నిర్మాతలంతా ఏపీ వైపే చూస్తున్నారు!
ఇటీవలే `కల్కి 2898` సినిమా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
By: Tupaki Desk | 20 July 2024 7:08 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇండస్ట్రీలో ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం పరిశ్రమకి అన్నిరకాలుగా అనుకూలంగా ఉంటుందని ధీమా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే పరిశ్రమ నుంచి వచ్చిన ప్రపోజల్ ని ప్రభుత్వం కాదనలేదు.
ఇటీవలే `కల్కి 2898` సినిమా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇంకా భవిష్యత్ లో మరిన్ని ప్రోత్సాహకాలు పరిశ్రమకి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇండస్ట్రీ పక్షపాతి కాబట్టి ఆ విషయంలో సందేహ పడే పనిలేదు. చాలా కాలంగా నంది అవార్డులు కూడా నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం వాటిని కూడా ఏర్పాటు చేస్తుందని ఇండస్ట్రీ పెద్దలు విశ్వశిస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో 100 ఎకరాల్లో ఫిల్మ్ స్టూడియోలకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు సుమన్ ఏపీ ప్రభుత్వానికి తన విన్నపం వినిపించారు. పరిశ్రమ అభివృద్ది కోసం చిన్న సెట్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిన్నటి రోజున సచివాలయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, విరాంజనేయ స్వామి, గోట్టిపాటి రవికుమార్ లను సుమన్ కలిసారు.
ఏపీలో చిన్న సినిమాల చిత్రీకరణకు మరింత స్వేచ్ఛ కావాలని, అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలని కోరారు. లొకేషన్ల విషయంలో ఎలాంటి నియంత్రణలు ఉండకుండా చూడాలి. పరిషన్లు సులభతరం చేయాలి. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కి వ్యయం ఎక్కువ అవుతుంది. దీంతో నిర్మాతలంతా ఏపీవైపే చూస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.