బాలయ్య ఇప్పటికైనా దానిపై దృష్టి పెడితే బెటర్
ఆ సినిమా వచ్చిన 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆదిత్య 369 ఏప్రిల్ 4న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కాబోతుంది.
By: Tupaki Desk | 31 March 2025 6:30 AMఇండియన్ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన గొప్ప సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 కూడా ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శక్వంలో వచ్చిన ఈ సినిమా 1991లో రిలీజై సినిమాలోని కంటెంట్ తో ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరించింది. 1991 వరకు ఇండియన్ సినిమాలో వచ్చిన మొదటి టైమ్ ట్రావెల్ ఫిల్మ్ అదే.
ఆ సినిమా వచ్చిన 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆదిత్య 369 ఏప్రిల్ 4న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రీరిలీజ్ కోసం గత ఐదారేళ్లుగా ట్రై చేస్తుంటే అది ఇప్పటికి కుదిరింది. సినిమాకు సంబంధించిన నెగిటివ్ ఫిల్మ్ లేకపోవడంతో మూవీని 4కె లోకి కన్వర్ట్ చేయడానికి కుదరలేదని, ఆఖరికి ఎంతో ప్రయత్నించి పాజిటివ్ ఫిల్మ్ నుంచే సినిమాను 4కె లోకి మార్చి రీరిలీజ్ కు రెడీ చేశారు.
రీరిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి అందులో కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కొన్ని అద్భుతమైన షాట్స్ తో పాటూ, చరిత్రకు సంబంధించిన విషయాలను చూపించారు. శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య నటన, గతాన్ని, ఫ్యూచర్ ను మిక్స్ చేస్తూ సింగీతం చేసిన మ్యాజిక్ వీటన్నింటినీ మించి ఇళయరాజా మ్యూజిక్ ఆదిత్య 369ను ఇప్పటికీ క్లాసిక్ గా నిలబెట్టాయి.
ఇదిలా ఉంటే ఆదిత్య 369కు సీక్వెల్ గా సినిమా చేస్తానని బాలయ్య ఎప్పట్నుంచో అంటున్న సంగతి తెలిసిందే. ఆ సీక్వెల్‌కు ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి స్వయంగా తానే దర్శకత్వం వహిస్తానని కూడా చెప్పారు బాలయ్య. ఒక్క రాత్రిలోనే దానికి సంబంధించిన కథ పూర్తైందని, కథ చాలా బాగా వచ్చిందని, ఎప్పుడెప్పుడు సినిమాను మొదలుపెడదామా అని ఆతృతగా ఉందని బాలయ్య అంటున్నారు తప్పించి ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పడం లేదు.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఆదిత్య 369 సీక్వెల్ ను తెరకెక్కించడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ కథ రెడీగా ఉంది కదా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లమని తమ హీరోని ఫ్యాన్స్ కోరుతున్నారు. ముందుగా ఈ సీక్వెల్ ను బాలయ్య తన కొడుకుతో చేయాలనుకున్నారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. మళ్లీ తానే తీస్తానన్నారు. ఇప్పుడు దాని గురించి కూడా అప్డేట్ లేదు. ప్రస్తుతం సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో పాటూ ఇప్పుడు సినిమా రీరిలీజవుతోంది. కాబట్టి ఈ టైమ్ లో ఆదిత్య 999 మ్యాక్స్ అనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్తే సినిమాకు మంచి క్రేజ్ రావడం ఖాయం.