Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ల‌కు ఇలియానా హెచ్చ‌రిక‌

తాజాగా ఓ చాటింగ్ సెష‌న్ లో ఇలియానా త‌న‌ విరామం గురించి, తాను కష్టకాలంలో ఉన్న సమయంలో తనకు ల‌భించిన 'దో ఔర్ దో ప్యార్' చిత్రం గురించి చాలా విష‌యాలు మాట్లాడింది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 6:37 AM GMT
డైరెక్ట‌ర్ల‌కు ఇలియానా హెచ్చ‌రిక‌
X

కొన్ని సంవత్సరాల విరామం తర్వాత 'దో ఔర్ దో ప్యార్'తో ఇలియానా డిక్రూజ్ తెరపైకి తిరిగి వచ్చింది. హిందీ, తెలుగు ప‌రిశ్ర‌మ‌ల్లో ఓ వెలుగు వెలిగిన ఇలియానా త‌న‌కు బిడ్డ పుట్టిన త‌ర్వాత సినిమాలు త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల‌ తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడానికి కొంత విరామం తీసుకున్నారు ఇలియానా. గ‌త సంవత్సరం మాతృత్వాన్ని స్వీకరించిన ఇలియానా త‌న ప్రియుడి గురించి బ‌హిరంగంగా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ చాటింగ్ సెష‌న్ లో ఇలియానా త‌న‌ విరామం గురించి, తాను కష్టకాలంలో ఉన్న సమయంలో తనకు ల‌భించిన 'దో ఔర్ దో ప్యార్' చిత్రం గురించి చాలా విష‌యాలు మాట్లాడింది.

చాలా కాలం పాటు విరామం తీసుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అని ప్ర‌శ్నించ‌గా.. ఇంత ఎక్కువ గ్యాప్ తీసుకోవ‌డం... స్క్రీన్‌పై ఎక్కువ కాలం కనిపించకపోవడం అనేది ఎప్పుడూ కావాల‌ని కోరుకున్న‌ది కాదు. సహజంగానే వీలైనంత ఎక్కువ పని చేయాలనుకుంటాం. కానీ మంచి అవ‌కాశాలు కావాల‌నుకుంటాం. అలాంటి ఒక అవ‌కాశం 2020లో కుదిరింది. నా సినిమా 'తేరా క్యా హోగా లవ్లీ' విడుదలై బావున్నా కానీ కోవిడ్ వ‌ల్ల న‌ష్ట‌పోయింది. 'దో ఔర్ దో ప్యార్' కూడా 2021 కోవిడ్ స‌మ‌యంలో చిత్రీకరణ‌లో ఉంది. కానీ అది ఇప్పుడు విడుదలైంది. అప్ప‌టి మంచి సినిమా ఇప్పుడు వ‌చ్చింది అంతే.. అని ఇలియానా తెలిపింది. కోవిడ్ గ్యాప్ వ‌ల్ల త‌న‌కు విరామం వ‌చ్చిన‌ట్టుగా క‌నిపించింద‌ని ఇల్లీ అభిప్రాయ‌ప‌డింది.

నేను 2022లో ఒక వెబ్ సిరీస్‌లోను న‌టించాను. గత సంవత్సరం నేను గర్భవతిని గ‌నుక‌ విరామం తీసుకున్నాను. ఆపై నాకు బిడ్డ పుట్టింది... అని గ్యాప్ గురించి మాట్లాడింది. నేను ప్రస్తుతం నా బిడ్డతో ఉండటమే మేలు అని అనుకుంటున్నాను. ప్ర‌స్తుతం రిలీజ‌వుతున్న నా సినిమాల‌ను మెచ్చుకుంటున్నందుకు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు అని ఇలియానా తెలిపింది. త‌న జీవిత భాగ‌స్వామి గురించి మాట్లాడుతూ.. నేను నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు నా భాగస్వామితో అన్ని విషయాలు మాట్లాడాలనుకుంటాను. నేను ఒక‌ రోజులో జరిగిన ప్రతి దాని గురించి మాట్లాడాలనుకుంటాను. ప్రతి ఒక్కరి గురించి నాకు తెలియదు.. కానీ నేను నా భాగస్వామిలో అలా కోరుకుంటున్నాను. నేను ప్రతిదీ త‌నతో షేర్ చేసుకోవాలి.. అని ఇలియానా అంది.

విరామం మీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌లేదా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా...అలాంటిదేమీ లేద‌ని తెలిపింది. మంచి క‌థ‌లు పాత్ర‌లు ఉన్న వాటినే ఎంపిక చేసుకుంటున్నాన‌ని .. నా సినిమాలు ఆల‌స్యంగా రిలీజైనా రీఫ్రెషింగ్ గా ఉంటాయ‌ని వెల్ల‌డించింది. నేను ఎప్పుడు సినిమాని ఎంచుకున్నా, ఆ పాత్రను ఎలా పోషించబోతున్నానో తెలియక అందులోకి ప్రవేశిస్తాను. నేను న‌ట‌న అనే అనుభూతిని ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే నేను ఈత కొట్టడం ఎలాగో తెలియక నీటిలోకి దూకినట్లు అనిపిస్తుంది. నేను ఎప్ప‌టికీ నేర్చుకోవాలనుకుంటున్నాను. సినిమాలను ఎన్నుకునేటప్పుడు ప్రాథమికంగా నా ఆలోచన అంతా అదే.

అలాగే ఈ ఇంట‌ర్వ్యూలో స‌న్న‌జాజి ఇలియానా న‌డుముపైనే డైరెక్ట‌ర్లు ఎందుకు ఫోక‌స్ చేసారు? అనే ప్ర‌శ్న వ‌చ్చింది. దానికి స‌మాధానంగా ఇలియానా ఏమ‌న్నారంటే..! చాలా మంది ద‌ర్శ‌కుల ఫోక‌స్ ఎందుకనో ప్రధానంగా నా నడుముపైనే ఉంది. వారు నా న‌డుమును హైలైట్ చేసి చూపించారు.... కానీ ఆ తర్వాత నేను కొంద‌రిని హెచ్చ‌రించాను.. నా శ‌రీరంలో మరో పార్ట్ లేనట్లుగా దర్శకులు అందరూ నడుముపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలా? ఇక‌పై అది ఆపేయండి అని వార్నింగ్ ఇచ్చిన‌ట్టు ఇలియానా తెలిపింది. ఆ త‌ర్వాత ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింద‌ని కూడా వెల్ల‌డించింది. దో ఔర్ దో ప్యార్ లో ఇలియానా బ్యాలెన్సింగ్ పెర్ఫామెన్స్ కి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.