కరోనా తర్వాత 2.10 కోట్ల మంది థియేటర్లలోకి?
దేశవ్యాప్తంగా థియేటర్లలోకి 2.10 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రవేశించారు. చిత్ర పరిశ్రమ 100 ఏళ్ల చరిత్రలో వారాంతపు అద్భుత వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి.
By: Tupaki Desk | 15 Aug 2023 2:30 AM GMTకరోనా పాండమిక్ తర్వాత సినిమా రంగం నెమ్మదిగా కోలుకుంది. ఇప్పటికి థియేటర్లన్నీ జనంతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆగస్టు సీజన్ సినిమాలకు బాగా కలిసొచ్చిందనేది ట్రేడ్ రిపోర్ట్.
రజనీకాంత్, సన్నీ డియోల్, చిరంజీవి, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ .. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సంయుక్త ప్రయత్నాలతో ఈ వారాంతంలో భారతీయ బాక్సాఫీస్ తిరిగి పుంజుకుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా -మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటనలో ఆగస్టు 11 నుండి 13 వరకు 'బిజీయెస్ట్ సింగిల్ వీకెండ్' పోస్ట్-పాండమిక్ అని ప్రకటించింది. దేశవ్యాప్తంగా థియేటర్లలోకి 2.10 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రవేశించారు. చిత్ర పరిశ్రమ 100 ఏళ్ల చరిత్రలో వారాంతపు అద్భుత వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి.
జైలర్-గదర్ 2-OMG 2-భోలా శంకర్-రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ-ఓపెన్‌హైమర్ వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లతో బిజినెస్ ని పెంచడంలో సహాయపడ్డాయి. రజనీకాంత్ జైలర్ తన 4-రోజుల వారాంతంలో రూ.162 కోట్ల ఆల్-ఇండియా గ్రాస్‌ని ఆర్జించింది. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవ సెలవుతో మరో పెద్ద బూస్ట్ కోసం సిద్ధమవుతోంది. సన్నీ డియోల్ 'గదర్' విడుదలైన 3 రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా రాబట్టగలిగింది.
అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం 2 రోజుల్లో 80 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా మాస్ థియేటర్లకు తరలి రావడం ఈవసూళ్లకు కారణం. రాబోయే సెలవుదినంతో పాటు జైలర్ ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా. A రేటింగ్‌ను పొందిన అక్షయ్ కుమార్ OMG 2 మొదటి వారాంతంలో రూ. 39 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా ప్రారంభమైంది. కానీ మంచి సమీక్షలు గొప్ప నోటి మాటల కారణంగా బాక్సాఫీస్ వద్ద ఊపందుకుంది. గత వారాంతంలో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి 'భోళా శంకర్' మొత్తం రూ. 20 కోట్లు రాబట్టింది.
భారతీయ హీరోలంతా థియేటర్‌లకు ప్రేక్షకులను రప్పించి పరిశ్రమలో కొత్త శక్తిని నింపారు. చాలా కాలంగా మిస్సయిన హుషారు ఇప్పుడు కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్పందిస్తున్నారు. ఉదయాన్నే షోలు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. గత నెలలో క్రిస్టోఫర్ నోలన్ చిత్రం ఓపెన్‌హైమర్ -మార్గోట్ రాబీ -ర్యాన్ గోస్లింగ్ నటించిన గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన బార్బీ భారతీయ బాక్సాఫీస్ వద్ద వారాంతంలో రూ.100 కోట్లను రాబట్టాయి.
సాధారణంగా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్‌లకు తరలి వచ్చే మార్వెల్ లేదా DC సూపర్ హీరో ఫ్రాంచైజీలకు చెందని ఈ సినిమాలు అద్భుతాలు చేసాయని టాక్ వచ్చింది. కరణ్ జోహార్ ఫ్యామిలీ డ్రామా-రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ కూడా వీక్షకులను ఆకర్షించడంలో పట్టణాల్లోని మాస్‌ని థియేటర్లకు రాబట్టడంలో సఫలమైంది.
ఈ వారాంతం ప్రజలకు అద్భుతమైన అనుభవం. నిజానికి అగ్ర హీరోల చిత్రాలను ప్రజలు ఇష్టపడతారని ప్రెసిడెంట్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శిబాశిష్ సర్కార్ అన్నారు. MAI ప్రెసిడెంట్ కమల్ జియాన్‌చందానీ మాట్లాడుతూ,-''ఇది చారిత్రాత్మకమైన వారాంతం.. భారతదేశ ప్రజలు గొప్ప చిత్రాలను చూడటానికి సినిమా థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడతారని మరోసారి రుజువు అయింది'' అన్నారు.