సన్యాసిని అవ్వడానికి నటన వదిలేసింది
ఈ అందమైన అసాధారణ ప్రతిభావంతులైన నటీమణులందరితో పోటీపడిన ధీటైన ప్రతిభావంతురాలుగా బర్ఖా మదన్ పేరు పాపులరైంది.
By: Tupaki Desk | 7 Feb 2024 4:47 AM GMT90వ దశకంలో ఎందరో ప్రతిభావంతమైన హీరోయిన్లు పుట్టుకొచ్చారు. ముఖ్యంగా హిందీ చిత్రసీమలో వీరంతా గొప్ప వెలుగులు విరజిమ్మారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, సుస్మితా సేన్, దివ్య భారతి, పూజా బాత్రా, నగ్మా, సీమా బిస్వాస్, నందితా దాస్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా 90వ దశకంలో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రతిభావంతులైన నటీమణులు. ఈ అందమైన అసాధారణ ప్రతిభావంతులైన నటీమణులందరితో పోటీపడిన ధీటైన ప్రతిభావంతురాలుగా బర్ఖా మదన్ పేరు పాపులరైంది. సదరు నటీమణికి ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు దక్కింది.
కెరీర్ ఆరంగేట్రమే ప్రఖ్యాత దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన యువహీరోయిన్ బర్ఖా మదన్. ఆమె అందం ప్రతిభ మతులు చెడగొట్టేది. ముఖ్యంగా తనలోని అరుదైన నటప్రతిభ అందమైన ముఖాల గుంపులో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. 90వ దశకంలో చలనచిత్ర పరిశ్రమలో ఇతర నటీమణులతో పోటీపడుతూ గొప్ప పేరు తెచ్చుకోవడం కేక్‌వాక్ కాదు. కానీ ఈ బ్యూటీ తాను అనుకున్నది సాధించుకుంది. ఇతరుల కంటే గొప్ప ప్రతిభావని అన్న పేరు తెచ్చుకుంది. అయితే సదరు నటీమణి కెరీర్ కీలక మలుపు తిరిగే సమయంలో అనూహ్యంగా సన్యాసినిగా మారి ప్రపంచానికి, తన అభిమానులకు పెద్ద షాకిచ్చింది. ప్రస్తుతం తనను 'నన్ గ్యాల్టెన్ సామ్‌టెన్'గా పిలుస్తున్నారు. బర్ఖా మదన్ ఇంటి గుమ్మం వద్దకు వచ్చిన ఎన్నో అద్భుత అవకాశాలను కాదనుకుని నన్ అయ్యారు.
బాలీవుడ్‌లో నటిగా బర్ఖా మదన్ 'ఖిలాడియోన్ కా ఖిలాడి'తో బ్లాక్‌బస్టర్ అరంగేట్రం నుండి భూత్‌లో మంజీత్ ఖోస్లా పాత్రను పోషించడం వరకు అసాధారణమైన ప్రజ్ఞను కనబరిచారు. 1996 సంవత్సరం బర్ఖా మదన్ బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, రవీనా టాండన్, రేఖ లాంటి ప్రముఖ తారలతో కలిసి ఖిలాడియోన్ కా ఖిలాడి చిత్రంతో తన నటనను ప్రారంభించింది. బర్ఖా ఈ చిత్రంలో 'జేన్' అనే పాత్రను పోషించింది. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన 5వ చిత్రంగా నిలిచింది. సినిమాలో కథానాయికగా నటించనప్పటికీ, బుల్లితెరపైనా నటిగా ప్రభావం చూపడంలో విజయం సాధించింది. అయితే సినీ పరిశ్రమలో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా ఆరేళ్లపాటు ఆమె మరో కీలకమైన మలుపునిచ్చే పాత్రను దక్కించుకోలేకపోయింది.
బర్ఖా మదన్ ఒక బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించిన తర్వత బాలీవుడ్‌లో కథానాయికగా అవకాశం పొందడానికి చాలా సమయం పట్టింది. కానీ అద్భుతమైన తన నటనా నైపుణ్యంపై తన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఫలితంగా విమర్శకుల ప్రశంసలు పొందిన ఆర్జీవీ చిత్రం 'భూత్'లో పనిచేసే అవకాశం వచ్చింది. బర్ఖా ఈ చిత్రంలో మంజీత్ ఖోస్లా అనే దెయ్యంగా కీలక పాత్రను పోషించింది. ఈ పాత్రలో తన నటన చాలా మంది ప్రఖ్యాత చిత్రనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఖిలాడియోన్ కా ఖిలాడి, భూత్ కాకుండా సమయ్: వెన్ టైమ్ స్ట్రైక్స్, సోచ్ లో, సుర్ఖాబ్ సహా మరెన్నో చిత్రాలలో బర్ఖా మదన్ నటించారు. అలాగే చాలా సంవత్సరాలు టెలివిజన్ పరిశ్రమలో కూడా పనిచేసింది. 1857 క్రాంతి, ఘర్ ఏక్ సప్నా, సాత్ ఫేరే - సలోని కా సఫర్, న్యాయ్ వంటి ప్రఖ్యాత టెలివిజన్ షోలకు బర్ఖా పని చేసింది.