బ్రేకప్ తర్వాత నిర్వేదంలో యంగ్ హీరో
తన ప్రియురాలు అనన్య పాండే నుంచి విడిపోయిన తర్వాత అతడు పూర్తిగా ప్రైవసీని కోరుకుంటున్నాడట.
By: Tupaki Desk | 3 Jun 2024 4:00 AM GMTప్రేమ ఎంత మధురం! ప్రియురాలు అంత కఠినం!! అని మనసు కవి ఆత్రేయ ఎంత అందంగా రాసారు. ఆయన లేరు కానీ, నేడు ఈ జంటల బ్రేకప్ గురించి తెలుసుకుని ఉంటే ఇంకా ఎంత ఘాడమైన పదాలతో కవితలు అల్లేవారో..!!
ఇప్పుడు అలాంటి ఆవేదనలోనే ఉన్నాడు ఆదిత్యా రాయ్ కపూర్. తన ప్రియురాలు అనన్య పాండే నుంచి విడిపోయిన తర్వాత అతడు పూర్తిగా ప్రైవసీని కోరుకుంటున్నాడట. ఎప్పుడూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉండిపోతున్నాడట. నిజానికి అనన్యతో ప్రేమాయణం సాగిస్తున్నా కానీ ఆ విషయాన్ని ఏనాడూ మీడియా ముందు అంగీకరించేందుకు సిద్ధంగా లేని ఆదిత్య ప్రతిదీ ప్రయివేట్ గా ఉండాలనే అనుకున్నాడు. కానీ దానిని మీడియా ఎప్పుడూ రచ్చకెక్కించింది.
ప్రియురాలి వల్ల అతడి వ్యక్తిగత జీవితం చాలా కాలం పాటు చర్చల్లోకొచ్చింది. ఇటీవల ఆదిత్య- అనన్య బ్రేకప్ పుకార్ల నడుమ ఇటలీలో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగుకి హాజరయ్యారు. ఇప్పుడు మీడియా ముందు తన వ్యక్తిగత జీవితం గురించి ఆదిత్య రాయ్ కపూర్ మాట్లాడాడు. లైఫ్ స్టైల్ ఆసియా ఇండియాతో మాట్లాడుతూ..``నా వ్యక్తిగత జీవితం గురించి నేను ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉన్నానని భావిస్తున్నాను. నేను ఇష్టపడే మార్గం అదే. నా వ్యక్తిగత జీవితం గురించి మీరు ఎందుకు అంతగా తెలుసుకోవాలనుకుంటున్నారో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను`` అని అన్నాడు. నేను ఇలా ఉన్నాను.. ఎందుకు మిమ్మల్ని అనుమతించాలి? నాకు అవసరం లేని చెత్తను ప్రాసెస్ చేయడానికి నేను ఎందుకు సమయం గడపాలి? ఇది నాకు సహకరించదు. ఇది ఒక ఆటలా మారింది. ఇక్కడ ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెబుతారు. అభిప్రాయాలను కలిగి ఉండటం అవసరం. కానీ చొరబాటు సరికాదు`` అని కొంత సీరియస్ గానే అన్నాడు.
ఈ ఏడాది మార్చిలో ఆదిత్య- అనన్య జంట విడిపోయారు. ఈ బ్రేకప్ అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఇద్దరూ ఇప్పుడు ఒకరికొకరు స్నేహంగా ఉన్నారు. అనన్య ఇకపై కెరీర్ పరంగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది. ప్రస్తుతానికి తన పెట్స్ తో అనన్య ఎక్కువ సమయం గడుపుతోంది. ఆదిత్య కూడా సినిమాలతో బిజీ అవుతున్నాడు.