Begin typing your search above and press return to search.

ఆ మూవీని మిస్ చేసుకోవటం మిల్కీ బ్యూటీకి ఇప్పటికీ బాధేనట

By:  Tupaki Desk   |   13 Aug 2023 4:30 PM GMT
ఆ మూవీని మిస్ చేసుకోవటం మిల్కీ బ్యూటీకి ఇప్పటికీ బాధేనట
X

క్యాలెండర్లో ఏళ్లు గడిచిపోతున్నా.. తరగని గ్లామర్ తో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టే అందం మిల్కీ బ్యూటీ సొంతం. వెండితెర మీద పద్దతిగా ఉండే ఈ అమ్మడు.. ఈ మధ్యన ఓటీటీలో చెలరేగిపోవటం.. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు వార్తలు రావటంతో ఇంతకాలం తెలిసిన తమన్నా సరికొత్తగా మారింది అందరికి. తాజాగా యూ నువు కావాలయ్యా పాటతో సోషల్ మీడియాను ఊపేస్తున్న తమన్నా.. చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అయిన రజనీకాంత్ తో కలిసి స్టెప్పులేసే అవకాశాన్ని ఇన్నాళ్లకు సొంతం చేసుకుంది.

రజనీకాంత్ సినిమాల్ని చూస్తూ పెరిగిన తనకు.. ఆయనతో సినిమాలు చేయాలని అనుకున్నా ఇప్పటివరకు సాధ్యం కాలేదన్న వెలితి ఉండేదని చెప్పేది. కనీసం ఆయన్ను కలిసి కాసేపు మాట్లాడితే చాలు అనుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ.. అదీ సాధ్యం కాలేదని చెప్పిన ఆమె.. ఇప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే.. జైలర్ మూవీలో ఆయనతో కలిసి పని చేసే ఛాన్స్ రావటం.. కలిసి స్టెప్పులు వేసే లక్ ను తాను సొంతం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మిల్కీ బ్యూటీ.

అయితే.. తన కెరీర్ లో తీసుకున్న నిర్ణయాల్లో ఒక్క విషయంలో మాత్రం తాను ఎప్పుడూ బాధ పడతానని చెబుతున్న ఆమె.. ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా చూసిన ప్రతిసారీ బాధ పడతాను. ఎందుకంటే.. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. హీరోయిన్ గా నాకే మొదట అవకాశం ఇచ్చారు. అప్పట్లో చేతినిండా సినిమాలు ఉండటంతో ఓకే చెప్పలేకపోయా. సినిమా చూసిన తర్వాత మాత్రం ఏదోలా టైం కుదుర్చుకొని ఉంటే బాగుండేదనిపిస్తుంది. అందుకే ఆ సినిమా మిస్ అయ్యానన్న బాధ ఎప్పటికి ఉండిపోతుంది’ అని చెప్పుకొచ్చింది.

అనుక్షణం ఉత్కంఠ రేపే నావెల్స్ అంటే ఇష్టమని.. వాటిని చదవటం మొదలు పెడితే పూర్తి అయ్యే వరకు వదలకుండా ఉండటం అలవాటని.. ఇప్పుడు ఆ స్థానాన్ని వెబ్ సిరీస్ లు భర్తీ చేస్తున్నాయని.. అలాంటి వెబ్ సిరీస్ లను తాను చూస్తున్నట్లు చెప్పింది. తన తండ్రికి జ్యుయెలరీ షాపులు ఉన్నా.. వాటిని వేసుకోవటం ఇష్టం ఉండదన్న తమన్నా.. యాడ్స్ కోసం మాత్రం రకరకాల జ్యువెలరీని వేసుకోక తప్పట్లేదంటూ నవ్వేస్తారు.