జాతీయ అవార్డులను చెత్తబుట్టలో వేస్తానన్నాడు!
అవార్డు వస్తే అది స్ఫూర్తినిస్తుంది. నటుడిగా లేదా కళాకారుడిగా మునుముందు మరింత బాధ్యతగా నడుచుకునేందుకు ఇది నిజమైన స్ఫూర్తి.
By: Tupaki Desk | 3 Sep 2023 7:23 AM GMTఅవార్డు వస్తే అది స్ఫూర్తినిస్తుంది. నటుడిగా లేదా కళాకారుడిగా మునుముందు మరింత బాధ్యతగా నడుచుకునేందుకు ఇది నిజమైన స్ఫూర్తి. కానీ అవార్డులను ఆ నటుడు చెత్తబుట్టలో వేస్తానని వ్యాఖ్యానించాడు. ఇలా వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యం కాదా? ఇంతకీ అవార్డులను చెత్త బుట్టలో వేస్తానన్న నటుడు ఎవరు? అంటే.. వివరాల్లోకి వెళ్లాలి.
తనకు అవార్డులపై నమ్మకం లేదని, అవార్డులు వస్తే చెత్తబుట్టలో పడేస్తానని నిర్మొహమాటంగా తేల్చేశాడు హీరో విశాల్. ఆయన కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన `మార్క్ ఆంటోని` చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. జాతీయ అవార్డులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు.
``నాకు అవార్డులపై నమ్మకం లేదు. ప్రజలంతా కలిసి అందజేసేదే నిజమైన అవార్డు. ప్రేక్షకుల ఆశీస్సులతో ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడి సినిమాల్లో నటిస్తున్నాను. నిజానికి అదే నాకు పెద్ద అవార్డు. నేను నటించిన సినిమాలకు అవార్డులు వచ్చినా వాటిని చెత్తబుట్టలో వేస్తాను`` అని అవార్డులపై ప్రశ్నకు స్పందించారు.
తన రాజకీయ రంగ ప్రవేశంపైనా విశాల్ స్పందించారు. ``జీవితంలో ఏదైనా జరగవచ్చు. ఒకప్పుడు నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాధారవి నన్ను సంఘంలో చేరాలని చాలాసార్లు కోరారు. ఆ తర్వాత చేరాను. కొంతకాలంగా అదే సంఘంలో ఎన్నికల్లో పోటీ చేసి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. అదేవిధంగా భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు. మన చేతిలో లేనిది ఏమిటి?`` అని కూడా అన్నారు.
69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఆలియా భట్- కృతి సనోన్ తమ అత్యుత్తమ ప్రదర్శనకుగాను ఉత్తమ నటీమణులుగా జాతీయ అవార్డును పంచుకున్నారు. ఈ పురస్కారాల్లో ఆర్.ఆర్.ఆర్ కి ఏకంగా 10 అవార్డులు దక్కగా, గంగూభాయి కథియావాడీ, ఉప్పెన చిత్రాలకు అవార్డులు దక్కాయి. ముఖ్యంగా కోలీవుడ్ టాప్ హీరో మాధవన్.ఆర్ తెరకెక్కించిన రాకెట్రీ చిత్రానికి జాతీయ ఉత్తమ సినిమా అవార్డు దక్కింది. అయితే జాతీయ అవార్డుల గురించి స్పందించమని కోరగా.. తాను అవార్డులను చెత్తబుట్టలో వేస్తానని అనడం ఇప్పుడు నెటిజనుల్లో చర్చగా మారింది.