బాయ్‌కాట్ ట్రెండ్.. సాయి పల్లవి స్పందన ఏంటంటే?
'బాయ్‌కాట్ సాయిపల్లవి' అంటూ ఎక్స్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదానికి కారణం ఆమె గతంలో ఇండియన్ ఆర్మీపై చేసిన కామెంట్స్ అని తెలుస్తోంది
By: Tupaki Desk | 29 Oct 2024 11:05 AM GMTసహజమైన నటనతో, డ్యాన్స్ లతో తెలుగు యువ హృదయాలను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఈ దీపావళికి ''అమరన్'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ఆమె శివ కార్తీకేయన్ కు జోడీగా నటించింది. ఈ చిత్రం అక్టోబర్ 31న తమిళంతో పాటుగా తెలుగులోనూ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి టైములో సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా సాయిపల్లవి మీద నెగెటివ్ పోస్టులు కనిపిస్తున్నారు. 'బాయ్‌కాట్ సాయిపల్లవి' అంటూ ఎక్స్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదానికి కారణం ఆమె గతంలో ఇండియన్ ఆర్మీపై చేసిన కామెంట్స్ అని తెలుస్తోంది.
'విరాటపర్వం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో భారత ఆర్మీని ఉద్దేశించి సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘పాకిస్థాన్‌లో ఉండే జనాలు మన మన ఆర్మీ వాళ్ళని టెర్రరిస్ట్ లుగా అనుకుంటారు. ఎందుకంటే మనం వాళ్లకు హాని చేస్తామని. మనం పాకిస్థాన్ సైన్యాన్ని టెర్రరిస్టుల్లాగా భావిస్తాం. ఇలా దృక్పధాలు మారుతుంటాయి. నాకు ఆ వైలెన్స్ ఎందుకో అర్థం కాదు’’ అని చెప్పింది. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున దుమారం రేగింది. సాయి పల్లవిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 2022 నాటి వీడియోని మళ్ళీ ఇప్పుడు బయటకు తీసి ట్రోల్ చేస్తున్నారు.
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ''అమరన్'' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా.. ఆయన భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించింది. అయితే దేశ భక్తి ప్రధానంగా సాగే ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామాలో, మేజర్ భార్యగా సాయి పల్లవి నటించడంపై ఓ వర్గం నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఓల్డ్ వీడియోని షేర్ చేస్తూ, భారత సైన్యాన్ని అవమానించే విధంగా మాట్లాడిన ఆమె చిత్రాలను బాయ్ కాట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. అలానే 'అమరన్' ట్రైలర్ లో ''ఒక దేశ స్వాతంత్ర సమరయోధుడు ఇంకో దేశానికి టెర్రరిస్ట్'' అని పేర్కొనడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సాయి పల్లవి దీనిపై స్పందిస్తూ తనకు ఏ వర్గాన్ని అవమానించాలనే ఉద్దేశం లేదని తెలిపింది. ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసి వైరల్ చేయడం బాధను కలిగించిందని చెప్పింది. నిజానికి 'విరాటపర్వం' సినిమా నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానంగానే, తాను వైలెన్స్ ను ఇష్టపడనని సాయి పల్లవి ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ''సినిమాలో నక్సలైట్ యూనిఫామ్ వేసుకున్నారు కదా. వారిపై ఏమైనా సింపతీ కలిగిందా?'' అని యాంకర్ ప్రశ్నించగా.. ''హింస అనేది రాంగ్ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని నమ్ముతా. నక్సలిజం తప్పా ఒప్పా అన్నది చేప్పే స్థితిలో నేను లేను. పాకిస్తాన్‌లో ఉన్నవాళ్లు మన జవాన్లను టెర్రరిస్టులు అనుకుంటారు. ఎందుకంటే, మనం వాళ్లకు హాని చేస్తామని భావిస్తారు. అలాగే, మన వాళ్లకు అవతలి వారు టెర్రరిస్టుల్లా కనిపిస్తారు. చూసే కోణాన్ని బట్టి దృక్పథం మారిపోతుంది. వైలెన్స్ అనేది నాకు అర్థం కాదు. కాబట్టి ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది మనం చెప్పలేం'' అని సాయి పల్లవి చెప్పింది.
'అమరన్' విడుదల నేపథ్యంలో సాయి పల్లవి 2022లో మాట్లాడిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే రెండేళ్ల క్రితంనాటి పాత వీడియోని తీసుకొచ్చి, ఇప్పుడు కావాలనే ఇలా నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీపావళికి విడుదల కాబోతున్న ఇతర సినిమాలకు క్రేజ్ రావడం లేదనే ఇలా బ్యాడ్ చేసేందుకు ట్రై చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ కు వెళ్లి దేశం కోసం ప్రాణాలు విడిచిన భారత సైనికులకు సాయి పల్లవి నివాళులు అర్పించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాబట్టి సాయి పల్లవిపై ఇలాంటి విమర్శలు తగదని అంటున్నారు.