెంటిమెంట్ గానూ భావిస్తుంటారు. హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ కి హీరోలు డేట్లు కేటాయించ‌డంలో ఏ మాత్రం అల‌స‌త్వం ప్ర‌దర్శించారు. మ‌రో హిట్ ఆ డైరెక్ట‌ర్ తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతుంటారు. అందుకే హిట్ కాంబినేష‌న్స్ అన్న‌వి ఎక్కువ‌గా రిపీట్ అవుతుంటాయి. అయితే కోలీవుడ్ స్టార్ సూర్య అలాంటి విజ‌యాలు ఇచ్చిన ఓ ముగ్గురు ద‌ర్శ‌కుల్ని మాత్రం రిపీట్ చేయ‌లేదు.

బాల ద‌ర్శ‌క‌త్వంలో సూర్య `శివ పుత్రుడు` సినిమా కోసం క‌లిసి ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. ఆసినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా సూర్యని మ‌రో మెట్టు పైకి ఎక్కించిన చిత్రం. అందులో విక్ర‌మ్ మెయిన్ లీడ్ పోషించినా సూర్య పాత్ర‌కు అంతే పేరొచ్చింది. కానీ ఆ త‌ర్వాత బాల‌తో మ‌ళ్లీ సినిమా చేయ‌లేదు. దీంతో ఎన్నో సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఓ స్టోరీ విషయంలో ఇద్ద‌రి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ సూర్య‌తో మాత్రం క‌చ్చితంగా సినిమా చేస్తాన‌ని బాలా చాలా సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. సూర్య కూడా అంతే పాజిటివ్ గా మాట్లాడారు. ఇద్ద‌రు ఇండ‌స్ట్రీలో మంచి స్నేహితులుగానూ పేరుంది. అలాగే సూర్య‌- వెట్రీమార‌న్ కాంబినేష‌న్ లో అప్ప‌ట్లో జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో `వాడివాస‌ల్` అనే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కొంత పార్ట్ షూటింగ్ జ‌రిపారు. ఈ చిత్రాన్ని సూర్య త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా కూడా ప్ర‌క‌టించారు.

అయితే ఈ ప్రాజెక్ట్ అర్దంత‌రంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ర‌ద్ద‌వ్వ‌డానికి కార‌ణాలు ఏంటి అన్న‌ది ఇంత వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. అటుపై వెట్రీ మార‌న్ సూర్య 45 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు. వెట్రీమార‌న్ స్థానంలో వేర్వేరు ద‌ర్శ‌కుల వ‌చ్చారు త‌ప్ప మార‌న్ చిత్రాన్ని మాత్రం ప‌ట్టాలెక్కించ‌లేదు. అలాగ‌ని ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి డిఫ‌రెన్స్ రాలేదు. చేస్తాం కొంచెం స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పుకొస్తున్నారు.

అలాగే `ఆకాశం నీ హ‌ద్దురా` లాంటి గొప్ప విజ‌యాన్ని సుధ కొంగ‌ర, సూర్య‌కి అందించారు. ఏకంగా ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వ‌చ్చింది. దీంతో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మరో సినిమా ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. కానీ క్రియేటివ్ డిఫ‌రెన్స్ కార‌ణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అలాగ‌ని సుధ కి సూర్య దూర‌మ‌వ్వ‌లేదు. మంచి స్క్రిప్ట్ కుదిరితే క‌లిసి ప‌నిచేయాల‌ని చూస్తున్నారు. ఇలా సూర్య అనుకున్న ప్రాజెక్ట్ లు ఆగిపోవ‌డం ఆస‌క్తిక‌రం.