ఆస్కార్ విన్నింగ్ RRR గొప్ప సినిమా కాదు అనేశాడు
అలాగే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి RRR గురించి, నాటు నాటుకు ఆస్కార్ రావడం గురించి ఆదిల్ హుస్సేన్ విమర్శనాత్మకంగా మాట్లాడారు.
By: Tupaki Desk | 23 Sep 2024 4:30 PM GMTకబీర్ సింగ్, ఇంగ్లీష్ వింగ్లీష్, లూటేరా సహా పలు చిత్రాలలో నటించి పాపులరైన అస్సామీ నటుడు ఆదిల్ హుస్సేన్ ముక్కుసూటిగా కుండబద్ధలు కొట్టి మరీ మాట్లాడతారు. తన మాటలను ఎప్పుడూ తగ్గించకుండా, భయానికి తలవొంచక, నిజాయితీగా అభిప్రాయాలను చెబుతారు. కొన్ని నెలల క్రితం అతడు `కబీర్ సింగ్` చేసినందుకు చింతిస్తున్నానని చెప్పి హెడ్ లైన్స్ లోకి చేరాడు. ఈ వ్యాఖ్య దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కోపం తెప్పించింది.
అలాగే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి RRR గురించి, నాటు నాటుకు ఆస్కార్ రావడం గురించి ఆదిల్ హుస్సేన్ విమర్శనాత్మకంగా మాట్లాడారు. నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందున ప్రపంచ స్థాయికి చేరుకున్నామా? అని ప్రశ్నించగా, రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం గొప్ప సినిమా అయినప్పటికీ వినోదం కేటగిరీ చిత్రంగా చెప్పవచ్చు అని అన్నారు. ``అస్సామీ సినిమా అప్పటికే ఆస్కార్ ల వరకూ వెళ్ళింది. ఇది RRR తరహా చిత్రం కానవసరం లేదు. నేను ఆర్‌ఆర్‌ఆర్‌ని గొప్ప చిత్రంగా పరిగణించను. ఇది వినోదాత్మక చిత్రం. అలాగే ఆస్కార్ వచ్చిందనేది మర్చిపోవద్దు... ఇది మీరు ఆడాల్సిన గేమ్. వారు సాధారణంగా మంచి చిత్రాల కోసం వెళతారు.. కానీ గొప్పది కానవసరం లేదు. RRR లాంటి సినిమాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయి... నాకు చాలా తెలుసు... కానీ అది గొప్ప సినిమా కాదు. నేను RRR కంటే విలేజ్ రాక్‌స్టార్‌ను ఇష్టపడతాను! అని ఒక పోడ్‌కాస్ట్‌లో కామెంట్ చేసారు.
రెడ్డిట్‌లో ఈ క్లిప్ వైరల్ అయిన వెంటనే చాలా మంది నెటిజనులు తమ ఆలోచనలను ఈ వేదికపై షేర్ చేసారు. దీనిని వినోదాత్మక చిత్రం అని పిలవడం సరైనది అని చాలా మంది ప్రజలు అంగీకరిస్తారు.. అని ఒక నెటిజన్ రాసారు. ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధించడానికి గొప్ప చిత్రం కానవసరం లేదు. ఆర్‌ఆర్‌ఆర్ కంటే మెరుగైన చిత్రాలకు ఆస్కార్‌లో తక్కువ ప్రాధాన్యత లభించింది. నాటు నాటు కంటే మెరుగైన పాటలు పాశ్చాత్య గుర్తింపు పొందడంలో విఫలమయ్యాయి! అని మరొక నెటిజన్ అన్నారు.